రైస్ మిల్లర్లపై ఆర్ఆర్ చట్టం
స్పాట్ వాయిస్, ఓరుగల్లు: తెలంగాణలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న డిఫాల్టర్ రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టాన్ని అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వలను తనిఖీ చేయనుంది. నిల్వల్లో లోటు కనిపిస్తే మిల్లర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణకు ఏడు రోజుల గడువు ఇవ్వనున్నారు. సరైన వివరణ ఇవ్వకపోయినా, బకాయిలు చెల్లించకపోయినా ఆర్ఆర్ చట్టం కింద చర్యలు చేపడతారు. ఇందులో భాగంగా మిల్లుల యంత్రాలు, వాహనాలు, ఇతర చరాస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేయనున్నారు. అవసరమైతే భూములు, ఇళ్ల వంటి స్థిరాస్తులను సైతం జప్తు చేసి బహిరంగ వేలం ద్వారా బకాయిలను రాబట్టనున్నారు. ఈ ప్రక్రియపై డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ సివిల్ సప్లైస్ అధికారులకు అక్టోబర్ 5 నుంచి హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. తనిఖీల్లో సేకరించే ఆధారాలు భవిష్యత్ న్యాయపరమైన ప్రక్రియకు ఉపయోగపడేలా రికార్డులు పక్కాగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

