విద్యే ఆర్థిక అభివృద్ధికి ప్రధాన ఆయుధం..
కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె. ప్రతాప్‌రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ : ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు విద్యే శక్తివంతమైన ఆయుధమని కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఆర్థికశాస్త్ర విభాగ విశ్రాంత ఆచార్యులు ఆచార్య గడ్డం భాస్కర్ పర్యవేక్షణలో పరిశోధన చేసిన విద్యార్థిని డాక్టర్ గొర్రె డెబోరా కృపారాణి రచించిన ‘Education, Equity and Growth – An Analytical Study of Telangana’ పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. ఆధునిక కాలంలో విద్యారంగంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పులు, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ, విద్యను మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు సైతం చేరువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం విద్యారంగానికి మరింత బడ్జెట్ కేటాయించడంతోపాటు, నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలు ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే నాణ్యమైన విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఆచార్య గడ్డం భాస్కర్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిలో ప్రభుత్వం మాత్రమే కాకుండా పేరెంట్స్ కమిటీలు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని పుస్తకం విశ్లేషించిందన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత డాక్టర్ గొర్రె డెబోరా కృపారాణిని ఉపకులపతి అభినందించారు. విద్య, సమానత్వం, ఆర్థిక అభివృద్ధి అంశాలపై తెలంగాణకు సంబంధించి విశ్లేషణాత్మక అధ్యయనాన్ని అందించే ఈ పుస్తకం విద్యారంగం, సామాజిక అభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, ఓఎస్డీ ఆచార్య బి.వెంకట్రామ్‌రెడ్డి, సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్ ఆచార్య బి.సురేష్‌లాల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ చిర్రా రాజు, పుల్లూరి సుధాకర్, ఏసీపీ సి.ప్రతాప్, సామల దయాకర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్ పి.రామ్‌రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్ పి.అశోక్, సీఏ అకీల్, అనగంటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

