కొండా కొత్త జెండా..
బీసీ ఆత్మగౌరవమే అజెండా..
40 ఏళ్ల రాజకీయ అనుభవంతో కొత్త వ్యూహం
మద్దతుదారులు, బీసీ మేధావులతో సమాలోచనలు..
రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు కసరత్తు?
హైకమాండ్‌తో విభేదాల వేళ కొత్త చర్చ
మంత్రి కొండా సురేఖ నిర్ణయంపైనే ఉత్కంఠ
స్పాట్ వాయిస్, ఓరుగల్లు : తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన రాజకీయ సమీకరణానికి రంగం సిద్ధమవుతోందా..? మంత్రి కొండా సురేఖ, కొండా మురళీధర్‌రావు దంపతులు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారా..? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. బీసీ ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యమే ప్రధాన అజెండాగా కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు అంశంపై కొండా దంపతులు తమ సన్నిహితులు, బీసీ మేధావులు, శ్రేయోభిలాషులతో సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి సురేఖకు రాజీనామా చేయాలనే వచ్చినట్లు జరుగుతున్న తాజా సంకేతాలు ఈ చర్చకు మరింత ప్రాధాన్యం కల్పిస్తున్నాయి.
కొత్త పార్టీ ఎందుకు..?
దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ.. ప్రధాన పార్టీల్లో తమకు ఎదురవుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక స్వతంత్ర రాజకీయ వేదికపై ముందుకు సాగాలన్న ఆలోచనకు కొండా దంపతులు వచ్చినట్లు సమాచారం. బీసీలకు జనాభా ప్రాతిపదికన తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఆత్మగౌరవం కల్పించడమే లక్ష్యంగా కొత్త పార్టీని నిర్మించాలన్న ప్రతిపాదనపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను ఒకే రాజకీయ వేదికపైకి తీసుకురావడం ద్వారా కొత్త శక్తిగా ఎదగవచ్చన్న అంచనాతో వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
40 ఏళ్ల రాజకీయ బలం
కొండా దంపతులకు ఉన్న దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజల్లో ఉన్న పరిచయం, బలమైన అనుచరగణం, అంగబలం, ఆర్థిక బలం కొత్త పార్టీకి కలిసి వస్తాయని వారి వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో పలు రాజకీయ పార్టీల్లో కీలక పాత్ర పోషించిన అనుభవం కూడా కొత్త వేదిక నిర్మాణానికి బలంగా మారుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎవరికి చోటు..
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలలో టికెట్లు దక్కక అసంతృప్తిగా ఉన్న నాయకులు, స్థానికంగా బలం ఉన్న నేతలు, సామాజిక వర్గాల నాయకత్వానికి కొత్త పార్టీలో అవకాశం కల్పించాలన్న ఆలోచన ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా బీసీ వర్గాల్లో ప్రభావం ఉన్న నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయాలన్న యోచన ఉన్నట్లు సమాచారం.
కింగ్‌మేకర్ వ్యూహం?
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ జరిగి ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. కొత్త పార్టీకి వచ్చే స్థానాల ఆధారంగా అధికార సమీకరణాల్లో కీలక పాత్ర పోషించవచ్చన్న అంచనా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా మారేలా వ్యూహం రూపొందించాలన్న చర్చ కొండా వర్గాల్లో జరుగుతున్నట్లు సమాచారం.
హైకమాండ్ వైఖరితో వేగం?
ఇదిలా ఉండగా.. మంత్రి కొండా సురేఖను గౌరవప్రదంగా పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ విషయాన్ని నేరుగా సురేఖకు చెప్పకుండా.. గతంలో ఆమె వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఓ సీనియర్ మంత్రి ద్వారా చెప్పించినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాలను పాటించి రాజీనామా చేయడం మంచిదని సదరు మంత్రి సురేఖకు సూచించినట్లు సమాచారం.
ఆయనతోనే ఎందుకు చెప్పించారు..?
కొండా సురేఖ కుమార్తె సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ వేర్వేరుగా నివేదికలు సమర్పించినట్లు సమాచారం. గతంలో ఇలాంటి పరిణామాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మరో ఇద్దరు సీనియర్ మంత్రులు జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగించారు. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉండటంతో.. గతంలో జోక్యం చేసుకున్న సీనియర్ మంత్రికే అధిష్టానం ఈ బాధ్యత అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మద్దతు ఎక్కడ..?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న సురేఖకు ఈసారి పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని సమాచారం. ఆదివారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సురేఖ కలిసి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆమెకు అనుకూలంగా స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది. దీంతో అధిష్టానం తన నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
సురేఖ నిర్ణయమే కీలకం
ఒకవైపు అధిష్టానం నుంచి రాజీనామా సంకేతాలు.. మరోవైపు కొత్త రాజకీయ వేదికపై సమాలోచనలు.. ఈ రెండు పరిణామాలు ఒకేసారి తెరపైకి రావడంతో కొండా దంపతుల తదుపరి అడుగుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా..? పదవికి రాజీనామా చేస్తారా..? లేక కొత్త పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుడతారా..? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సురేఖ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.

