ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణవీసీ ఆదేశాలకు విలువ లేదా..?!

వీసీ ఆదేశాలకు విలువ లేదా..?!

📰 Generate e-Paper Clip

శంకరయ్య సస్పెన్షన్ ఉత్తర్వుల రద్దుకు యూనివర్సిటీ ఉన్నతాధికారి యత్నం

మాజీ వీసీ అనుచరుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ లీడర్ మధ్యవర్తిగా మొదలైన బేరసారాలు 

అక్రమంగా డ్రా చేసిన ఫెలో షిప్ డబ్బులు తిరిగి చెల్లించాడంటూ కాపాడే ప్రయత్నం 

డబ్బులు కడితే అక్రమం.. సక్రమమవుతుందా ? 

యూజీసీని, యూనివర్సిటీని చీటింగ్ చేసిన వ్యక్తిపై కేసులుండవా.. ?

కేయూలో అవినీతికి అధికారుల భరోసా

రణధీర్ రెడ్డికి ఒక అ‘న్యాయం’.. శంకరయ్యకు మరో న్యాయమా ?

స్పాట్ వాయిస్, ఓరుగల్లు : కాకతీయ యూనివర్సిటీలో వీసీ ఆదేశాలు బేఖాతర్ అవుతున్నాయి. పోస్టు డాక్టోరల్ ఫెలో షిప్ అక్రమంగా కాజేసినట్లు తేలిన తెలుగు విభాగం కాంట్రాక్ట్ లెక్చరర్ కు ఏడాదిలో నాలుగు నోటీసులు ఇచ్చిన అధికారులు.. చివరికి ఈ నెల 1న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు అతడు పనిచేసే సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కు 3వ తేదీన శనివారం అందాయి. ఉత్తర్వుల విషయం ముందే తెలుసుకున్న శంకరయ్య ఆ రోజు కాలేజీకి వెళ్లకుండ లీవ్ పెట్టినట్లు తెలిసింది. దీంతో ఆయన చేతికి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో అదే రోజు మధ్యాహ్నం వైస్ ప్రిన్సిపాల్ వాట్సప్ ద్వారా శంకరయ్యకు సస్పెన్షన్ ఆర్డర్స్ పంపారు. ఈ ప్రకారం ఆయనకు ఉత్వర్వులు అందినట్లే లెక్క. కానీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చరర్ల అటెండెన్స్ రిజిస్టర్ లో మంథని శంకరయ్య పేరు ఎదుట సస్పెన్షన్ అని పేర్కొనకపోవడంలో ఆంతర్యం ఏమిటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ వీసీ అనుచరుడు, కాంట్రాక్ట్ లెక్చరర్ లీడర్ మధ్యవర్తిగా రంగంలోకి యూనివర్సిటీలోని ఓ ఉన్నతాధికారి, నాన్ టీచింగ్ ఉద్యోగితో బేరసారాలకు దిగినట్లు తెలిసింది. పూర్తిగా డబ్బులు చెల్లించి, తమతో కూడా ‘మామూలు’గా వ్యవహరిస్తే శంకరయ్యను రక్షించే బాధ్యత తమదని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద డబ్బులు చెల్లించారనే ప్రచారం జరుగుతోంది. అంతా సెట్ అయితే సాయంత్రంలో లోపు సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసే అవకాశమున్నట్లు తెలిసింది.

ఇదంతా వీసీకి తెలిసే జరుగుతోందా ? 

శంకరయ్యపై చర్యలు తీసుకునే విషయంలో మొదటి నుంచి వీసీ ప్రతాపరెడ్డి నిక్కచ్చిగానే ఉన్నప్పటికీ.. యూనివర్సిటీలో ప్రధాన బాధ్యతల్లో ఉన్న ఓ ప్రొఫెసర్, మరో నాన్ టీచింగ్ ఉద్యోగి ప్రతి సందర్భంలో అడ్డుపడినట్లు తెలిసింది. శంకరయ్యతో సదరు వ్యక్తుల లోపాయికారీ ఒప్పందం వల్లే చర్యల్లో ఆలస్యం జరిగినట్లు సమాచారం. ఈ విషయం వీసీ ప్రతాపరెడ్డి దృష్టికి వెళ్లినప్పటికీ మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే యూజీసీకి ఫిర్యాదులు అందడం, యూజీసీ నుంచి యూనివర్సిటీకి ఆదేశాలు, రిమైండర్లు రావడం, పత్రికల్లో వరుస కథనాలు వస్తుండడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో శంకరయ్యపై వారు చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చాక.. ఓ ఉన్నతాధికారి మళ్లీ వాటిని ఆపేందుకు ప్రయత్నించడం, పైగా డబ్బులు చెల్లించారనే సాకుతో సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసేందుకు ప్రయత్నించడం వీసీ నోటీసులో ఉందా.. లేదా అనే చర్చ జరుగుతోంది. వీసీకి తెలియకుండానే సదరు ప్రొఫెసర్ అవినీతిపరులను కాపాడేందుకు పావులు కదుపుతున్నానరనే విమర్శలు వినిపిస్తున్నాయి.

డబ్బులు కడితే అక్రమం.. సక్రమమవుతుందా ? 

పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్ పొందేటప్పుడు ఇచ్చే డిక్లరేషన్ లోనే నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యుడిని అవుతాననే అంశం ఉంటుంది. కానీ కాకతీయ యూనివర్సిటీని, యూజీసీని చీటింగ్ చేసిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాగే వదిలేస్తే ముందయితే స్కామ్ లు చేద్దాం.. భవిష్యత్ లో ఎవరైనా కంప్లయింట్ చేసినప్పుడు చూద్దాం. అనే ధోరణితో ప్రజాధనాన్ని ఇలా అక్రమాలకు పాల్పడే అవకాశముందని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

రణధీర్ రెడ్డికి ఒక అ‘న్యాయం’.. శంకరయ్యకు మరో న్యాయమా ? 

కేయూ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రిన్సిపాల్ గా పనిచేసిన డాక్టర్ రణధీర్ రెడ్డి కాలేజీ ఫండ్స్ సుమారు రూ.8 లక్షలకుపైగా సొంతానికి వాడుకున్నట్లు ఆడిటింగ్ లో బయటపడింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందకపోయినా యూనివర్సిటీ ఓ కమిటీ వేసి నివేదిక కోరింది. నివేదిక ఇవ్వకముందే రణధీర్ రెడ్డి తాను వాడుకున్న రూ.8 లక్షలు తిరిగి కాలేజీ అకౌంట్ లో జమ చేశారు. అయినప్పటికీ.. ఆయన కాంట్రాక్ట్ ను రెన్యువల్ చేయలేదు. ఇప్పటికీ రిజిస్ట్రార్, వీసీ చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. కానీ శంకరయ్య విషయంలో మాత్రం ఇంత ప్రేమేందుకనే చర్చ జరుగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular