ఎంగేజ్మెంట్, ప్రీవెడ్డింగ్ బ్యాన్..
అంత్యక్రియల సమయంలోనూ కొన్ని నియమాలపై నిషేధం
మధ్యప్రదేశ్లోని ‘శ్రీ తిరోలే కున్బీ పటేల్’ సంఘం కఠిన నిర్ణయం
స్పాట్ వాయిస్, డెస్క్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలో శ్రీ తిరోలే కున్బీ పటేల్ సంఘం వివాహ వేడుకల్లో పెరుగుతున్న అనవసర ఖర్చులు, ఆడంబరాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివాహ కార్యక్రమాలను సాదాసీదాగా నిర్వహించాలని నిర్ణయించిన సంఘం.. ఇకపై పెళ్లిళ్లలో డీజేలు వినియోగించడాన్ని నిషేధించింది. నిబంధనలను ఉల్లంఘించి డీజే ఏర్పాటు చేస్తే వధూవరులు చెరో రూ.21 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే వివాహానికి ముందు నిర్వహించే ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమాలు, భారీగా నిర్వహించే రింగ్ సెరిమనీలపైనా నిషేధం విధించింది. నిశ్చితార్థ వేడుకలకు పెద్ద సంఖ్యలో బంధువులను పిలిచి అనవసరంగా ఖర్చు చేయకుండా, పరిమితంగా నిర్వహించాలని సూచించింది. జరిమానా ద్వారా వచ్చే మొత్తాన్ని కమ్యూనిటీ ఖాతాలో జమ చేసి విద్య, సామాజిక సేవలు, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించారు. అంత్యక్రియల విషయంలోనూ కొన్ని సంప్రదాయాలను మార్చాలని సంఘం నిర్ణయించింది. శవయాత్రలో కొత్త దుస్తులు తీసుకెళ్లే సంప్రదాయాన్ని నిలిపివేసి, వాటి స్థానంలో నెయ్యి, కర్పూరం, అగరబత్తులు తీసుకెళ్లాలని సూచించింది. ఈ నిర్ణయాలకు సంఘ సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించింది. సమావేశం జరిగిన 24 గంటల్లోనే పలువురు కుటుంబాలు ముందుగా బుక్ చేసుకున్న డీజేలను రద్దు చేసుకున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. వివాహాల్లో ఆడంబరాలను తగ్గించడంతో పాటు యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సంఘం నిర్ణయించింది. మహిళల అభివృద్ధి, బాలికల విద్య, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తీర్మానించింది. ఖండ్వా జిల్లాలోని 106 గ్రామాల్లో సుమారు 15 వేల కున్బీ పటేల్ కుటుంబాలు ఉన్నాయని సంఘం ప్రతినిధులు తెలిపారు.
