
-
టి.జి.ఎం.ఎఫ్ వరంగల్ జిల్లా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బైరా శంకర్
స్పాట్ వాయిస్, వరంగల్, అక్టోబర్ 25: తెలంగాణ మీ సేవా ఫెడరేషన్ (టి.జి.ఎం.ఎఫ్) వరంగల్ జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు (వీఎల్ఈలు) ఎదుర్కొంటున్న సమస్యలు, కమీషన్లు, నూతన సేవలు, ఆరోగ్య బీమా, సంక్షేమం, ఆర్థిక భద్రత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశానికి టి.జి.ఎం.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బైరా శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ మోహీద్, జిల్లా అధ్యక్షుడు సామల రాకేష్, జిల్లా ఉపాధ్యక్షులు సాజిద్, లావణ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్, జిల్లా కోశాధికారి నరేష్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నిర్వాహకులకు న్యాయమైన కమీషన్లు, మెరుగైన సేవల అవకాశాలు, ఆరోగ్య బీమా, సంక్షేమ పథకాలు, ఆర్థిక భద్రత కల్పించే అంశాలపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
నిర్వాహకుల హక్కుల సాధనకు ఐక్యతే బలం
రాష్ట్రంలోని ప్రతి మీ సేవా నిర్వాహకుడు ఐక్యంగా ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. నిర్వాహకుల హక్కులను సాధించుకోవడంతో పాటు వారి కుటుంబాల భద్రతకు భరోసా కల్పించడం, వృత్తిపరమైన గౌరవాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వీఎల్‌ఈల సమస్యల పరిష్కారం, సంక్షేమం, ఆర్థిక భద్రత సాధించే వరకు టి.జి.ఎం.ఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ప్రతి మీ సేవా నిర్వాహకుడు ఫెడరేషన్‌కు అండగా నిలిచి, న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగస్వామి కావాలని కోరారు. నిర్వాహకులందరూ సంఘటితంగా ఉంటేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు.
సమావేశాన్ని విజయవంతం చేసిన రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు, జిల్లా కమిటీ సభ్యులకు, పాల్గొన్న మీ సేవా నిర్వాహకులందరికీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

