సైబర్ కేటుగాడి అరెస్ట్
1,754 బ్యాంకు ఖాతాల ద్వారా నగదు మళ్లింపు..
క్రిప్టోగా మార్చి చైనాకు తరలింపు
స్పాట్ వాయిస్, డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భారీ సైబర్ మోసాల వ్యవహారంలో కీలక నిందితుడిని గుజరాత్ సీఐడీ సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ సహా ఏకంగా 1,090 సైబర్ నేరాలకు పాల్పడి రూ.1,071.5 కోట్ల మేర నగదును కొల్లగొట్టినట్లు దర్యాప్తులో వెలుగుచూసింది. అసోంలోని బార్పేటకు చెందిన 25 ఏళ్ల రఫీకుల్ ఆలమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చైనాకు చెందిన ముఠాలతో సంబంధాలు..
దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం.. రఫీకుల్ ఆలమ్‌కు చైనాకు చెందిన సైబర్ నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. డిజిటల్ అరెస్ట్, ఇతర ఆన్‌లైన్ మోసాల ద్వారా బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, ఆ నగదును నేరుగా ఒకే ఖాతాలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించేవాడు.
గంటలోనే చిన్న మొత్తాలుగా విభజన
సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దర్యాప్తు ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ, ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు అనుమానం రాకుండా నిందితుడు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించేవాడు. భారీ మొత్తంలో వచ్చిన నగదును చిన్న చిన్న భాగాలుగా విభజించి, కేవలం గంట వ్యవధిలోనే వివిధ ఖాతాల్లోకి జమ చేసేవాడని అధికారులు గుర్తించారు. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఉన్న 1,754 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఒక ఖాతాలో ఎక్కువ మొత్తంలో నగదు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేవాడు.
క్రిప్టోగా మార్చి విదేశాలకు..
బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన నగదును అనంతరం క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు తరలించినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చైనాకు చెందిన నెట్‌వర్క్‌కు ఈ నగదు చేరేలా ఏర్పాట్లు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం మనీల్యాండరింగ్ తరహాలో పకడ్బందీగా సాగినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
లోతుగా దర్యాప్తు
ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలు పోలీసులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో సైబర్ మోసాలకు పాల్పడేందుకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, క్రిప్టో లావాదేవీలు, విదేశీ నెట్‌వర్క్‌పై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రఫీకుల్ ఆలమ్ వెనుక ఉన్న ఇతర నిందితులు, అంతర్జాతీయ సైబర్ ముఠాల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.
