ePaper
Tuesday, November 3, 2026
ePaper
Homeతెలంగాణక్షణక్షణం.. భయంభయం..!

క్షణక్షణం.. భయంభయం..!

📰 Generate e-Paper Clip

దీనంగా వైఎస్సార్ నగర్ పేదల దుస్థితి..
కొత్త వ్యక్తి కనిపిస్తే వణుకు..
వాహనం శబ్దం వస్తే గుబులు
పనులు మానుకుని గుడిసెలకు కాపలా
120 కుటుంబాల బతుకుల్లో అభద్రత
ప్రాణహాని ఉందని ఆందోళన
మాజీ కార్పొరేటర్‌పై బాధితుల ఆరోపణలు
పాలకులు, అధికారులు న్యాయం చేయాలని వేడుకోలు

స్పాట్ వాయిస్, కాజీపేట: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు వారివి. రోజంతా కష్టపడితేనే పొయ్యి వెలిగే పరిస్థితి. అలాంటి కుటుంబాలకు ఇప్పుడు కూలీ పనులకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పనికి వెళ్తే తమ గుడిసెలను ఎక్కడ కూల్చివేస్తారోనన్న భయం.. ఇంటి వద్దే ఉంటేనే భద్రత ఉంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. దీంతో కూలీ పనులు మానుకుని మరీ గుడిసెలకు కాపలా కాస్తున్నారు. కొత్త వ్యక్తి ఎవరైనా కాలనీలోకి వస్తే వణికిపోతున్నారు. ఎవరొచ్చి ఏం చేస్తారోననే ఆందోళన నెలకొంది. ఏదైనా వాహనం శబ్దం వినిపిస్తే గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఎప్పుడు ఎవరు వచ్చి తమ గుడిసెలపై పడతారోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాజీపేట వైఎస్సార్‌ నగర్‌లోని సుమారు 120 కుటుంబాల దుస్థితి ఇది. తమను భయపెట్టేందుకు ఓ మాజీ కార్పొరేటర్‌ కొంతమందిని పంపిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.తమకు ప్రాణహాని ఉందని కన్నీరుపెట్టుకుంటున్నారు.

పనులు మానుకుని కాపలా
గుడిసెలు కూల్చివేస్తారేమోనన్న భయంతో కూలీ పనులకు వెళ్లలేకపోతున్నామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు తమవని, రోజువారీ పనులకు వెళ్లకపోతే కుటుంబ పోషణ భారమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా గుడిసెలు కళ్లముందే ఉండాలంటే ఇంటి వద్దే కాపలా ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. కుటుంబంలో ఒకరు పనికి వెళ్లినా.. మరొకరు గుడిసె వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఒకవేళ అందరూ పనులకు వెళ్తే ఆ సమయంలో వచ్చి గుడిసెలు తొలగిస్తారేమోనన్న భయం పట్టుకుందని అంటున్నారు. బతుకుదెరువు కోసం పనికి వెళ్లాలా.. ఉన్న గూడును కాపాడుకోవడానికి ఇంటి వద్దే ఉండాలా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు.

వాహనం శబ్దం వచ్చినా వణుకు
కాలనీలోకి కొత్త వ్యక్తులు వస్తే చాలు.. ఏదో జరగబోతోందన్న ఆందోళన మొదలవుతోంది. రోడ్డుపై వాహనం శబ్దం వినిపించినా గుడిసెలు తొలగించేందుకు వచ్చారేమోనని ఉలిక్కిపడుతున్నారు. గతంలో గుడిసెల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని, తమను ఖాళీ చేయించేందుకు కొందరు ఒత్తిడి తెస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఇంటి వద్ద లేని సమయంలో గుడిసెలను తొలగించే ప్రమాదం ఉందని, అందుకే ఎక్కడికీ వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఇదే భయంతో జీవించడం కష్టంగా ఉందని వాపోతున్నారు.

మాజీ కార్పొరేటర్‌పై ఆరోపణలు
తమను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఓ మాజీ కార్పొరేటర్‌ కొంతమందిని కాలనీకి పంపిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గుడిసెల వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. గతంలోనూ కిరాయి వ్యక్తులను తీసుకొచ్చి గుడిసెల తొలగింపునకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. పోలీసులను ఆశ్రయించని ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. డబుల్ ఇండ్ల పేరుతో మోసం చేస్తున్నారని, ఉన్న గూడు లాక్కొని రోడ్డున పడేసే కుట్రలు చేస్తున్నారని కన్నీరుపెట్టుకుంటున్నారు. నెంబర్లు లేని జేసీబీలు, ట్రాక్టర్లను తమ గుడిసెలపై కి తోలుతున్నారని, మహిళలకు రోజు వారి కూలీ, మగవాళ్లకు కూలీ, మద్యం తాగించి మరి తీసుకొచ్చి దాడులు చేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రెండున్నర దశాబ్దాల అనుబంధం
కాజీపేట మండల పరిధిలోని సర్వే నంబర్లు 70, 71, 72లో ఉన్న భూమిలో 2003 నుంచి పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. సుమారు 20 ఎకరాల 37 గుంటల విస్తీర్ణంలో ఉన్న భూమిలోని కొంత భాగంలో ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం సుమారు 120 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతానికి వైఎస్సార్‌ నగర్‌గా పేరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇంటి నంబర్లు కేటాయించడంతో తమ నివాసాలకు గుర్తింపు లభించిందని భావించారు. అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సైతం కాలనీని సందర్శించి అభివృద్ధికి భరోసా ఇచ్చారు. ఇంతకాలం నివసించిన చోట ఇప్పుడు భద్రత లేకుండా పోయిందని కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల పేర్లకు మారిందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి
ఒకవైపు భూమి వివాదం.. మరోవైపు గుడిసెలు ఎప్పుడు కూలుతాయోనన్న భయం.. ఈ రెండింటి మధ్య పేద కుటుంబాలు నలిగిపోతున్నాయి. కూలీ పనులకు వెళ్లలేక కుటుంబ పోషణ భారంగా మారుతోందని బాధితులు వాపోతున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయించే ప్రయత్నాలు చేయకుండా చూడాలని కోరుతున్నారు. కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు భూమి యాజమాన్య రికార్డులు, పాత ఉత్తర్వులు, కోర్టు ఆదేశాలను పరిశీలించి సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ నివాసాలకు భద్రత కల్పించి, భయంలేకుండా బతికేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular