డబ్బు లావాదేవీలు, అక్రమ సంబంధం అనుమానమే కారణమా?
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
స్పాట్ వాయిస్, రేగొండ: రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఫాస్ట్‌ఫుడ్ నిర్వాహకుడు దారుణ హత్యకు గురయ్యాడు. డీఎస్పీ డి. సంపత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. రంగయ్యపల్లికి చెందిన జెట్టి శ్రావణ్ (34) గత ఐదేళ్లుగా రేగొండలోని రాజరాజేశ్వరి వైన్స్ ఎదుట భవాని బిర్యానీ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో దుకాణం మూసివేసి వెళ్తుండగా రేగొండకు చెందిన మల్లెబోయిన శ్రీకాంత్ మరికొందరితో కలిసి వచ్చి తల్వార్లు, కత్తులతో తల, మెడపై విచక్షణారహితంగా దాడి చేయడంతో శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. షాపులో పనిచేసే వ్యక్తి సమాచారం మేరకు మృతుడి భార్య మౌనిక ఘటనాస్థలికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో జరిగిన డబ్బు లావాదేవీల వివాదం, అలాగే తన భర్తకు నిందితుడి భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతోనే శ్రీకాంత్ హత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ డి. సంపత్‌రావు తెలిపారు.

