ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeఎడిటోరియల్కొత్త పార్టీ రావాల్సిన టైం..

కొత్త పార్టీ రావాల్సిన టైం..

📰 Generate e-Paper Clip

కొత్త పార్టీ రావాల్సిన టైం..
జన తెలంగాణ లక్ష్యం కావాలి..

కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయింది..
బీఆర్‌ఎస్‌ పాలన చూసేశారు..
బీజేపీకి ఇక బలం పెరిగే ఛాన్స్‌ లేదు
ప్రజల కోసం పనిచేసే పార్టీ రావాలి..
పాలకులు కమీషన్ ఏజెంట్లు అయ్యారు..
విద్య, వైద్యం, ఉపాధే మా ఎజెండా
ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకుపోతాం..
రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు
కిందిస్థాయి నుంచే పార్టీ నిర్మాణం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ..
అసెంబ్లీలోనూ బరాబర్‌ కొట్లాడుతాం
కార్మిక వర్గానికి రాజకీయాధికారం కావాలి..
బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోం
మాజీ మావోయిస్టు నేత‌, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి
తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌

స్పాట్‌ వాయిస్‌, ప్రధానప్రతినిధి: తెలంగాణ ప్రజల్లో ప్రస్తుతం కొత్త పార్టీ రావాలనే ఆకాంక్ష బలంగా ఉంది. కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోయింది.. బీఆర్‌ఎస్‌ పాలనను ప్రజలు చూశారు. ఇక బీజేపీకి తెలంగాణలో బలం పెరిగే అవకాశం లేదని మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి అన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ రావాలనే ఆశ జనాల్లో బలంగా ఉందన్నారు. మతం, కులం, ప్రాంతంపై రాజకీయాలను ప్రజలు చూశారని, ప్రస్తుతం నిరుద్యోగం భయంకరంగా మారిందని, ధరలతో మధ్యతరగతి ఆగమవుతోందని అన్నారు. శ్రామిక వర్గాన్ని ఏకం చేసే ఒక పార్టీ రావాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామిక పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ పెడుతున్నామని తెలిపారు. ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకుపోతామని, ఒక ప్రాంతీయ పార్టీగా ‘జన తెలంగాణ’ను లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌లో సమావేశాలు చేపట్టామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధితోపాటు విద్య, వైద్యం, ఉపాధి తమ ఎజెండా అని, ఈ రంగాలు బాగుంటేనే ప్రజల బతుకులు బాగుపడతాయని స్పష్టం చేశారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో లంకా పాపిరెడ్డి తన ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ అనుభవాలు, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు లక్ష్యాలు, భవిష్యత్‌ కార్యాచరణను పంచుకున్నారు.
ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం..
ప్రజలను చైతన్యపరుస్తామని, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని ఆయన అన్నారు. ఏ ఆకాంక్షల కోసమైతే త్యాగాలు చేసి తెలంగాణ సాధించామో.. వాటిని సాధించే దిశగా అడుగులు వేయబోతున్నామని తెలిపారు. రానున్న రెండు మూడు నెలల్లో పార్టీ పేరు కూడా పూర్తిస్థాయిలో ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీ చేసి, పట్టభద్రులకు దగ్గర కావాలన్న లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. జెన్జీలను కలుపుకొని కొత్త రాజకీయాలకు వెళ్తామని, సంఘాలు, రాజకీయాలు విభజించబడి ఉన్నాయని అన్నారు. ఇక అస్థిత్వ ఉద్యమాలు పనిచేయవచ్చని పేర్కొన్నారు. కిందిస్థాయి నుంచి రావాలనుకునేది తమ ఆలోచన అని తెలిపారు. కొత్త పార్టీ పెట్టబోతున్నామని వార్తలు రావడంతో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోందన్నారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరించాలని భావిస్తున్నామని, ఇప్పటికే వెబ్‌సైట్‌ సైతం ఓపెన్‌ చేశామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరాబర్‌ కొట్లాడుతామని స్పష్టం చేశారు. రాజకీయాలంటే డబ్బొక్కటే ప్రధానం కాదని, మనం నిజాయితీగా పనిచేస్తే ప్రజలే కాపాడుకుంటారని అన్నారు. ప్రజలే ఉద్యమాలు నిర్మిస్తారని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని పేర్కొన్నారు.

గ్రామీణంలో నిరుద్యోగం
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఉందని ఆయన అన్నారు. వ్యవసాయం యాంత్రీకరణ అయినా కుటుంబమంతా సాగుపైనే ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. యంత్రాలు మనుషులు చేసే పనులు చేస్తున్నా.. వారికి వేరే ఉపాధి మార్గం లేక అదే పనిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలు వస్తే ఆ తీరు మారుతుందని అన్నారు. మన పాలకులంతా కమీషన్‌ ఏజెంట్లుగా మారారని విమర్శించారు. మాటలు చెప్పడం కాదు.. చిత్తశుద్ధితో పరిష్కార మార్గాలు వెతకాలని అన్నారు.

ప్రజలు సంపద సృష్టికర్తలు..
ప్రజలు సంపద సృష్టికర్తలని పాపిరెడ్డి అన్నారు. కార్పొరేట్‌, పెట్టుబడిదారులంతా ప్రజలపై ఆధారపడి బతుకుతున్నారని చెప్పారు. గతంలో ప్రజల కోసం పనిచేశామని, తమకు వాళ్లంతా సహకరించారని గుర్తుచేశారు. ప్రజల కోసం పనిచేసిన దశాబ్దాల అనుభవం ఉందని, కొత్త పార్టీ నిర్మాణంలో ఆ అనుభవం తమకు పనికి వస్తుందని తెలిపారు. ప్రజల్లో గెలిపించుకోవాలనే ఆలోచన వస్తే గెలిపిస్తారని అన్నారు. ఇందుకు ఉదాహరణ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు అన్యాయం జరిగిందనే భావనతో అధికార పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటలను ఓడించలేకపోయారని, అది ప్రజల కమిట్‌మెంట్‌ అని అన్నారు. తాము కూడా ప్రజల్లోకి అలాగే వెళ్తామని తెలిపారు. తాము బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్‌ పార్టీలతో పొత్తు ఉంటే అవి వేరే పార్టీలతో పొత్తు ఉండకూడదనే కండీషన్‌ పెడతామని అన్నారు. ప్రస్తుతం కమ్యూనిస్ట్‌ అంటే కేవలం ఆర్థిక విధానాలపై పోరాటం అనే ముద్ర పడిందని, అది రాజకీయం కాదని పేర్కొన్నారు. కార్మిక వర్గానికి రాజకీయాధికారం కావాలని అన్నారు.

విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్‌..
ప్రజలకు అవసరమైన అత్యంత మౌలిక రంగాలు విద్య, వైద్యం, ఉపాధి అని ఆయన అన్నారు. ఈ మూడు రంగాలు కూడా ప్రస్తుతం తెలంగాణ దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. విద్యారంగాన్ని ఈ పాలకులు నాశనం చేశారని, ప్రభుత్వ వైద్య రంగాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. మొత్తం కూడా కార్పొరేట్‌ మాఫియా చేతిలో పడిపోయిందని అన్నారు. ఇక ఉపాధి రంగం పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముప్పై ఏళ్లు వచ్చినా.. యువతకు ఉద్యోగం లేదని, ఉపాధి లేదని అన్నారు. అందుకే ప్రజలను మళ్లీ చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
సంక్షోభంలో అనేక రంగాలు
తెలంగాణలో అనేక రంగాలు సంక్షోభంలో పడిపోయాయని పాపిరెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా వ్యవసాయం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, పరిశ్రమలు పెద్దగా రాలేదని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఉన్నదల్లా కేవలం సర్వీస్‌ సెక్టార్‌ అని, అది కూడా మనది కాదని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి చెందకుండా కేవలం సర్వీస్‌ సెక్టార్‌నే చూపుతూ.. అది కూడా మనది కాని సర్వీస్‌ సెక్టార్‌ను చూపుతూ.. దానినే అభివృద్ధి అని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. పాలకులు కమీషన్‌ ఏజెంట్లుగా మారిపోయారని, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దానికోసం ప్రత్యేకమైన కార్యాచరణతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో…
తాను బయటకు వచ్చేటప్పటికీ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమం జోరుగా నడుస్తోందని ఆయన తెలిపారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొన్నానని చెప్పారు. క్షేత్రస్థాయిలో పనిచేశానని, అనేక ప్రాంతాలు తిరిగానని తెలిపారు. మరోవైపు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక వ్యాసాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లానని చెప్పారు. ఈ క్రమంలో తనను కూడా పలు పార్టీలు ఆహ్వానించాయని, తమతో కలిసి పనిచేయాలని కోరాయని తెలిపారు. కానీ.. తాను ఎక్కడికీ వెళ్లలేదని, ఎవ్వరితోనూ కలవలేదని చెప్పారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పాలకుల తీరువల్ల తెలంగాణ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ రాలేదని అన్నారు. ఏ ఆకాంక్షలతో అయితే.. కొట్లాడి, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నామో.. అవి నెరవేరలేదని, ప్రజల జీవితాల్లో మార్పేమీ రాలేదని తెలిపారు. గ్రామాల్లో భయంకరమైన అప్రత్యక్ష నిరుద్యోగం ఉందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల కోసం పనిచేసే కొత్త రాజకీయ వేదిక అవసరమని భావిస్తున్నామని, ప్రజాస్వామిక పద్ధతిలో పార్టీ నిర్మాణం చేపట్టి, ప్రజల ఆకాంక్షల కోసం మరోసారి ఉద్యమాలు నిర్మించేందుకు ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.

కాంగ్రెస్‌, కమ్యూనిజం సమ్మేళనం..
దామెర మండలం తక్కళ్లపాడు గ్రామం తమదని ఆయన తెలిపారు. పుట్టి పెరిగింది వరంగల్‌ మిల్స్‌ కాలనీ పక్కన ఉన్న గాంధీనగర్‌లోనని చెప్పారు. తల్లిదండ్రులు లక్ష్మీకాంతం–అనంతరెడ్డి. నాన్న స్వాతంత్య్ర సమరయోధుడని, ఆనాడు విద్యార్థి దశలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరగా ఉండేవారని చెప్పారు. అయితే తమ చిన్న పెద్దనాన్న మురళి కమ్యూనిస్టు అని, కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవారని తెలిపారు. ఇద్దరూ ఆయా పార్టీల నుంచి ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారని చెప్పారు. తాము ముగ్గురు అన్నదమ్ములమని, తనతోపాటు పెద్దన్న మురళీమోహన్‌, తమ్ముడు ఉన్నారని తెలిపారు. తాను వరంగల్‌లోనే వాణినికేతన్‌ స్కూల్‌లో 8వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పారు. తమది వ్యవసాయ కుటుంబమని, భూమి కూడా సుమారు 80 ఎకరాల దాకా ఉండేదని తెలిపారు.

19 ఏళ్లలో అన్న ఎన్‌కౌంటర్‌
తమ చిన్న పెద్దనాన్న నుంచి కమ్యూనిస్టు భావజాలానికి తమ అన్న దగ్గరయ్యాడని ఆయన తెలిపారు. తమ నాన్న.. అన్నయ్యకు వాళ్ల అన్నపై ఉన్న ప్రేమతో ఆయన మురళీమోహన్‌ అని పేరు పెట్టానని చెప్పేవారని గుర్తుచేశారు. పదేపదే కమ్యూనిస్టు అంటుంటే తమ పెద్దన్న 7వ తరగతిలోనే కమ్యూనిజం గురించి తెలుసుకోవడానికి వామపక్షాల మీటింగ్‌లకు వెళ్లాడని తెలిపారు. విశాలాంధ్ర పుస్తకాలు, శ్రామికవర్గ ప్రచురణలు చదివేవాడని చెప్పారు. కమ్యూనిజం అంటే.. వర్గరహిత సమాజమని, దోపిడీ, పీడనలేని, కులాలుగా, మతాలుగా, పేదలుగా, ధనికులుగా కాదు.. ప్రజలందరూ ఒక్కటిగా జీవించే అందమైన ప్రపంచమని తెలుసుకున్నాడన్నారు. ఆయనతో పాటు తాను కూడా కమ్యూనిజానికి అట్రాక్ట్‌ అయ్యానని చెప్పారు. గద్దర్‌ మీటింగ్‌.. ఇలా అనేక కార్యక్రమాలతో ఆజంజాహి మిల్స్‌ నాయకుడు గోలి రాజీరుతో పరిచయం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో 1975లో వరంగల్‌ ఎల్‌బీ కళాశాలలో ఆర్‌ఎస్‌యూ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ అయ్యాడని తెలిపారు. నిర్బంధం ఎక్కువ కావడంతో తమ అన్న మురళీమోహన్‌రెడ్డి 1975 మార్చిలో పార్టీ ఫుల్‌టైమర్‌గా యూజీ అయ్యాడని చెప్పారు. ఈ క్రమంలో ఇదంతా వద్దంటూ అన్నను నాన్న ఒకటిరెండు సార్లు ఇంటికి తీసుకొచ్చారని, అయినా తాను నమ్మిన దాని కోసం ముందుకు వెళ్లాడని తెలిపారు. ఆ తర్వాత కొంతకాలానికే.. ఎమర్జెన్సీ సమయంలో 1975, జూలై 25న మెదక్‌ జిల్లా గిరాయిపల్లి ఎన్‌కౌంటర్‌లో తమ అన్న అమరుడయ్యాడని చెప్పారు. అప్పుడు ఆయన వయస్సు 19 ఏళ్లు అని తెలిపారు.

జన్ను చిన్నాలుతో నా రీ ఎంట్రీ
అన్న మురళీమోహన్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత తమ నాన్న తమను వరంగల్‌ నుంచి ఇంటికి తీసుకెళ్లారని ఆయన చెప్పారు. ఇక్కడే ఉంటే మీరు కూడా ఉద్యమాలంటూ వెళ్తారు.. అంటూ తీసుకెళ్లారని తెలిపారు. అయితే.. మురళీమోహన్‌రెడ్డి తమ్ముడు పాపిరెడ్డి కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు.. పనిచేస్తాడు.. అని జన్ను చిన్నాలు తెలుసుకొని, తన కోసం వచ్చాడని చెప్పారు. ఇంటి దగ్గర కాకుండా, తమ చేలక వద్ద కలిసేవారని తెలిపారు. ఎప్పటికప్పుడు పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడని, ఈ పుస్తకాలను ఇంట్లో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టి చదివేవాడినని చెప్పారు. ఒకసారి తమ అమ్మ ఇల్లు ఊడ్చుతుంటే.. ఆ పుస్తకాలను చూసిందని, భయంతో నాన్నకు చెప్పిందని తెలిపారు. అయినా.. ఉద్యమం వైపే అడుగులు వేశానని చెప్పారు. ఈ క్రమంలో 1976లోనే తాను కూడా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లానని తెలిపారు. అప్పుడు తన వయస్సు సుమారు 14 ఏళ్లు అని చెప్పారు. అనేక గ్రామాలు తిరుగుతున్న క్రమంలో 1976 నవంబర్‌లో పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ ఆలోచనతో హనుమకొండ, మట్టెవాడ, గీసుగొండ, నర్సంపేట పోలీస్‌స్టేషన్లకు నాలుగు నెలలు తిప్పారని చెప్పారు. లక్కీగా ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలు రావడంతో జైలుకు పంపారని తెలిపారు. మూడు నెలలు ఉన్నానని, తనను బాల ఖైదీగా, ఉద్యమకారులతో కాకుండా మరో బ్యారక్‌లో ఉంచారని చెప్పారు. అప్పుడు తనకోసం కూడా ఇతర బ్యారక్‌లో ఉన్న గణపతి, కిషన్‌జీ, నల్ల ఆదిరెడ్డి, మల్లా రాజిరెడ్డి, సాహు, అల్లం నారాయణ తదితర నాయకులందరూ డిమాండ్‌ చేశారని తెలిపారు. బాలుడే కావొచ్చుగానీ.. రాజకీయ ఖైదీగా గుర్తించి, తమ బ్యారక్‌లోకి పంపాలని కోరారని చెప్పారు. చివరకు 1977లో ఇందిరాగాంధీ ఓటమి తర్వాత విడుదల చేశారని తెలిపారు.

1981లో అండర్‌గ్రౌండ్‌
1978లో జగిత్యాల జైత్రయాత్రతో మళ్లీ ఉద్యమం ఊపందుకుందని ఆయన తెలిపారు. విద్యార్థులు, యువత విప్లవోద్యమంలో వస్తున్నారని చెప్పారు. ఆ సమయంలో తాను డైరెక్టుగా పదో తరగతి పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. అనంతరం వరంగల్‌ ఎల్‌బీ కళాశాలలో ఇంటర్‌లో చేరినట్లు చెప్పారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొనే క్రమంలో తీవ్ర నిర్బంధం పెరగడంతో 1981లో మళ్లీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లానని తెలిపారు. ఇక అప్పటి నుంచి పీపుల్స్‌వార్‌ (మావోయిస్టు పార్టీ)లో అనేక దశల్లో పనిచేశానని చెప్పారు. దళసభ్యుడిగా, కమాండర్‌గా, జిల్లా కార్యదర్శిగా, సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టానని తెలిపారు. 2003 వరకు ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌, ఆ తర్వాత హర్యానా తదితర ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టానన్నారు. అనేక ప్రజా సమస్యలు, ఉద్యమాలపై అధ్యయనం చేశానని చెప్పారు. అనారోగ్య కారణాలతో 2008లో అప్పటి హోంశాఖ మంత్రి జానారెడ్డి ముందు లొంగిపోయానని తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular