
- పంది కడుపులో ఏనుగు పిల్ల
- నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : బ్రహ్మం గారు చెప్పినట్టు పంది కడుపులో ఏనుగు పిల్ల పుట్టింది. కానీ దాని ఆయుష్షు కొంతసేపే ఉంది. ఈ వింత ఘటనను చూసేందుకు జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. పంది కడుపులో ఏనుగు పిల్ల ఆకారంలో పిల్ల జన్మించింది. పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే వ్యక్తి పందులను పెంచుతూ జీవనోపాధి పొందుతున్నాడు. అతని దగ్గర ఉన్న ఒక పంది మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. మొదట సంతోషం వ్యక్తం చేసిన వెంకటయ్య తర్వాత ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఏడు పంది పిల్లల్లో ఒకటి అచ్చం ఏనుగు ఆకారాన్ని పోలి ఉండడంతో ఆశ్చర్యానికి లోనయ్యాడు అంతలోనే కుటుంబ సభ్యులు, స్థానికులకు విషయం తెలిసిపోయింది. ఏనుగు ఆకారంలో ఉన్న పందిపిల్లను చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున వెంకటయ్య ఇంటికి తరలివచ్చారు. అచ్చం ఏనుగు పిల్ల ఆకారాన్ని పందిపిల్ల పోలి ఉండడం విశేషం. తొండం ఆకారం, భారీ చెవులతో చూడగానే ఏనుగు పిల్ల అనేలా కనిపిస్తోంది. అయితే అది పుట్టిన కొన్ని గంటలలోనే పంది పిల్లతో పాటు మరో పంది పిల్ల సైతం మరణించింది. ప్రస్తుతం ఐదు పందిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయి.

