వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య
ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం
బుద్దారంలో దారుణ ఘటన
భార్య, ప్రియుడు సహా ముగ్గురి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్
వెల్లడించిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు
స్పాట్ వాయిస్, గణపురం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో భర్తను కిరాతకంగా హతమార్చిన భార్య, ఆమె ప్రియుడు సహా మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలను డీఎస్పీ సంపత్‌రావు, సీఐ కరుణాకర్‌రావు, ఎస్సై అశోక్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన పెండెల సంపత్(32) ప్లంబర్‌గా పనిచేస్తూ, బుద్దారంలోని అత్తగారింట్లో భార్య సుమలత(26)తో కలిసి నివాసముంటున్నాడు. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలంగా బుద్దారానికి చెందిన ఉమ్మల శ్రీకాంత్(36)తో సుమలత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంపత్.. శ్రీకాంత్‌ను పలుమార్లు హెచ్చరించాడు.
రూ. లక్ష సుపారీతో హత్యకు ప్లాన్..
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న సంపత్‌ను కడతేర్చాలని సుమలత, శ్రీకాంత్ పథకం వేశారు. హత్యకు సహకరించేందుకు అదే గ్రామానికి చెందిన పోలుదాసరి తరుణ్(23) అనే యువకుడికి రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. పథకం ప్రకారం ఈ నెల 17వ తేదీ రాత్రి శ్రీకాంత్, తరుణ్‌లు సంపత్‌ను మద్యం తాగుదామని నమ్మించి బుద్దారంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యంలో పురుగుల మందు కలిపి సంపత్‌తో తాగించారు. తీవ్ర అస్వస్థతకు గురైన సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..
సంపత్ మరణించిన అనంతరం నిందితులు మృతదేహాన్ని పల్సర్ బైక్‌పై ఎక్కించుకుని అతని ఇంటికి తీసుకొచ్చారు. సంపత్ స్వయంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు మృతదేహం నోటిపై, దుస్తులపై, ఇంటి నేలపై పురుగుల మందు పోసి అక్కడి నుంచి పరారయ్యారు.
కేసు ఛేదించిన పోలీసులు..
మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాలు, సాక్షుల విచారణతో ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన హత్యగా నిర్ధారించారు. పోలీసుల నిఘా పెరగడంతో భయాందోళనకు గురైన నిందితులు గ్రామ పెద్దల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన పల్సర్ బైక్, మూడు సెల్‌ఫోన్లు, రూ.500 నగదుతో పాటు పురుగుల మందు కలిపిన మద్యం బాటిల్, పురుగుల మందు సీసాను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుమలత, శ్రీకాంత్, తరుణ్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు.

