కుట్రలను చీల్చుకుంటూ ఎదిగిన..
పదవులు రాకుండా ఎన్నో కుట్రలు..
అయినా ఎదుగుదలను ఆపలేకపోయారు
ఎమ్మెల్సీ గెలుపూ రాజకీయ కుట్రే..
పనితనంతో చీఫ్ విప్‌గా ఎదిగా..
భూపాలపల్లే నా కుటుంబం..
మళ్లీ అవకాశం వస్తే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా..
భూములను కాపాడాలని కోర్టులో పోరాడా..
కబ్జా ఆరోపణలు రాజకీయ కుట్రే..
ప్రజలతో ఉన్న అనుబంధమే నా బలం
మళ్లీ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తా..
మహిళా రిజర్వేషన్ వస్తే బరిలోకి జ్యోతి
గౌతమ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చినా స్వాగతమే
డిజిటల్ మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి
స్పాట్ వాయిస్, ప్రధాన పత్రినిధి : రాజకీయాల్లో తన ఎదుగుదల అంతా పోరాటాలతోనే సాగిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం రావడం నుంచి రెండుసార్లు మంత్రి పదవి చేజారడం వరకు ప్రతి మలుపు వెనుక రాజకీయ పరిణామాలు, కుట్రలు ఉన్నాయని చెప్పారు. పదవులు దక్కకపోయినా తన పనితీరే తన ఎదుగుదలకు కారణమైందన్నారు. భూపాలపల్లితో తన అనుబంధం కుటుంబ బంధం లాంటిదని, మళ్లీ అవకాశం వస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్‌వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనపై వస్తున్న భూకబ్జాల ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గమంతా పాదయాత్ర చేసి తాను చేసిన పనులను, ఇంకా చేయాల్సిన పనులను ప్రజల ముందుంచుతానన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన వ్యక్తిగత, రాజకీయ జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను గండ్ర వెంకటరమణారెడ్డి పంచుకున్నారు.
రెండుసార్లు మంత్రి పదవి మిస్..
2011లో మంత్రి అయ్యే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో చేజారిందని గండ్ర తెలిపారు. పార్టీ అధిష్టానం నుంచి తన పేరు వచ్చిందని, అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ‘డన్.. నీ పేరు వచ్చింది’ అని చెప్పారని గుర్తుచేశారు. మరుసటి రోజు గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారం ఉంటుందని భావించి ఇంటికి వెళ్లానని, అయితే ఉదయం తనకు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. అక్కడికి వెళ్లేసరికి ప్రమాణ స్వీకారం పూర్తయిందని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య సైతం ‘గండ్ర.. నీ పేరు కేబినెట్‌లో ఎలా మిస్ అయింది?’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ ఇదే విధంగా కుట్రలు జరిగాయని, హైకమాండ్ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ స్థానిక పరిణామాల కారణంగా రెండోసారి కూడా మంత్రి పదవి దక్కలేదన్నారు. అయితే తన ఎదుగుదలను ఎవరూ ఆపలేకపోయారని, 2012లో చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టానని, 2018లో ఫస్ట్ స్పీచ్ తనదేనని చెప్పారు.
ఎమ్మెల్సీ సీటూ అనుకోకుండా..
2007లో ఎమ్మెల్సీగా అవకాశం రావడం కూడా ఒక రాజకీయ కుట్రేనని గండ్ర చెప్పారు. తొలుత హనుమకొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైఎస్ ఆలోచించారని, అక్కడ అవకాశం లేకపోవడంతో వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని భావించానన్నారు. తనకు టికెట్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయిందని, తాను కూడా పోటీకి సిద్ధమయ్యానన్నారు. అయితే తాను పోటీ చేయడం కొందరికి ఇష్టం లేక పొత్తులో భాగంగా రెండు ఎంపీ టికెట్లను అప్పటి టీఆర్ఎస్‌కు ఇచ్చారని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రెండుస్థానాలు ఖాళీగా ఉండడంతో అందులో ఒక స్థానం అప్పటికే ఓ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి ఖరారైందన్నారు. దీంతో తాను తొలుత వద్దనుకున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వెళ్లానని చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్ బలం తక్కువగా ఉండటంతో ఓడిపోతానని కుట్రదారులంతా భావించారని, కానీ కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు పొత్తులో టీఆర్ఎస్ సంపూర్ణంగా సహకరించడంతో 115 ఓట్లతో గెలిచానన్నారు.
నా పనితీరే నా ఎదుగుదల
ఎలాంటి రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఈ స్థాయికి ఎదిగానని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. అప్పట్లో కొంతమంది రాజకీయాల్లో హవా నడిపేవారని, వారిని అధిగమించి తాను ఎదిగానన్నారు. ఎంతో కష్టపడ్డానని, తన పనితీరే తన ఎదుగుదలకు కారణమని చెప్పారు. ‘రాజకీయాలంటేనే కుట్ర. తడిగుడ్డతో గొంతు కోస్తారు. నవ్వుతూనే ప్రాణం తీస్తారు. నన్ను తొక్కేందుకు, నాకు అవకాశాలు రాకుండా చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. నేను కడక్‌గా ఉండేవాడిని. భయపడేవాడిని కాదు. అందుకే నెట్టుకొచ్చానన్నారు.
1989 నుంచే పూర్తిస్థాయి రాజకీయాలు
1989 నుంచి పూర్తిస్థాయి రాజకీయాల్లో పనిచేశానని గండ్ర చెప్పారు. యూత్ కాంగ్రెస్‌లో జిల్లా స్థాయిలో పనిచేశానన్నారు. ఆ రోజుల్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండేదని, తమ ఇల్లు రోడ్డుకు ఆనుకుని ఉండటంతో రాజకీయాల్లో యాక్టివ్‌గా తిరుగుతున్న తనను తీసుకెళ్లారని తెలిపారు. అనంతరం తమ ఇంటిని పేల్చేశారని చెప్పారు. తండ్రి రాజకీయాలు వద్దని చెప్పేవారని, అయితే తన పట్టుదల, పోరాటాన్ని చూసి తర్వాత అండగా నిలిచారని తెలిపారు. 1999లో అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించినా రాలేదన్నారు. 2001లో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానని, 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా, రికార్డు స్థాయిలో పనిచేశానని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డానన్నారు. సోషల్ మీడియా లేని రోజుల్లో టీవీలు, పత్రికలే ఉండేవని, రోజూ కార్యక్రమాలు చేస్తూ ప్రజల కోసం పోరాడేవాళ్లమన్నారు. 2004లో ప్రభుత్వం రావడంలో కీలకంగా పనిచేశానని, 2014 వరకు డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగానని చెప్పారు. ఆ సమయంలో తనను ఎవరూ తొలగించలేదని, తానే తప్పుకున్నానన్నారు.
టీడీపీ టికెట్ వచ్చినా వెళ్లలేదు
2004లో టీడీపీ నుంచి తనకు టికెట్ ఆఫర్ వచ్చిందని గండ్ర తెలిపారు. అయితే తాను చేసిన పోరాటం అంతా టీడీపీకి వ్యతిరేకంగానే సాగిందని, అలాంటి పార్టీలోకి వెళ్లి టికెట్ తీసుకోవడం సరికాదని భావించి ఆ అవకాశాన్ని వదులుకున్నానన్నారు. ఎన్టీఆర్ అంటే నటుడిగా తనకు అభిమానం ఉందని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన కొన్ని పాలనా సంస్కరణలు గుర్తుండిపోయాయని, తన తరం చూసినంత మార్పును ఇంకే తరం చూసి ఉండదని అన్నారు. తాను రెండుసార్లు కరువును చూశానని గుర్తుచేశారు.
2019లో బీఆర్ఎస్‌లోకి..
2019లో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరానని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. కేటీఆర్‌తో ఉద్యమ సమయం నుంచే పరిచయం ఉందని, కేసీఆర్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. కేసీఆర్ పని విధానం భిన్నంగా ఉంటుందని చెప్పారు. కేసీఆర్ కలవడం లేదు.. కలవడం లేదు అంటారు. కానీ కలిసిన రోజు సమస్యలన్నీ తీరిపోతాయి. పెండింగ్ పనులన్నీ క్లియర్ అవుతాయి. 30 నిమిషాలో, గంట సమయమో అనుకుంటే ఒక్కోసారి రోజు, ఓ పూట అంతా ఆయనే సమయం తీసుకుంటారు. ప్రతి విషయంలో ఆయనకు అవగాహన ఉంటుంది. ఏ విషయంపైనైనా, ఏ సమస్యపైనైనా అనర్గళంగా మాట్లాడుతారని గండ్ర చెప్పారు.
భూపాలపల్లే నా కుటుంబం
భూపాలపల్లి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని గండ్ర రమణారెడ్డి తెలిపారు. అప్పట్లో భూపాలపల్లి సమస్యలకు కేరాఫ్‌గా ఉండేదని, తాను డిగ్రీ, ఇంటర్ కాలేజీలు తీసుకొచ్చానన్నారు. మొదట్లో ప్రాథమిక వైద్య కేంద్రం మాత్రమే ఉండేదని, ఇప్పుడు మెడికల్ కాలేజీ, 100 పడకల ఆస్పత్రితో మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. సింగరేణి కార్మికుల కోసం 2 వేల క్వార్టర్స్ నిర్మించామని, చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల వెడల్పు తదితర అనేక పనులు చేశామని తెలిపారు. బైపాస్ రోడ్డు మంజూరైనా పూర్తికాలేదన్నారు. నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని చెప్పడం లేదని, ఇంకా కొన్ని మేజర్ సమస్యలు ఉన్నాయని చెప్పారు. పబ్లిక్‌ను సాటిస్‌ఫై చేయడం అంత ఈజీ కాదు. నేను నిధుల కోసం బరాబర్‌గా నిలదీసి తెచ్చేవాడిని. భూపాలపల్లి పట్టణం సమ్మిళితం. ఇక్కడ కార్మికులు ఎక్కువ. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఉంటారు. నా ప్రయాణం అంతా భూపాలపల్లితోనే. నా కుటుంబమే భూపాలపల్లి. భూపాలపల్లి డెవలప్‌మెంటే నా లక్ష్యం. మళ్లీ ఆశీర్వదిస్తే రాష్ట్రంలో నంబర్‌వన్‌గా చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
భూకబ్జాలంటూ నిందలు..
తనపై భూకబ్జాలంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గండ్ర అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, సీఎంపై పరువు నష్టం కేసు వేశానని తెలిపారు. ఎకో పార్క్ ఏర్పాటు చేసింది తానేనని, వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశానన్నారు. భూమిని కాపాడాలని కోర్టుకు వెళ్లి పోరాడిన తనపైనే భూకబ్జా ఆరోపణలు చేస్తూ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బట్టకాల్చి మీద వేయాలని చూస్తున్నారు. నాకు భూకబ్జాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. భూపాలపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం కోసం గుడి నిర్మిస్తే దాన్ని కూడా రాజకీయం చేశారని, ప్రభుత్వ భూమిలో నిర్మించిన గుడిపై కేసులు వేశారని, నిర్మాణంలో అడుగడుగునా ఇబ్బందులు పెట్టారని తెలిపారు.
