కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, తాత మధు సభ్యత్వాలపై చట్టబద్ధ పోరాటం
బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి: డా. పెరుమాండ్ల రామకృష్ణ
స్పాట్ వాయిస్, హైదరాబాద్: దళితుల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం చట్టబద్ధ పోరాటం కొనసాగిస్తామని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డా. పెరుమాండ్ల రామకృష్ణ తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, తాత మధు తదితరుల సభ్యత్వాలకు సంబంధించి తమ వినతిలో పేర్కొన్న అంశాలను సంబంధిత రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థలు స్వతంత్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ వినతిని సెప్టెంబర్ 22న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అవసరమైన చర్యల కోసం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు పంపిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు విషయంలో ఎన్నికల చట్టాలు, నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులపై ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన చట్టపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రెగుంట సునీల్ మాదిగ పాల్గొన్నారు.

