జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్ కుమార్
డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
టీడీఎంయూ రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు
స్పాట్ వాయిస్, హన్మకొండ: జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్కుమార్ డిమాండ్ చేశారు. సమాజంలో డిజిటల్ మీడియా హవా కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో మీడియా రంగానికి సంబంధించిన విధానపరమైన సిఫార్సులు చేసేందుకు ప్రత్యేకంగా కొత్త మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు.శుక్రవారం హన్మకొండలో జరిగిన యూనియన్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.ప్రింట్, ప్రసార, డిజిటల్ మీడియా ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం సంఘం కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా అనే వ్యత్యాసాలు లేకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రధాన జర్నలిస్టు సంఘాలు విఫలమయ్యాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘo గౌరవ సలహాదారు రాజేశ్వరరావు, కోశాధికారి వంశీ, ఉపాధ్యక్షుడు మోహన్ రావు, సహాయ కార్యదర్శి నగేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

