ePaper
Wednesday, October 21, 2026
ePaper
Homeతెలంగాణప్రశ్నిస్తే పోలీసులతో దాడులా..?

ప్రశ్నిస్తే పోలీసులతో దాడులా..?

📰 Generate e-Paper Clip

ప్రశ్నిస్తే పోలీసులతో దాడులా..?
ఎంజీఎం ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన దాస్యంను అడ్డుకున్న పోలీసులు
బీఆర్ఎస్ శ్రేణుల‌కు పోలీసులకు మ‌ధ్య తోపులాట
పెనుగులాట‌ లో కాలు, చేతికి తీవ్ర గాయాలు..ర‌క్తస్రావం
ఎంజీఎంలోనే చికిత్స చేయాలంటూ దాస్యం ప‌ట్టు
ప్రభుత్వ తీరుపై వినయ్‌భాస్కర్‌ ఆగ్రహం..
కడుపులో తన్నారంటూ ఆరోపణ
గంట‌పాటు ఎంజీఎం ఎదుట హైటెన్షన్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌..

స్పాట్ వాయిస్, ఓరుగల్లు: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, మౌలిక వసతుల కొరత, రోగుల ఇబ్బందులను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో వినయ్‌భాస్కర్‌ గాయపడ్డారు. కాలు, చేతి నుంచి రక్తస్రావమైనట్లు సమాచారం. పోలీసులు తనపై దాడి చేశారని, కడుపులో తన్నారని వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఎంజీఎంలోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ఎంజీఎంలోని రోగులను పరామర్శించి, ఆస్పత్రిలోని పరిస్థితులను తెలుసుకునేందుకు వినయ్‌భాస్కర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అనుమతిపై స్పష్టత రాకపోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో గేటు పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం అనంతరం తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయడంతో పెనుగులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో వారిని తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయగా తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో కార్యకర్తలు ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నినాదాలు చేయడంతో ఎంజీఎం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం బీఆర్‌ఎస్‌ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
కడుపులో తన్నారు..
తోపులాటలో గాయపడినట్లు వినయ్‌భాస్కర్‌ తెలిపారు. పోలీసులు తనను కడుపులో తన్నారని, చేయికి గాయమైందని కన్నీటిపర్యంతమయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కనుసన్నల్లోనే పోలీసులు తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తనను ప్రభుత్వ ఆస్పత్రి అయిన ఎంజీఎంలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంజీఎంలోనే చికిత్స అందించండి.. ప్రైవేటు ఆస్పత్రికి వద్దు’ అంటూ ఆయన పోలీసులను కోరారు. కుట్రపూరితంగా తనను అజరా ఆస్పత్రికి తరలించారని వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు.
పెచ్చులూడుతున్న పైకప్పులు..
ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో ఆదివారం పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడిన ఘటన మరువకముందే మంగళవారం ఆర్‌ఐసీయూ వార్డులోనూ పైకప్పు పెచ్చులు ఊడిపడినట్లు సమాచారం. వరుస ఘటనల నేపథ్యంలో ఆస్పత్రి భవనాల భద్రత, నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వినయ్‌భాస్కర్‌ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితులను పరిశీలించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వివాదం ముదిరింది.

పేదలకు వైద్యం కరువు
ఎంజీఎంలో పేదలకు కనీస వైద్య సదుపాయాలు అందడం లేదని వినయ్‌భాస్కర్‌ విమర్శించారు. రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడం, పెచ్చులూడుతున్న భవనాల పైకప్పులు, అంబులెన్స్‌ల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మూడేళ్లుగా ఈ సమస్యలపై పాలకులు దృష్టి సారించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలన అని చెప్పుకుంటూ ప్రజల ప్రాణాలను పట్టించుకోని నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. ఎంజీఎం వంటి కీలక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించకుండా అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. ప్రజాప్రతినిధి రోగుల సమస్యలను తెలుసుకునేందుకు వస్తే అడ్డుకోవడం సరికాదని, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలను పోలీసులతో అడ్డుకోవడం తగదని వినయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు.
పోలీసులపై మహిళల ఆగ్రహం
వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంపై అక్కడ ఉన్న కొందరు మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎంలో కనీస వసతులు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన వినయ్‌భాస్కర్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను నిలదీశారు. ఇదిలా ఉంటే వినయ్‌భాస్కర్‌పై పోలీసులు దాడి చేయడాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌వీ నాయకుడు, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ బైరపాక ప్రశాంత్‌ గొంతును హనుమకొండ ఏసీపీ నర్సింహారావు నొక్కారని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular