ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeటెక్నాలజీవిద్యుత్‌ సవాల్‌ను ఎదుర్కొంటాం

విద్యుత్‌ సవాల్‌ను ఎదుర్కొంటాం

📰 Generate e-Paper Clip

విద్యుత్‌ సవాల్‌ను ఎదుర్కొంటాం
ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. సప్లై ఆగదు!
డిమాండ్ కు సరిపడా కరెంట్ ఇస్తాం..
వేసవికి ముందస్తు కార్యాచరణ

అక్టోబరులో 6,700 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌
రానున్న నాలుగు నెలలు కీలకం..
సమ్మర్ కోసం 4,500 పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం
57 సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రణాళిక
పంటల అవసరాలకు అదనపు విద్యుత్‌..
సౌర విద్యుత్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం..
ఆధునిక సాంకేతికతతో పంపిణీ వ్యవస్థ మరింత బలోపేతం
ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ఎల్‌నినో ప్రభావం–విద్యుత్‌ సరఫరాలో సవాళ్లపై టీడీఎంయూ ప్రతినిధులతో చిట్‌చాట్‌

స్పాట్‌ వాయిస్‌, ప్రధాన ప్రతినిధి: రానున్న వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌ ఎంత పెరిగినా.. ప్రజలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, వ్యవసాయ అవసరాలు అధికమవడం వంటి పరిస్థితులను ముందుగానే అంచనా వేసి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 4,500 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయగా, వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకుని మరో 50 సబ్‌స్టేషన్లు, విద్యుత్‌ లైన్ల నిర్మాణం, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్య పెంపునకు కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ అందించడంతోపాటు, గృహ అవసరాల్లో పెరిగే డిమాండ్‌ను సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సౌర విద్యుత్‌ వినియోగాన్ని విస్తరించడం, బ్యాటరీల్లో విద్యుత్‌ నిల్వ చేసే అవకాశాలను పరిశీలించడం, ఆధునిక సాంకేతికతతో సరఫరాను పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని వివరించారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా యూనియన్‌ ప్రతినిధులతో బుధవారం ఆయన ‘ఎల్నినో ప్రభావం–విద్యుత్‌ సరఫరాలోని సవాళ్లు’ అనే అంశంపై చిట్‌చాట్‌ నిర్వహించారు.

డిమాండ్‌కు అనుగుణంగా ఏర్పాట్లు
విద్యుత్‌ వినియోగం ఏటా పెరుగుతున్నప్పటికీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని వరుణ్‌రెడ్డి తెలిపారు. గతేడాది అక్టోబరులో ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 3,642 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది అదే నెలలో 6,708 మెగావాట్లకు చేరిందని వివరించారు. గత నెలలోనూ దాదాపు 7,000 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో 18,548 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదవగా, అక్టోబరులోనే 20,018 మెగావాట్ల రికార్డు డిమాండ్‌ నమోదైందని చెప్పారు. ఉష్ణోగ్రతలు పెరగడం, ఏసీలు, కూలర్ల వినియోగం అధికమవడం, వర్షాభావంతో భూగర్భ జలాలు తగ్గి వ్యవసాయ మోటార్ల వినియోగం పెరిగిందన్నారు.
గతేడాది 4.4 మీటర్ల లోతులో ఉన్న నీరు.. ఈ ఏడాది 7.7 మీటర్ల లోతుకు పడిపోయానని, దీంతో మోటార్లపై లోడు పడి విద్యుత్ బర్డెన్ ఏర్పడిందన్నారు. (డీటీఆర్) ట్రాన్స్ ఫార్మర్స్ పై అధిక లోడ్ ఉందన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల నిర్వహణ కూడా విద్యుత్‌ అవసరాలపై ప్రభావం చూపుతోందన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను ముందుగానే సిద్ధం చేయడం ద్వారా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

వేసవికి ముందే.. బలోపేతం
ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగే అవకాశాలున్నాయన్న నిపుణుల సూచనలతో విద్యుత్‌ శాఖ ముందస్తు కార్యాచరణ చేపట్టిందని సీఎండీ తెలిపారు. వేసవి ప్రణాళికలో భాగంగా ఇప్పటికే దాదాపు 4,500 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడంతోపాటు కొత్త 33 కేవీ, 11 కేవీ విద్యుత్‌ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కొత్తగా మరో 50 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అధిక లోడ్‌ నమోదవుతున్న 35 ఫీడర్లలో కండక్టర్ల సామర్థ్యం పెంచడం, బూస్టర్లు ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతున్నట్లు వివరించారు. పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, సరఫరా ప్రారంభమైందని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా కొనసాగుతోందని, లైన్ల పనులకు టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. డిసెంబర్‌ చివరి నాటికి లేదా జనవరి మధ్యలోగా కీలక మౌలిక సదుపాయాల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

రైతులకు అండగా అదనపు విద్యుత్‌
వ్యవసాయ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వరుణ్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది మోటార్ల వినియోగం పెరిగినా, ముందస్తుగా విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయడం, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచడం వంటి చర్యలు చేపట్టామన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్‌ అందుబాటులో ఉంచేందుకు అన్ని జిల్లాల్లో మూడు నెలలకు సరిపడా డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను త్వరగా మార్చేందుకు అదనంగా సుమారు 40 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సాధ్యమైనంత వరకు 24 గంటల్లోనే ట్రాన్స్‌ఫార్మర్‌ మార్పిడి పూర్తి చేస్తున్నామని వివరించారు. వరి పంటల నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ విద్యుత్‌ సరఫరా ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. పంట కోతకు మరో 15 నుంచి 20 రోజుల సమయం ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో అదనపు విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 10 నుంచి ఒంటి గంట వరకు, తిరిగి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రెండు విడతల్లో అదనపు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులతో చర్చించి, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అధికారులు తెల్లవారుజామునే క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులతో మాట్లాడుతున్నారని, తక్కువ వోల్టేజీ సమస్యలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నారని వివరించారు.

సోలార్‌ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి
భవిష్యత్‌ విద్యుత్‌ అవసరాలను తీర్చడంలో సౌర విద్యుత్‌ కీలక పాత్ర పోషిస్తుందని సీఎండీ పేర్కొన్నారు. పీఎం కుసుమ్‌ పథకం కింద 600 మెగావాట్ల విద్యుత్‌ సేకరించాలని నిర్ణయించామని, ఇప్పటికే 120 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మరో 300 మెగావాట్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే ఏడాది నాటికి 450 మెగావాట్ల వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. సోలార్‌ విద్యుత్‌ అధికంగా ఉత్పత్తి అయ్యే సమయాల్లో మిగులు విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించే విధానంపైనా కసరత్తు చేస్తున్నామన్నారు. పట్టణాల్లో సోలార్‌ రూఫ్‌టాప్‌ వ్యవస్థలపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, సుమారు 40 వేల మంది ఇప్పటికే సోలార్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మరో 20 వేల మంది దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ సోలార్‌ విద్యుత్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.
ఆధునిక సాంకేతికతతో మెరుగైన సేవలు
విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని వరుణ్‌రెడ్డి తెలిపారు. రియల్‌టైమ్‌ ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఆర్‌టీఎఫ్‌ఎంఎస్‌), ఎస్సీఏడీఏ ఆధారిత పర్యవేక్షణతో ఫీడర్లపై లోడ్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నామన్నారు. ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లు, డ్రోన్‌ ఆధారిత తనిఖీలు, జీఐఎస్‌ మ్యాపింగ్‌, ఆటోమేటిక్‌ మీటర్‌ రీడింగ్‌, ఏఐ ఆధారిత చాట్‌బాట్‌, డిజిటల్‌ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల ద్వారా సేవలను మరింత వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. విద్యుత్‌ లోపాలను త్వరగా గుర్తించడం, సరఫరాను పునరుద్ధరించడం, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును సమర్థంగా పర్యవేక్షించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీరాజ్‌ విభాగాల్లో విద్యుత్‌ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు, సాగునీటి ప్రాజెక్టులకు విద్యుత్‌ సరఫరాలో ప్రస్తుతం ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.

 అధిక లోడ్‌ పడకుండా చర్యలు
ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యానికి మించి మోటార్లు ఏర్పాటు చేయడం కూడా వైఫల్యాలకు కారణమవుతోందని వరుణ్‌రెడ్డి తెలిపారు. చెరువులు, కాలువల నుంచి నీటిని తోడేందుకు అదనపు మోటార్లు ఏర్పాటు చేయడం, బోరుబావులకు మరిన్ని మోటార్లు అమర్చడం, పాత బావులను తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వల్ల విద్యుత్‌ లోడ్‌ పెరుగుతోందన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. తక్కువ వోల్టేజీ సమస్యలు ఎదురైనప్పుడు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ట్యాప్స్‌ సర్దుబాటు చేయడం, కెపాసిటర్‌ బ్యాంకులు ఏర్పాటు చేయడం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఆరుతడి పంటల సాగుపై అవగాహన
నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల ఎంపికపై కూడా ఆలోచించాలని సీఎండీ సూచించారు. వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలతోపాటు, సాధ్యమైన చోట ఆరుతడి పంటలను ఎక్కువగా సాగు చేయడం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల భూగర్భ జలాలు మరింతగా అడుగంటకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్‌ సరఫరా నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాటిని అధిగమించేందుకు శాఖ అన్ని విధాలుగా సన్నద్ధమై ఉందని వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల్లో విద్యుత్‌ వినియోగం, నీటి పొదుపుపై అవగాహన కల్పించడంతోపాటు, క్షేత్రస్థాయిలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక, మౌలిక సదుపాయాల బలోపేతం, ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వలు, రైతులతో సమన్వయం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొని ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ అందించేందుకు చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular