సుప్రీంకోర్టులో ఊరట!
ఇద్దరు గుజరాత్ ఉద్యోగులకు క్లీన్‌చిట్
ఆధారాలు లేవని కేసు కొట్టివేత
స్పాట్ వాయిస్, డెస్క్ : రూ.20.. పెద్ద మొత్తం కాదు. కానీ ఆ రూ.20 చుట్టూ మొదలైన ఓ లంచం కేసు ఏకంగా 30 ఏండ్లపాటు న్యాయస్థానాల్లో నడిచింది. చివరకు సుప్రీంకోర్టు తీర్పుతో ఈ కేసుకు తెరపడింది. లంచం డిమాండ్ చేశారనే విషయం పక్కాగా నిరూపితం కాకుండా, కేవలం రూ.20 స్వాధీనం చేసుకున్నారన్న కారణంతోనే శిక్ష విధించలేమని స్పష్టం చేస్తూ గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ఓ క్లర్క్, ఓ ప్యూన్‌ను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఆదాయ ధృవీకరణ పత్రం కోసం…
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బెచారి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఓ విద్యార్థి ఆదాయ ధృవీకరణ పత్రం కోసం ఆశ్రయించారు. అయితే అయితే సర్టిఫికెట్ జారీ చేసేందుకు క్లర్క్ రూ.120 లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో రూ.100 తనకు, రూ.20 ప్యూన్‌కు ఇవ్వాలని చెప్పినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో విద్యార్థి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆశ్రయించాడు. అధికారులు రంగంలోకి దిగి మార్క్ చేసిన రూ.120 నోట్లను విద్యార్థికి ఇచ్చి, వాటిని సదరు ఉద్యోగులకు అందించాలని సూచించారు. పథకం ప్రకారం విద్యార్థి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్న తర్వాత డబ్బులు ఇచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న ఏసీబీ అధికారులు ప్యూన్ నుంచి ఆ రూ.20 నోటును స్వాధీనం చేసుకున్నారు. అయితే క్లర్క్ తీసుకున్నాడని ఆరోపించిన రూ.100 మాత్రం అతడి వద్ద దొరకలేదు. అంతేకాదు.. లంచం డిమాండ్ చేశారనే విషయంపై ఫిర్యాదు చేసిన విద్యార్థి వేర్వేరు సందర్భాల్లో భిన్నమైన వాంగ్మూలాలు ఇవ్వడం కూడా కేసులో కీలకంగా మారింది.
లంచం తీసుకున్నట్టేనా?
కేసు విచారణలో ఇదే ప్రధాన ప్రశ్నగా మారింది. ప్యూన్ వద్ద రూ.20 దొరికినంత మాత్రాన, నిందితులు లంచం డిమాండ్ చేశారని నిర్ధారించగలమా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. లంచం కేసులో కేవలం డబ్బు స్వాధీనం కావడం మాత్రమే సరిపోదని.. లంచం డిమాండ్ చేసినట్లు, స్వీకరించినట్లు నమ్మదగిన ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో అలాంటి ఆధారాలు బలంగా లేవని గుర్తించింది.
30 ఏండ్ల తర్వాత తుది తీర్పు
దాదాపు మూడు దశాబ్దాలుగా సాగిన ఈ కేసులో దిగువ కోర్టు, గుజరాత్ హైకోర్టు గతంలో నిందితులకు అనుకూలంగా లేని తీర్పులు ఇచ్చాయి. అయితే ఈ తీర్పులను సుప్రీంకోర్టు తాజాగా రద్దు చేసింది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఇద్దరు ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది. రూ.20తో మొదలైన కేసు.. రూ.120 లంచం ఆరోపణగా మారి.. మూడు దశాబ్దాల న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఈ కేసు ద్వారా లంచం ఆరోపణల్లో కేవలం నగదు స్వాధీనం కావడం మాత్రమే కాకుండా, లంచం డిమాండ్, స్వీకరణకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు కూడా కీలకమని మరోసారి స్పష్టమైంది.
