స్పాట్ వాయిస్, బ్యూరో : తెలంగాణలో ఇన్ఫ్లుయెంజా ఏ (హెచ్1ఎన్1) కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసుల తాకిడి కనిపిస్తోంది. కొందరిలో వైరస్ తీవ్ర న్యుమోనియాకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో హెచ్1ఎన్1తో ఓ రోగి మృతి చెందినట్లు సమాచారం ఉన్నా, వైద్యారోగ్య శాఖ ధ్రువీకరించలేదు. చిన్నారులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, గుండె సమస్యలున్న వారికి ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దగ్గు, తుమ్ముల తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, మాస్క్ ధరించడం ద్వారా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తీవ్ర లక్షణాలున్నవారు మాత్రమే వైద్యుల సూచనతో యాంటీవైరల్ మందులు వాడాలని, లక్షణాలు కనిపించిన 48 గంటల్లోపు చికిత్స ప్రారంభిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని పేర్కొంటున్నారు.

