బానిస వరంగల్‌గా మారింది..
ఓరుగల్లును ముక్కలు చేసి ఉనికి లేకుండా చేసిండ్లు
నార్మల్ వరంగల్ కాదు.. వైబ్రెంట్ వరంగల్ కావాలి
ప్రభుత్వంలో నిర్ణయాధికారం లేకుండా పోయింది..
చిన్నప్పుడు క్లాస్ వివక్ష.. కోర్టులో కులవివక్షను ఎదుర్కొన్నా..
మ్యాజిక్ రవి నుంచి ఫేమస్ లాయర్ రవిగా ఎదిగా
పార్టీ ఆవిర్భావం రోజునే టీఆర్‌ఎస్‌లో చేరిన
కేసీఆర్, నా మధ్య రెండే మాటలుండే..
దశాబ్దాలపాటు స్టాక్ లీడర్‌గా వాడారు
కేసీఆర్ ఓకే చెప్పినా.. కుట్రల వల్లే ఎంపీ టికెట్ రాలే
ఉద్యమకారులకు అన్యాయం జరిగింది..
వాళ్ల కోసమే ఇప్పుడు నా కొట్లాట
ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవి
తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్
స్పాట్ వాయిస్, హన్మకొండ : ఉద్యమాల గడ్డ ఓరుగల్లు.. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన వరంగల్.. ఇప్పుడు తన ఉనికినే కోల్పోయిందని ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్‌ను ఆరు జిల్లాలుగా విభజించి ఓరుగల్లును బానిస వరంగల్ గా చేశారన్నారు. మాటల్లోనే ఓరుగల్లు అంటున్నారని.. నిర్ణయాధికారాల్లో మాత్రం వరంగల్‌కు చోటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా వరంగల్ నిరుద్యోగం, ఆదాయ మార్గాలు, తలసరి ఆదాయం వంటి అంశాల్లో వెనకబడిపోయిందన్నారు. నార్మల్ వరంగల్ కాదు.. వైబ్రెంట్ వరంగల్ కావాలని, ఓరుగల్లు కీర్తిని పునరుద్ధరించగలిగే నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్‌చాట్‌లో తన రాజకీయ, ఉద్యమ, న్యాయ ప్రస్థానాన్ని పంచుకున్నారు.
ఓరుగల్లు కనుమరుగు..
ఉద్యమల గడ్డ ఓరుగల్లును ఆరు జిల్లాలుగా చేసి ఉనికి లేకుండా చేశారని, ధిక్కార స్వరం, మేథస్సు, ఆత్మగౌరవానికి ప్రతిక అయిన వరంగల్ గడ్డను బాసిన ఓరుగల్లుగా మార్చారని గుడిమల్ల రవికుమార్ అన్నారు. మాటల్లోనే ఓరుగల్లు అని.. నిర్ణయాధికారాల్లో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నేతలు చెప్పులు లేని స్థితి నుంచి చెప్పలేనంతగా ఆస్తులు కూడబెట్టుకున్నారని విమర్శించారు. వరంగల్ కు మంచి లీడర్ కావాలి. డెవలప్ మెంట్ పై విజన్ ఉండాలన్నారు. ఓరుగల్లు కీర్తిని రీ స్టోర్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు రావాలన్నారు. “A leader makes anything” కానీ మన నేతలంతా నేను.. నా కుటుంబం అన్న రీతిలోనే ఆలోచనలు చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ఏర్పాటు తర్వాత వరంగల్ అంత్యంత వెనకబడి పోయింది. నిరుద్యోగం పెరిగింది. ఆదాయ మార్గాలు పోయాయి. తలసరి ఆదాయంలో వెనకబడిపోయాం. 28 స్థానంలో పడిపోయామంటే పౌరుషాల గడ్డ.. రెండో రాజధాని ఏమవుతుందో ఇక్కడి ప్రజలు ఆలోచన చేయాలని గుడిమల్ల పిలుపునిచ్చారు. జిల్లా నాయకత్వం అన్నింట్లో ఫెయిల్ అయిందటూ పెదవి విరిచారు. మన జిల్లా కోసం కొట్లాడేవారు లేరని.. అందుకే మరోసారి వరంగల్ కోసం ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు.
మొదటి రోజే టీఆర్ఎస్‌లో చేరిన
1998-99లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో ఒకసారి సమావేశం అయ్యాయని గుడిమల్ల రవికుమార్ తెలిపారు. మీరు పార్టీ పెట్టాలంటూ సార్‌ను కోరామని, అప్పుడే కేసీఆర్ విషయం ప్రస్తావనకు వచ్చిందన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కూడా వస్తున్నారని, పార్టీ పెడుతున్నారని, ఆయన సమర్థుడని జయశంకర్ సార్ చెప్పారు. ఈ క్రమంలో అనేక మార్లు చర్చలు జరిగినట్లు చెప్పారు. 2001లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఆవిర్భవించిందని, జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించిన మొదటి రోజునే ఏడుగురు న్యాయవాదులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు రవికుమార్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మొదటి న్యాయవాదిని నేనే. అప్పటి నుంచి కేసీఆర్‌తో నా ప్రయాణం మొదలైంది. స్పోక్ పర్సన్స్ గా అప్పుడు జిల్లాలో బియ్యాల జనార్దన్, జయశంకర్ సార్, నేను ఉండేది. నన్నొక స్టాక్ లీడర్‌గా వాడారు. రాత్రనకా.. పగలనా.. ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా.. నాకు ఫోన్ చేసేవారు. పనిచేయించేవారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా తెలంగాణ వ్యాప్తంగా తిరిగిన. ఉద్యమ కేసులు వాదించా. మరోవైపు పేదల కేసులను ఉచితంగా వాదించా. నన్ను తెలంగాణ అనే పదం ఆవహించిందన్నట్లుగా ఉండేది. లాయర్ గా సంపాదించినదంతా ఉద్యమంలో తిరగడానికే ఖర్చు అయ్యేది. హైదరాబాద్ ఎన్నికల్లో నేను హిందీలో మాట్లాడడంతో కేసీఆర్ ఫిదా అయ్యారు.
పార్టీ గద్దెలు కట్టించిన..
పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించడంతో.. నాకు పార్టీ యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా బాధత్యలు అప్పగించారని రవికుమార్ వివరించారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో ధైర్యంగా పనిచేసిన. అనేక గ్రామాల్లో పార్టీ గద్దెలు కట్టించా. గులాబీ జెండాలు ఎగరేసినం. గీసుగొండ మండల ఇన్‌చార్జిగా పనిచేసిన. వంచనగిరిలో టీఆర్ఎస్ జెండా గద్దె కట్టించా. ఇక్కడ ఎన్నికల్లో పోటీ కూడా చేయించా. యువజన విభాగం నాయకుడిగా.. తెలంగాణ వ్యాప్తంగా పర్యటించా. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా.. నా బృందంతో కలిసి వెళ్లిన. రాత్రింబవళ్లూ పనిచేసిన. ఈ క్రమంలో పార్టీ అధినేత కేసీఆర్‌కు దగ్గరయ్యా. నాపై ఎంతో నమ్మకంతో ఉండేవారు కేసీఆర్. ఒకసారి ఓ కేసులో వరంగల్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. నన్ను నమ్మి, కేసు అప్పగించి, ఇక్కడ హాజరయ్యారు. కొంతమంది డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినా.. కేసీఆర్ వాళ్లను నమ్మలేదు. మరోవైపు నాపై అనేక కేసులు, దాడులు జరిగాయి. సిద్దిపేటలో దాడి జరిగింది. ఢిల్లీలో జరిగిన చిన్నరాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత సదస్సులోనూ పాల్గొని తెలంగాణ గళం వినిపించిన. పార్టీ యువజన అధ్యక్షుడిగా నేను ఇచ్చే స్పీచ్ లు విని యూత్ అట్రాక్ట్ అయ్యేది. నేను చాలా మందిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిన వారంతా ఇప్పటికీ చురుగ్గా పని చేస్తున్నారు.
ఆటో డ్రైవర్ల కోసం కొట్లాడిన
ఉద్యమంలో పాల్గొనడంతో పాటు తెలంగాణ ప్రజల జీవితాలపై అధ్యాయనం చేశానని రవికుమార్ చెప్పారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ల సమస్యలు తనను బాధించాయన్నారు. గతంలో పోలీసుల చేతిలో అనేక వేధింపులకు గురయ్యేవారు. ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడేవారు. సొంత డబ్బులతో ఆటో కొనుగోలు చేసి, నడుపుకుంటూ కుటుంబాన్ని సాదుకుంటున్నా.. అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయితే.. ఉద్యమ సమయంలో వారందరినీ కలిసిన. వాళ్లలో సామాజిక చైతన్యం తీసుకొచ్చిన. క్రమంగా వాళ్లను ఉద్యమంలోకి తీసుకొచ్చిన. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏర్పాటు చేసి, ఉద్యమంతో మమేకం అయ్యోలా చేసిన. ఇందుకోసం ఎంతో శ్రమించిన. వరంగల్ పోస్టాఫీస్ సెంటర్‌లో ఆటో డ్రైవర్ల జెండాను తొలిసారి కేసీఆర్ ఆవిష్కరించారు. ఆ సమయంలో కేసీఆర్ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉంటారు వరంగల్ లో అని అడిగితే 30 వేల వరకు ఉంటారని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆదుకోవాలని కోరాం. త్వరలోనే ఈ కల నెరవేరబోతోంది. ఆటోడ్రైవర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. అంతేగాకుండా, వరంగల్‌లో పూల వర్తకులను కూడా ఏకం చేసిన. ఇక్కడ సుమారు 3 వేల మంది పూల వ్యాపారులు ఉన్నట్లు రవికుమార్ చెప్పారు. ఇక్కడి నుంచి ఆంధ్రాకు చెందిన 700 మంది వర్తకులను పంపించినం. ఇలా.. అత్యంత దిగువన ఉన్న వర్గాలను కూడా ఉద్యమంలోకి తీసుకొచ్చి, మల్టీపుల్ లైన్లలో పని చేసినట్లు చెప్పారు.
పార్టీ విలీనాన్ని వ్యతిరేకించా…
స్వరాష్ట్రం సిద్ధించాక.. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌పార్టీలో విలీనం చేయాలా.. వద్దా.. అనే అంశంపై కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలో దాదాపు 30 నిమిషాలు మాట్లాడినట్లు రవికుమార్ తెలిపారు. విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని, తెలంగాణ కోసమే పుట్టిన గులాబీ జెండాలోనే ప్రజలు తమ అస్తిత్వాన్ని చూసుకుంటున్నారని చెప్పారు. గులాబీ జెండాతోనే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని, తమ బతుకులు గులాబీ జెండాతోనే బాగుపడుతాయని నమ్ముతున్నారని సుస్పష్టంగా వివరించినట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో పార్టీని విలీనం చేయడం సరైంది కాదని నేను సూటిగా చెప్పేశానని, చాలా మంది మెచ్చుకున్నారని గుర్తు చేశారు.
ఎంపీ టికెట్ రాకుండా కుట్రలు చేసిండ్లు..
పార్టీలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన తనపై కేసీఆర్‌కు ఎంతో నమ్మకం ఉండేదని గుడిమల్ల రవి కుమార్ చెప్పారు. నేను ఎన్నడూ కూడా పదవుల కోసం పనిచేయలేదని, అడగడం కూడా లేదని పేర్కొన్నారు. అయితే.. ఎంపీ ఎన్నికల్లో వరంగల్ టికెట్ నాకు ఖరారు చేశారు. గుడిమళ్ల రవి సమర్థుడని కేసీఆర్ గట్టిగా నమ్మారు. న్యాయవాదిగా చట్టాలపై అపారమైన నాలెడ్జ్ ఉందని, ఇంగ్లిష్, హిందిలో మాట్లాడగలుగుతాడని, ఇలాంటివాడు ఢిల్లీలో ఉంటే.. పార్టీకి అన్నిరకాలుగా ఉపయోగం ఉంటుందని కేసీఆర్ నమ్మి, టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ.. కొందరు నేతలు ఉలిక్కిపడ్డారు. గుడిమళ్ల వస్తే.. తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవని భయపడ్డారు. అనేక కుట్రలు కుతంత్రాలు పన్ని, టికెట్ రాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కేసీఆర్‌కు తప్పుడు సంకేతాలు అందించారు. అయితే.. కులధ్రువీకరణకు సంబంధించి, నాపై కేసీఆర్ ఎంక్వైరీ కూడా చేయించారు. అన్నీ బరాబర్ ఉన్నాయని నిర్ధారించుకున్నారు. అయినా.. కొన్ని శక్తులు కుట్రలు చేశాయి. చివరకు టికెట్ రాకుండా అడ్డుకున్నాయి. అనేకమార్లు మాటలు చెప్పి, హామీలు ఇచ్చి, చివరకు తీవ్ర అన్యాయం చేశారు. ఈ క్రమంలోనే పార్టీకి నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్న.
బాకీ పడిన బిడ్డ అన్నడు..
14 ఏళ్లు కేసీఆర్ తో కలిసి పని చేసిన. నా ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు బాకీ పడిన బిడ్డ అన్నాడు. నువ్వు నా ఫోర్స్ అని ఒప్పుకున్నాడు. కానీ ఆయన మాట ఇచ్చి తప్పిండు. అయినా నేను ఆయనను ఇప్పటి వరకు ఒక్క మాట అనలేదు. కేసీఆర్ పార్టీకి పెద్ద దిక్కు కాబట్టి అందులో ఏదీ జరిగిన ఇంటి పెద్దకే వెళ్తుంది. నా విషయంలో జరిగిన అన్యాయానికి ఆయనే బాధ్యుడు. అయితే కేసీఆరే నా రాజకీయ గురువు. ఇప్పుడు ఆయన పిలిచిన వెళ్తా. కానీ రాజకీయంగా మాత్రం వెళ్లను అని రవికుమార్ చెప్పారు.
ఉద్యమకారులు చితికిపోయారు..
స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. భౌగోళిక తెలంగాణ వచ్చిందే కానీ ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదని గుడిమల్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాంక్షలు నెరవేరలేదు. కుటుంబాలను ఆదుకోలేదు. అనేకమంది ఉద్యమకారుల కుటుంబాలు చితికిపోయాయి. ఉద్యమ సమయంలో వారంతా వారి వయస్సును, కుటుంబాలను పెట్టుబడిగా పెట్టారు. వారికి న్యాయం జరగాలి. ఒక ఉద్యమకారుడిగా వారికి అండగా ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈ క్రమంలోనే.. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఏర్పాటు చేశాం. ఈ వేదికకు రాష్ట్ర కన్వీనర్‌గా నేను ఉన్నాను. ఇటీవల ఉద్యమకారుల ఓదార్పు యాత్ర కూడా నిర్వహించాం. అనేక కుటుంబాలను కలిసాం. ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి వినతిపత్రాలను అందించాం. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరాం. ప్రధానంగా 250గజాల స్థలం, పదివేల కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి కల్పించాలని కోరాం. త్వరలోనే మంచి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయని గుడిమళ్ల రవికుమార్ చెప్పారు.
రంగంపేటలోనే పుట్టి పెరిగిన
నేను పుట్టి పెరిగింది వరంగల్ రంగంపేట. అమ్మానాన్నలు గుడిమళ్ల పుష్పలీల – రాఘవేందర్‌రావు. అమ్మానాన్నలది కులాంతర ప్రేమవివాహం. అమ్మ హెడ్ నర్సు.. నాన్న ఫార్మసిస్టు. రంగంపేటలో సమాజంలో అత్యంత పీడనకు, వివక్షకు గురైన దళితవర్గాల మధ్య పుట్టి పెరిగిన. డిగ్రీ వరకు వరంగల్‌లో చదువుకున్నా. ఏపీలో ఎస్వీ యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీ పూర్తి చేసిన. చిన్నతనం నుంచే ప్రగతిశీల సామాజిక స్పృహతో ఉండేవాడిని. స్థానికంగా 1982లో 120మందితో మూన్‌లైట్ యూత్ ఏర్పాటు చేశాం. వ్యాయామ శాల నిర్వహించాం. మమ్మల్ని మేము తీర్చిదిద్దుకుంటూ ఒక సామాజిక స్పృహతో ఉండేవాళ్లం. ఈ క్రమంలోనే 1994లో నవచైతన్య అసోసియేషన్ ఏర్పాటు చేశాం. ఈ యూత్ ఆధ్వర్యంలో అనేక సామాజిక చైతన్య కార్యక్రమాలు చేపట్టినం. యూత్ ఆధ్వర్యంలో కమ్యూనిటీహాల్ ఏర్పాటు చేసి అప్పటి కలెక్టర్ శాలిని మిశ్రాతో హాల్‌ను ప్రారంభించాం. దళిత కమ్యూనిటీలో పెరగడంతో నాకు సమస్యలన్నీ తెలిసేవి. నేను హిందువుగా ఉన్నా ముస్లింలు, క్రిస్టియన్లతో కలిసి ఉండేది.
మ్యాజిక్ తో లైఫ్ టర్న్
అప్పట్లో వినాయక నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద భజనలు, మ్యాజిక్‌షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవాళ్లు. ఒకసారి మా చిన్నన్న ఉమాపతికి నేను అసిస్టెంట్ గా వెళ్లిన. ఈ క్రమంలో నేను కూడా మ్యాజిక్ నేర్చుకున్నా. అనేక ప్రదర్శనలు ఇచ్చిన. అయితే.. నా జీవితంలో ఇదే నాకు పెద్ద టర్నింగ్ పాయింట్. ఎందుకంటే.. ఈ షోల వల్ల నేను నలుగురి ముందు ధైర్యంగా నిలబడి ప్రదర్శన ఇచ్చే ఛాన్స్ వచ్చింది. ఇది నేను ఒక ఉద్యమకారుడిగా ఎదగడానికి దోహదపడింది. ఇలా నేను సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నాను. మండల్ కమిషన్ ఉద్యమంలోనూ పాల్గొన్నా. ఈ క్రమంలోనే 1989-90 ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం పరిచమైంది. ఇక్కడ ఉన్న ఆకారపు సత్రంలో నిర్వహించిన మీటింగ్‌కు వెళ్లిన. ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కృష్ణమూర్తి, మాచర్ల సత్యనారాయణ ఉపన్యాసాలు విన్నాను. తెలంగాణ ఉద్యమంపై కొంత అవగాహన వచ్చింది. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా బతికిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 1వ తేదీన నిరసన తెలిపేవాడిని. ఎక్కడ ఏ కార్యక్రమం, ఏ మీటింగ్ జరిగినా వెళ్లేవాడినన్నారు.
ఫ్రీగా కేసులు వాదించా..
1995లో ఎస్వీ యూనివర్సిటీలో లా పూర్తి చేసిన తర్వాత వరంగల్‌కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టిన. వందల కేసులు ఫ్రీగా వాదించిన. అనేక వర్గాల పేదల కోసం నా వంతు సాయం అందించా. నేను 99.9 శాతం కేసులు గెలిచా. ఇక్కడ కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టాం. 1998లో యువ న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన. హైకోర్టు జడ్జీలు వస్తున్నారంటే కోర్టులో జయశంకర్‌సార్ గెస్ట్‌గా సెమినార్ ఏర్పాటు చేసిన. అప్పటి వరకు క్లాస్ స్ట్రగుల్ ఎదుర్కొన్న నేను.. కోర్టు సముదాయంలో క్యాస్ట్ స్ట్రగుల్ కూడా ఎదుర్కొన్నా. వకాలత్ అప్పట్లో అతికొద్ది మంది గుప్పిట్లోనే ఉండేది. తీవ్రమైన వివక్షకు గురైన. అయినా.. ఎక్కడా తలదించుకొని బతకలేదు. ఎదిరించి బతికిన. సబ్టెక్టుతోపాటు ఇంగ్లిష్, హిందీ భాషా నైపుణ్యం సంపాదించి, నాకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన. మెజీషియన్ రవి నుంచి లాయర్ రవిగా పేరు సంపాదించిన. క్రాస్ ఎగ్జామినేషన్‌లో నాకంటూ ప్రత్యేకత ఉండేది. నేను కేసు టేకప్ చేస్తే అందరూ అలర్ట్‌గా ఉండేవాళ్లు.