అన్ని వర్గాలను మోసం చేసిన సర్కార్
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిందని గండ్ర విమర్శించారు. ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉందో సగటు రైతులే చెబుతారన్నారు. పెన్షన్, రైతు భరోసా, బీమా, ఆడబిడ్డలకు రూ.2,500, యూరియా కష్టాలు.. ఇలా ఒక్కటేమిటని, అన్ని సమస్యలేనన్నారు. అన్ని మోసాలే. ప్రజలంతా మాయ నుంచి తేరుకున్నారు. రేవంత్ సర్కార్‌ను అనస్థీషియా ఇచ్చి మళ్లీ పడుకోబెట్టే కాలం దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎమ్మెల్యే దీపం ఉండగానే సక్కబెట్టుకోవాలనే చందంగా పనిచేస్తున్నారని, తమ్ముడు, కుటుంబ సభ్యులకు వసూళ్ల కోసం శాఖలను పంచారని ఆరోపించారు. ఆయన తీరుతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
పనికి గుర్తింపు లేకుండా పోయింది
ప్రస్తుత రాజకీయాల్లో గెలుపు, ఓటములకు పనులకు సంబంధం లేకుండా పోయిందని గండ్ర అభిప్రాయపడ్డారు. గతంలో పని చేసే వ్యక్తిని గుర్తించి ప్రజలు ఎన్నుకునేవారని, ఇప్పుడు ఎంత పని చేసినా ఓటు వేసే వరకు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో ప్రజలు విలువలున్న రాజకీయ నాయకులను ఎన్నుకునేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. మళ్లీ నియోజకవర్గమంతా పాదయాత్ర చేస్తాను. జరిగిన మోసాలను ప్రజలకు వివరిస్తాను. నేను చేసిన పనులను కూడా ప్రజలకు చెబుతాను. ప్రజలతో నాకు ఉన్న అనుబంధమే నా బలం. భూపాలపల్లి అభివృద్ధి కోసం నేను చేసిన పనులను, ఇంకా చేయాల్సిన పనులను ప్రజల ముందుంచుతానని తెలిపారు.
రిజర్వేషన్ వస్తే గండ్ర జ్యోతి బరిలో
తన భార్య గండ్ర జ్యోతి నుంచి తనకు పూర్తి మద్దతు ఉంటుందని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మహిళలతో ఆమెకు మంచి అనుబంధం ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ వస్తే తప్పకుండా ఎమ్మెల్యే బరిలో గండ్ర జ్యోతి ఉంటారని చెప్పారు. ఇప్పటికే వరంగల్ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారని, భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌చార్జ్‌గా కూడా పనిచేశారని తెలిపారు. మహిళల్లో ఆమెకు ఉన్న అనుబంధం, రాజకీయ అనుభవం ఉపయోగపడతాయని అన్నారు.
కేటీఆర్ టీంలో గౌతమ్
తన కొడుకు గండ్ర గౌతమ్ రాజకీయ ప్రవేశం ఆయన ఇష్టమని గండ్ర తెలిపారు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా తాను వద్దననన్నారు. తనకు నచ్చిన సమయంలో రాజకీయాల్లోకి రావచ్చని చెప్పారు. రానున్న రోజుల్లో గౌతమ్ కేటీఆర్ టీంలో ఉంటారని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలి. గౌతమ్ కూడా తనకు నచ్చిన సమయంలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నని అన్నారు.
డబ్బే రాజకీయాల్లో ప్రధాన సమస్య
చిన్నప్పటి నుంచి తమది కొంత ఉన్న కుటుంబం కావడంతో పెద్దగా ఇబ్బందులు పడలేదని గండ్ర చెప్పారు. రాజకీయాల్లో డబ్బే ప్రధాన సమస్యగా మారిందన్నారు. డబ్బు ఉంటే రాజకీయ ప్రయాణం సాఫీగా సాగుతుందని, రాజకీయం అంటే డబ్బులతో ముడిపడిన అంశంగా మారిందన్నారు. అందుకే బిజినెస్ వైపు కూడా అడుగులు వేశానని తెలిపారు. రిజర్వేషన్ కలిసి రావడంతో 2005లో తన భార్య గండ్ర జ్యోతిని వరంగల్ మేయర్‌గా చేయాలని భావించానని చెప్పారు. తనకు టికెట్లు మిస్ కావడంతో వైఎస్‌తో మాట్లాడి బరిలో నిలిచామని, కానీ గెలిచిన తర్వాత జరిగిన కుట్రలతో అదీ మిస్ అయిందన్నారు. రాజకీయాల్లో ఎదగకుండా కుట్రలు సైలెంట్‌గా చేస్తుంటారని వ్యాఖ్యానించారు.
పరకాల గడ్డపై పుట్టి..
తాను పరకాల గడ్డపై పుట్టానని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. పరకాలలో రెండో తరగతి వరకు చదువుకున్నానని, హన్మకొండ సెయింట్ జోసఫ్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివి, హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ పూర్తి చేశానన్నారు. చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయాలనే ఆలోచన తనకు లేదని, ఏదైనా అడ్వెంచర్ చేయాలనే ఆలోచన ఉండేదన్నారు. వ్యవసాయం అంటే చిన్నప్పటి నుంచే తనకు చాలా ఇష్టమని, ఇప్పటికీ ఖాళీ సమయం దొరికితే పొలాల దగ్గరకు వెళ్తానన్నారు. వ్యవసాయ పనులన్నీ తనకు తెలుసని చెప్పారు. తమ కుటుంబానికి చిన్నప్పటి నుంచే భూములు ఉన్నాయని, అప్పట్లో కూలీలు తమ ఇంటికి వచ్చి తిండికి అడిగితే జొన్నలు ఇచ్చేవాళ్లమన్నారు. పని సీజన్‌లో వచ్చి కూలీ తీసుకోకుండా కూడా పనిచేసేవారని, అప్పట్లో ఆ నియత్ ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఒకరికి తిండిపెట్టాల్సిన అవసరం కూడా లేకుండా పోయిందన్నారు.
పాలిటెక్నిక్‌లోనే ఉద్యమాల బాట
పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలోనే విద్యార్థి నాయకుడిగా పనిచేశానని గండ్ర చెప్పారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్ సెకండియర్‌లో అడ్మిషన్లు వచ్చేలా చేసిన పోరాటాలు తమ ఉద్యమాల వల్లే జరిగాయని చెప్పారు. ఆ ఉద్యమాల కారణంగా తాను అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యానన్నారు. ‘ఊ అంటే ఉద్యమాలు చేస్తున్నావు’ అంటూ తనను ట్రాన్స్‌ఫర్ చేశారని తెలిపారు. తాను చదువుకున్న కాలేజీలోనే దివంగత పీజేఆర్ కూడా చదువుకున్నారని, తన దూకుడు చూసిన కాలేజీ ప్రిన్సిపాల్ ‘పీజేఆర్ మన కాలేజీలోనే చదువుకున్నాడు.. ఆయన లీడర్ అయ్యాడు.. నువ్వు కూడా లీడర్ అవుతావు. తొందరపడకు’ అని చెప్పేవారని గుర్తుచేశారు. ఆ మాట ఇప్పటికీ గుర్తుందని అన్నారు. ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి తొలగించినప్పుడు అన్యాయం జరిగిందనే ఆలోచనతో బస్సు టైర్లలో గాలి తీశామని, ఇలా ఎన్నో ఉద్యమాలు చేశామని చెప్పారు. అప్పట్లో తాను చాలా దూకుడుగా ఉండేవాడినని తెలిపారు. ఒకసారి హయగ్రీవాచారి దగ్గరకు వెళ్లినప్పుడు ‘నీ అనుభవం అంతా నా వయస్సు లేదు నీకు.. ఇంత దురుసు ఎందుకు?’ ..అంటూ ఆయన కన్నెర్ర చేశారని గుర్తుచేశారు.

