సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్
గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
స్పాట్ వాయిస్, గణపురం:సమాజ నిర్మాణంలో, విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనదని సర్పంచ్ కట్కూరి రాధికా శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ ముఖ్య అతిథిగా హాజరై సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే, ఉపాధ్యాయులు జీవితానికి మార్గదర్శనం చేస్తారని కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులందరినీ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పీడీ కోసరి సరిత ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రాధాన్యతను వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఏపిసి కమిటీ చైర్మన్ సిరంగి వెంకటనర్సమ్మ, ప్రధానోపాధ్యాయుడు దేసు సతీష్ కుమార్, ఉపాధ్యాయయలు భరత్ కుమార్, కుమారస్వామి, శాకీరా బేగం, రాంబాబు, రమేష్, శ్రీనివాస్, దేవేందర్, ముస్తాక్, దిల్షాద్, విద్యార్థులు పాల్గొన్నారు.

