ePaper
Monday, September 7, 2026
ePaper
Homeఎడిటోరియల్పేరు కాదు.. పని ఫస్ట్..

పేరు కాదు.. పని ఫస్ట్..

📰 Generate e-Paper Clip

ఎఫెక్టివ్‌ పోలీసింగ్‌ లక్ష్యం
వరంగల్ కమిషనరేట్ అర్బన్‌-రూరల్‌ మిక్స్‌
గంజాయిపై ‘సంఘమిత్ర’ల నిఘా..
స్టేషన్‌ వారీగా క్రైం మ్యాపింగ్‌
ట్రాఫిక్‌ సమస్యలపై కొత్త వ్యూహం
పని ఏదైనా ప్రజల భాగస్వామ్యం ఉండాలి..
డిజిటల్ మీడియాతో చిట్ చాట్ లో సీపీ శ్వేత

స్పాట్‌ వాయిస్‌, ఓరుగల్లు : చారిత్రక నేపథ్యం.. నక్సల్‌ ప్రభావిత ప్రాంతం.. అర్బన్‌-రూరల్‌ మిక్స్‌.. ఇవన్నీ కలగలిసిన వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలో ప్రధాన నగరంగా ఉన్న ఓరుగల్లు ప్రాంతంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీసింగ్‌ ఉండాలని, అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల పరిస్థితులను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఎలాంటి పోలీసింగ్‌ అవసరమో గుర్తించి అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీపీ శ్వేతారెడ్డి కమిషనరేట్‌లో తన ప్రాధాన్యాలు, క్రైం కంట్రోల్‌, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ అంశాలపై ముచ్చటించారు.

ఓరుగల్లు పోలీసింగ్‌ ప్రత్యేకం..
వరంగల్‌ ప్రాంతంలో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించడం ఇదే తొలిసారని సీపీ శ్వేత తెలిపారు. గతంలో ఒకసారి వచ్చి 15 రోజులు డ్యూటీ చేసినట్లు చెప్పారు. వరంగల్‌కు గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, నక్సల్‌ ప్రభావిత ప్రాంతంగా కూడా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. హైదరాబాద్‌ పూర్తిగా అర్బన్‌ ప్రాంతం కాగా, వరంగల్‌ కమిషనరేట్‌లో అర్బన్‌తో పాటు రూరల్‌ ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పారు. అందుకే ఇక్కడి పోలీసింగ్‌ విధానం భిన్నంగా ఉంటుందని, రెండు ప్రాంతాల పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

గంజాయిపై ‘సంఘమిత్ర’ల నిఘా
నగరంతో పాటు గ్రామాలను పట్టిపీడిస్తున్న గంజాయిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టామని సీపీ తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా మహిళా సంఘాల సహకారం తీసుకుంటున్నామని, తల్లులుగా మత్తు పదార్థాల ప్రభావం వారికి బాగా తెలుసునని పేర్కొన్నారు. గంజాయిపై సమరంలో భాగస్వాములను చేస్తూ మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్రలు’గా నామకరణం చేసి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాజాగా జనగామలో జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించి గంజాయికి అలవాటుపడిన వారిని గుర్తించడం, మత్తు పదార్థాల ప్రభావం, సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాలు ఉండటంతో క్షేత్రస్థాయిలో గంజాయి వినియోగం, సరఫరాపై నిఘా పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రౌడీ షీట్ ఓపెన్
గంజాయి కేసుల్లో పదేపదే పట్టుబడుతున్న వారిపై రౌడీషీట్లు ఓపెన్‌ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. గంజాయి సరఫరాపై ప్రజల నుంచి పక్కా సమాచారం రావడం లేదని, ‘ఇక్కడ ఉందట.. వాళ్లు తాగుతున్నారట’ అనే సాధారణ సమాచారం కాకుండా సరఫరాదారులు, ప్రాంతాలు, వాహనాలపై స్పష్టమైన సమాచారం అందిస్తే దాడులు చేసి పట్టుకుంటామని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

సైబర్‌ క్రైంపై ప్రత్యేక దృష్టి
కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ కేసులు కూడా అధికంగానే ఉన్నాయని సీపీ తెలిపారు. కేసులను ప్రాపర్‌గా ఇన్వెస్టిగేట్‌ చేసి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. క్రైం ఇష్యూలు ఎక్కువగా ఉన్న మిల్స్‌ కాలనీ పోలీస్‌స్టేషన్‌పై ప్రత్యేక ఫోకస్‌ పెట్టామని, అదనపు ఎస్సైని నియమించినట్లు వెల్లడించారు. రౌడీయిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాల పనితీరును పరిశీలించే బాధ్యతను అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలకు అప్పగించినట్లు తెలిపారు. కాలనీల్లో సమావేశాలు నిర్వహించి కెమెరాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ట్రాఫిక్‌కు ప్రజల సహకారం తప్పనిసరి
వరంగల్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించామని సీపీ తెలిపారు. ట్రాఫిక్‌ సమస్య నిరంతరం ఉంటుందని, పోలీసుల చర్యలతో పాటు వాహనదారులు, ప్రజల సహకారం అవసరమన్నారు. యూటర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, రోడ్డు సేఫ్టీపై ఫోకస్‌ పెట్టామని చెప్పారు. కరుణాపురంలో వైన్స్‌కు పెద్ద పర్మిట్‌ రూమ్‌ ఉండటంతో ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్సైజ్‌, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మూడు యూటర్న్‌లను మూసివేసినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ట్రాఫిక్‌ సాఫీగా సాగుతోందన్నారు.

ప్రజల సేఫ్టీనే టార్గెట్‌
ప్రజల సేఫ్టీ కోసమే పని చేస్తున్నామని సీపీ శ్వేత స్పష్టం చేశారు. ట్రాఫిక్‌, ఫ్రీ లెఫ్ట్‌లు, ఫుట్‌పాత్‌ ఆక్రమణలు వంటి సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు. పోలీసులు ఒక్కరే అన్ని సమస్యలను పరిష్కరించలేరని, కార్పొరేషన్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే కార్పొరేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు.

స్టేషన్ల వారీగా క్రైం మ్యాపింగ్‌
కమిషనరేట్‌లోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో నమోదవుతున్న కేసుల తీరును విశ్లేషిస్తున్నామని సీపీ తెలిపారు. మిల్స్‌ కాలనీ, మట్వాడ, ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో క్రైం కేసులు ఎక్కువగా ఉంటే, కేయూ, హసన్‌పర్తి ప్రాంతాల్లో భూ సమస్యలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. స్టేషన్‌ వారీగా క్రైం ప్యాటర్న్‌ను గుర్తించి, ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

సాంకేతిక వినియోగం…
పరిపాలనా, పోలీసింగ్ పటిష్టత కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగానికి సన్నద్ధంగా ఉన్నామని సీపీ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయాలను బట్టి ఏఐ వంటి సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రజలకు విస్తృతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే వాట్సప్ ఎఫ్ఐర్ లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

భూ వివాదాల్లో ఎస్‌ఓపీనే కీలకం
భూ సమస్యల పరిష్కారంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం, పోలీస్‌ శాఖ రూపొందించిన స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు సీపీ తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు భూ వివాదాల్లో ఏకపక్షంగా జోక్యం చేసుకోకుండా ఎస్‌ఓపీ ప్రకారం వ్యవహరించాలన్నారు. తాను కూడా ఎస్‌ఓపీని పాటిస్తానని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఫేమ్‌ కోసం పని చేయను..
తాను పేరు, ఫేమ్‌ కోసం పనిచేయనని సీపీ శ్వేతారెడ్డి స్పష్టం చేశారు. చట్టాన్ని నమ్ముతానని.. దాని ప్రకారమే పనిచేస్తానని చెప్పారు. పోలీసింగ్‌ ఎఫెక్టివ్‌గా ఉండటంతో పాటు ఫలితం కనిపించాలన్నదే తన లక్ష్యమన్నారు. తనకు చట్టపై నమ్మకం ఉందని, అలాగే శిక్ష పడే వరకు వేచి చూసే ఓపిక కూడా ఉందన్నారు. ప్రజల భద్రత, నేర నియంత్రణ, సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular