- గిదా మనం తింటున్నది..?
ఛీ.. ఛీ.. ఔట్‌సైడ్ ఫుడ్!
స్వీట్లలో ఫేషియల్ రోజ్‌వాటర్..
చెక్కర పాకంలో దోమలు
చిప్స్‌కు కుళ్లిన బంగాళాదుంపలు..
బయట ఆహారంపై పెరుగుతున్న ఆందోళన..
వినియోగదారులారా తస్మాత్ జాగ్రత్త!
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: హోటల్లో స్వీట్ కనిపిస్తే లొట్టలేస్తాం.. రోడ్డుపక్కన వేడివేడి చిప్స్ కనిపిస్తే కొనుక్కుని తింటాం.. ఫుడ్ డెలివరీ యాప్‌లో నచ్చిన వంటకం కనిపిస్తే ఆర్డర్ పెట్టేస్తాం..! రుచి బాగుంటే మరోసారి అదే ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తాం. కానీ మనల్ని ఆకర్షించే ఆ రుచుల వెనుక ఏం జరుగుతోంది? మనం తింటున్నది నిజంగా ఆహారమేనా.. లేక అనారోగ్యానికి ఆహ్వానమా..? హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఆహార తయారీ కేంద్రాల తనిఖీల్లో బయటపడిన విషయాలు ఈ ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ముఖానికి రాసుకునే ఫేషియల్ రోజ్‌వాటర్‌తో స్వీట్లు తయారు చేయడం.. చక్కెర పాకంలో చనిపోయిన దోమలు కనిపించడం.. చిప్స్ తయారీకి కుళ్లిన బంగాళాదుంపలు, బూజు పట్టిన అల్లం వినియోగానికి సిద్ధంగా ఉంచడం.. ఇవన్నీ బయట ఆహారం విషయంలో వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో చెబుతున్నాయి.
తీపి వెనుక ఇంతటి అపరిశుభ్రతా..?
స్వీట్లు అంటే పండుగలు, వేడుకలు, అతిథి మర్యాదలు గుర్తుకొస్తాయి. రంగురంగుల మిఠాయిలు చూసి కొనుగోలు చేస్తాం. కానీ వాటి తయారీలో వాడే పదార్థాలు, తయారీ ప్రదేశాల పరిశుభ్రత గురించి చాలామంది పట్టించుకోరు. స్వీట్ల తయారీలో ఫేషియల్ రోజ్‌వాటర్ వాడటం, చక్కెర పాకంలో చనిపోయిన దోమలు కనిపించడం ఆహార తయారీలో నిర్లక్ష్యాన్ని బయటపెడుతున్నాయి. చిప్స్ కోసం కుళ్లిన బంగాళాదుంపలు, బూజు పట్టిన అల్లం నిల్వ ఉంచడం కూడా ఆందోళన కలిగిస్తోంది. గడువు ముగిసిన రూ.9,400 విలువైన ఆహార పదార్థాలను గడువు ఉన్న సరుకుతో కలిపి ఉంచడం మరో తీవ్రమైన లోపం.

కనిపించని ప్రమాదాలు ఎన్నో..!
ఆహారం తయారు చేసే చోట పరిశుభ్రత లేకపోతే దాని ప్రభావం తినేవారిపైనా పడే ప్రమాదం ఉంటుంది. తనిఖీల్లో కొన్ని కేంద్రాల్లో కుక్కలు సంచరించడం, అపరిశుభ్రమైన నీటి ట్యాంకులు, దుర్వాసన వెదజల్లే డ్రైనేజీలు, జిడ్డుతో కూడిన నేలలు కనిపించాయి. తుప్పుపట్టిన యంత్రాలు, నూనె నిల్వ ట్యాంకులు, దుమ్ముతో నిండిన పరికరాలు కూడా గుర్తించారు. విద్యుత్ కంట్రోల్ ప్యానెళ్లలో ముడి సరుకును నిల్వ ఉంచడం, తెరిచి ఉన్న విద్యుత్ బోర్డులు, సరిగా నిర్వహించని అగ్నిమాపక పరికరాలు భద్రతాపరమైన లోపాలను సూచిస్తున్నాయి. సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ శిక్షణ, వైద్య ధ్రువపత్రాలు లేకపోవడం.. నీటి నాణ్యత పరీక్షలు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు నిర్వహించకపోవడం.. ఆప్రాన్లు, గ్లౌజులు వాడకపోవడం కూడా సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. బయటకు ఆకర్షణీయంగా కనిపించే ఆహారం తయారీ వెనుక ఇన్ని లోపాలు ఉండొచ్చని వినియోగదారులు గుర్తించాలి.
మార్పు రావాలి
తెలంగాణ ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో తొమ్మిది తయారీ కేంద్రాల లైసెన్సులు సస్పెండ్ అయ్యాయి. నాలుగు షోకాజ్ నోటీసులు, ఒక ఇంప్రూవ్మెంట్ నోటీసు జారీ చేశారు. మరో కేంద్రం లైసెన్స్ సస్పెన్షన్‌కు సిఫార్సు చేశారు. సరైన లేబుళ్లు, చిరునామా వివరాలు లేని 5,045 కిలోల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.5,41,150. తప్పుడు లేబులింగ్ ఉన్న 80 కిలోల ప్యాకేజింగ్ మెటీరియల్‌ను ధ్వంసం చేశారు. అనుమానాస్పద ఆహార నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.


