కల్వర్ట్ను ఢీకొట్టిన ఇన్నోవా కారు
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : వినాయకుడిని పూజించి సంతోషంగా నగరానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని విధి మార్గమధ్యలో కబళించింది. స్వగ్రామంలో పూజలు ముగించుకుని కారులో బయలుదేరిన కొద్దిసేపటికే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం చౌడూర్ గ్రామానికి చెందిన కేతావత్ లింబ్య, జమున, కేతావత్ మాన్సింగ్, వస్రామ్తో పాటు డ్రైవర్ ఆశోక్ ఇన్నోవా కారులో నగరానికి బయలుదేరారు. పాలమాకుల వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి వేగంగా కల్వర్ట్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ ఆశోక్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ ప్రమాదంతో చౌడూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుగ వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు వెంటాడటం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
RELATED ARTICLES

