కేటీపీపీ ఎదుట బీఆర్‌ఎస్ మహాధర్నా..
ప్లాంట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
కేసీఆర్ హయాంలోనే 24 గంటల నాణ్యమైన కరెంట్
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
స్పాట్ వాయిస్, గణపురం: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలు, చేతకానితనం వల్లే రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి సంక్షోభం ఏర్పడిందని జనగామ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ) సందర్శనకు వచ్చిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలను పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్లాంట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో కేటీపీపీ ప్రధాన ద్వారం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరును, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి తదితరులతో కలిసి కేటీపీపీ ఎదుట బైఠాయించి మహాధర్నా చేపట్టారు. అనంతరం బీఆర్‌ఎస్ బృందాన్ని సొంత పూచీకత్తుపై ప్లాంట్‌లోకి అనుమతించారు.
కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంట్
ధర్నాలో పల్లా మాట్లాడుతూ.. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఉమ్మడి పాలనలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని, తెలంగాణ ఉద్యమమే కరెంట్ పోరాటాల నుంచి పుట్టిందని గుర్తుచేశారు. 2014 నాటికి రాష్ట్రంలో 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాటిని 30 లక్షలకు పెంచారని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు.
విద్యుత్ రంగంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
2014 నుంచి 2023 వరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు వెచ్చించిందని పల్లా తెలిపారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 5,500 మెగావాట్లుగా ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని 22,000 మెగావాట్లకు పెంచిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కేటీపీపీ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లతో పాటు ఎన్టీపీసీలో 1,600 మెగావాట్లు, 5,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మూడు, నాలుగేళ్లలో భారీ థర్మల్ ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు వేల కోట్లతో 400 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి పటిష్టమైన విద్యుత్ నెట్‌వర్క్ నిర్మించామని పేర్కొన్నారు.
బొగ్గు కొరత పేరుతో ప్లాంట్ల మూసివేత
సింగరేణి సంస్థకు జెన్‌కో విభాగం రూ.52 వేల కోట్ల బకాయిలు ఉండటంతో బొగ్గు సరఫరా నిలిపివేశారని పల్లా ఆరోపించారు. రికార్డుల్లో 40 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపుతున్నా వాస్తవంగా నిల్వలు లేవన్నారు. నాణ్యమైన బొగ్గును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకు విక్రయిస్తూ తెలంగాణ ప్రాజెక్టులకు సరఫరా చేయడం లేదని విమర్శించారు. కేటీపీపీకి రోజుకు 5,000 టన్నుల బొగ్గు అవసరం ఉండగా కేవలం 1,500 టన్నులు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి, భూపాలపల్లి ప్లాంట్లలో సగానికిపైగా యూనిట్లను షట్‌డౌన్ చేసి కృత్రిమ విద్యుత్ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాము వస్తున్నామని తెలిసి రెండు యూనిట్లను నడుపుతున్నట్లు చూపిస్తున్నారని, తమ పర్యటన ముగిసిన తర్వాత మళ్లీ షట్‌డౌన్ పేరుతో మూసివేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.
కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాల్లో మంత్రులు
మంత్రులు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా దోపిడీలో మునిగిపోయారని పల్లా ఆరోపించారు. విద్యుత్ శాఖ మంత్రి కమీషన్ల వేటలో ఉండగా, ఇన్‌చార్జి మంత్రులు 30, 40 శాతం వాటాల కోసం భూముల పంచాయితీలు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి కూడా రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రుల కంటే పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు.
గోదావరి నీటిని ఎత్తిపోసే తెలివి లేదు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వాయర్లు నిండుతున్నా తెలంగాణలో గోదావరి నిండుగా ప్రవహిస్తున్నా నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టడం లేదని పల్లా విమర్శించారు. సమ్మక్క సాగర్ వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నా ఉమ్మడి వరంగల్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఎత్తిపోస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో దేవాదుల మోటార్లు కూడా నడపడం లేదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సమ్మక్క సాగర్ నిర్మాణం, 48 కిలోమీటర్ల టన్నెల్, రిజర్వాయర్ల నిర్మాణం జరిగితే ప్రస్తుత ప్రభుత్వం ఒక్క మీటర్ కాలువ కూడా తవ్వలేదని, ఒక్క తట్టెడు మట్టి తీయలేదని, ఒక్క మోటారు పెట్టలేదని విమర్శించారు. కరెంట్ లేదనే సాకుతో మోటార్లు నడపకుండా పంటలను ఎండబెడుతున్నారని ఆరోపించారు.
‘చేతకాకపోతే ముక్కు నేలకు రాయండి’
రైతుబంధు ఇవ్వలేదని, రైతుబీమాను అటకెక్కించారని, కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను గాలికొదిలేశారని పల్లా విమర్శించారు. తాము కొత్తగా ఏమీ అడగడం లేదని, గతంలో నిర్మించిన ప్రాజెక్టులను సక్రమంగా నడిపి రైతులకు 24 గంటల కరెంట్, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జెన్‌కో బకాయిలుగా ఉన్న రూ.52 వేల కోట్లను వెంటనే చెల్లించి కేటీపీపీ, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లకు బొగ్గు సరఫరా పునరుద్ధరించాలని కోరారు. బీఆర్‌ఎస్ నేతలను బెదిరింపులు, రాళ్లదాడులతో భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘‘ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది. అక్రమంగా ఏదైనా ఉంటే తేల్చండి.. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదు. పాలన చేతనైతే విద్యుత్ ప్లాంట్లను నడిపి రైతులకు కరెంట్ ఇవ్వండి.. చేతకాకపోతే సిగ్గుపడి ముక్కు నేలకు రాయండి’’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

