ePaper
Wednesday, September 9, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రెంట్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆఫర్లతో సైబర్‌ వల

రెంట్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆఫర్లతో సైబర్‌ వల

📰 Generate e-Paper Clip

యువతులే లక్ష్యంగా ఆన్‌లైన్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

స్పాట్ వాయిస్. దరాబాద్‌: సోషల్‌ మీడియాలో ‘రెంట్‌ బాయ్‌ఫ్రెండ్‌’, ‘పర్సనల్‌ కంపానియన్‌’ పేరుతో ప్రచారం అవుతున్న ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక సైబర్‌ మోసాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా యువతులను లక్ష్యంగా చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో కలర్‌ఫుల్‌ పోస్టర్లతో ఈ ఆఫర్లను ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘కాఫీ డేట్‌’, ‘సినిమా డేట్‌’, ‘షాపింగ్‌ కంపానియన్‌’, ‘ఈవెంట్లు, పెళ్లిళ్లకు తోడు’ అంటూ వివిధ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. గంటకు రూ.499 నుంచి ఫుల్‌డే ప్యాకేజీకి రూ.4,499 వరకు ధరలు పేర్కొంటూ, పరిమిత కాల డిస్కౌంట్ల పేరుతో ఆకర్షిస్తున్నారు. గోప్యత, భద్రతకు పూర్తి హామీ ఇస్తామని చెబుతూ బుకింగ్‌ కోసం డైరెక్ట్‌ మెసేజ్‌ చేయాలని కోరుతున్నారు.

ఆకర్షణీయమైన యువకుల ఫొటోలను ప్రొఫైల్‌ పిక్చర్లుగా ఉపయోగిస్తున్న మోసగాళ్లు.. ఆసక్తి చూపిన యువతులతో చాటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు చెబుతున్నారు. అనంతరం బుకింగ్‌ కన్ఫర్మేషన్‌, సెక్యూరిటీ డిపాజిట్‌, అడ్వాన్స్‌ చెల్లింపు వంటి పేర్లతో డిజిటల్‌ వాలెట్లు, యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా డబ్బులు వసూలు చేసి, ఆ తర్వాత సంబంధాలు తెంచుకునే అవకాశం ఉంది.

మరోవైపు చాటింగ్‌ సమయంలో సేకరించిన ఫోన్‌ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలను దుర్వినియోగం చేసి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. ఆన్‌లైన్‌లో పరిచయమైన అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడం కూడా భద్రతాపరంగా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి ప్రకటనలను చూసి యువతులు ఆకర్షితులు కావద్దని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం, ఫొటోలు పంపవద్దని, ముందస్తుగా ఎలాంటి నగదు చెల్లించవద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహనతో పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.

సైబర్‌ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 జాతీయ సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే (నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ) https://cybercrime.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అనుమానాస్పద ఫోన్‌ నంబర్లు, టెలిగ్రామ్‌ హ్యాండిల్స్‌, సోషల్‌ మీడియా లింకులు తదితరాలను కూడా పోర్టల్‌లో రిపోర్ట్‌ చేసే సదుపాయం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular