-
నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ హత్య కేసులో సంచలన నిజాలు
స్పాట్ వాయిస్, క్రైం : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమెను హత్య చేసింది ఆమె వద్ద చదువుకున్న టెన్త్ క్లాస్ విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు. స్కూల్ ముగించుకుని ఆమె ఇంటికి వచ్చే సమయాన్ని ముందుగానే గమనించిన నిందితులు.. అంతకుముందే గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారు. అనంతరం ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లి వంటగదిలో దాక్కున్నారు.
రూపారెడ్డి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో నిందితులు వెనుక నుంచి వచ్చి కత్తితో దాడి చేశారు. ఆమెపై ఏకంగా 27 సార్లు పొడిచి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న సుమారు రూ.2 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
గంజాయికి అలవాటు పడటంతో పాటు విచ్చలవిడిగా జల్సాలకు అలవాటు పడిన విద్యార్థులు.. ఆ అవసరాల కోసం డబ్బు కావడంతోనే హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి డబ్బును ఖర్చు చేస్తూ జల్సాలు చేసినట్లు సమాచారం. అయితే పోలీసులకు అనుమానం రాకుండా సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు నిందితులను గుర్తించారు. ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారించగా.. హత్యకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. చదువు చెప్పిన ఉపాధ్యాయురాలినే డబ్బు కోసం విద్యార్థులు హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

