కడియం కమిట్మెంట్ ఏమైంది..
ఎమ్మెల్యే నాయిని మొసలి కన్నీరు కారుస్తున్నారు
పేదల పొట్టకొట్టొద్దు.. గుడిసెవాసుల పక్షాన పోరాడతాం
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
స్పాట్ వాయిస్, కాజీపేట: వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల సమస్యపై బీఆర్ఎస్ మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ స్పందించారు. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాలుగా అక్కడ పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారని, వారికి అన్యాయం చేయొద్దని అన్నారు. తాను ఎప్పుడూ పేదల పక్షపాతినేనని, కొందరు లిల్లీపుట్ నాయకులు తనపై చిల్లర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే పేదలకు న్యాయం చేయాలని, వారి పొట్టకొట్టొద్దని హితవు పలికారు. ఆదివారం కాజీపేట చౌరస్తాలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ నగర్లో దేవాలయాలు, రహదారులు, విద్యుత్ దీపాలు, నల్లా నీరు సహా ప్రభుత్వాలు కల్పించిన మౌలిక వసతులు ఉన్నాయని గుర్తుచేశారు. 30 ఏళ్ల క్రితమే ప్రణయ్ భాస్కర్, విజయరామారావు, కడియం శ్రీహరి ఈ అర్బన్ సీలింగ్ భూమిలో బస్టాండ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో తాను, అప్పటి ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి గుడిసెవాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చామని, ఇప్పుడు కడియం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నా పేదల సమస్యపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కడియం శ్రీహరి కమిట్మెంట్ ఎక్కడికి పోయిందని నిలదీశారు.
కాంగ్రెస్ నాయకుల భూదోపిడీ..
కాంగ్రెస్ నాయకులే వైఎస్సార్ పేరుతో గుడిసెలు ఏర్పాటు చేయించి, ఇప్పుడు భూదోపిడీకి ముఠాలుగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాయిని రాజేందర్ రెడ్డి గుడిసెవాసుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ, గతంలో ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాజీపేట చౌరస్తాలోని కాంప్లెక్స్‌కు 15 ఏళ్లుగా రాని అనుమతులు నాయిని ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తోట రాముడు, మరికొందరు తనపై విమర్శలు చేయడం కాదని, ప్రజల తరఫున పోరాటానికి రావాలని సవాల్ విసిరారు.
బెదిరింపుల కు భయపడ..
పోలీసులు తనను టార్గెట్ చేస్తామని బెదిరిస్తున్నట్లు నాయకులు చెబుతున్నారని పేర్కొన్న వినయ్ భాస్కర్.. తెలంగాణ ఉద్యమంలో లాఠీలు, తూటాలకు ఎదురొడ్డి పోరాడామని అన్నారు. అధికారులు ఎవరి అండ చూసుకొని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో, తమ ప్రభుత్వం వచ్చాక సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు. సోమవారం వైఎస్సార్ నగర్ నుంచి కాజీపేట ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజా సంఘాలతో కలిసి గుడిసెవాసుల పక్షాన పోరాడతామని ప్రకటించారు. ఏ ఒక్కరూ భయపడవద్దని, వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
నాయిని.. పద్ధతి మార్చుకో: మర్రి యాదవరెడ్డి
కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్లలో నాయిని రాజేందర్ రెడ్డి బాగానే సంపాదించుకున్నారని విమర్శించారు. పేదల స్థలం జోలికి వస్తే వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా పేదలకు అండగా ఉండాలి తప్ప పెద్దలకు కాదన్నారు. వైఎస్సార్ నగర్ ప్రజలకు స్థలం కేటాయించి, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల తరఫున పోరాడే నాయకులను కించపరిచే మాటలు మానుకోవాలని, అహంకారపూరిత వ్యాఖ్యలు విడనాడి పద్ధతి మార్చుకోవాలని నాయినికి సూచించారు. కాజీపేట చౌరస్తాలోని కాంప్లెక్స్‌కు 15 ఏళ్లుగా రాని అనుమతులు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నార్లగిరి రమేష్, మాజీ కార్పొరేటర్లు సంకు నర్సింగరావు, సోదా కిరణ్, తండమల్ల వేణు, డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

