వేప కొమ్మలు నరుకుతుండగా ప్రమాదం
గొల్లపల్లి గ్రామంలో విషాదం
స్పాట్ వాయిస్, గణపురం: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన మండలంలోని గొల్లపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దాసరి రాజు (40) ఇంటి ముందున్న వేపచెట్టు కొమ్మలు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రేకుల షెడ్డుపైకి వాలాయి. దీంతో రాజు గొడ్డలితో వాటిని నరికేందుకు చెట్టెక్కాడు. కొమ్మలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలాయి. దీంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురైన రాజు చెట్టుపైనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే స్పందించి చెట్టుపై నుంచి కిందకు దించినా ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

