ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeఎడిటోరియల్సిలిండర్ల సరఫరా 20% పెంపు

సిలిండర్ల సరఫరా 20% పెంపు

📰 Generate e-Paper Clip

వాణిజ్య సిలిండర్ల సరఫరా 20% పెంపు

  • వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం
    హోటల్ రంగానికి ఊరట

స్పాట్ వాయిస్ తెలంగాణ: దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ (LPG) సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్యాంటీన్లు వంటి వ్యాపార వర్గాలకు ఉపశమనం కలిగించే ఈ నిర్ణయంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం అధికారికంగా సమాచారం అందించింది.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరాలపై ఒత్తిడి పెరగడంతో, ఇప్పటివరకు గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు వాణిజ్య రంగానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల వాణిజ్య సిలిండర్ల కొరతతో అనేక హోటళ్లు, ఫుడ్ యూనిట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్నిచోట్ల వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో కేంద్రం దశలవారీగా సరఫరాలను పెంచుతూ, తాజాగా మరో 20 శాతం అదనపు కేటాయింపును ఆమోదించింది. దీంతో మొత్తం వాణిజ్య సిలిండర్ కేటాయింపు సుమారు 50 శాతానికి చేరినట్లు అధికారులు వెల్లడించారు. ఇది ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు పెద్ద ఊరటగా మారనుంది.

అదనపు కేటాయింపుకు షరతులు

*ఈ పెంపు కొన్ని షరతులతో అమల్లోకి రానుంది*

* వాణిజ్య సంస్థలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి
* పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కోసం దరఖాస్తు చేయాలి

పీఎన్‌జీ వినియోగాన్ని పెంచడం ద్వారా భవిష్యత్తులో సిలిండర్లపై ఆధారాన్ని తగ్గించాలన్నదే కేంద్ర లక్ష్యంగా తెలుస్తోంది.

గృహ వినియోగదారులకు భరోసా

గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని, సాధారణ డెలివరీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపింది. ప్రజలు ఆందోళనతో అధిక బుకింగ్స్ చేయకుండా, హోం డెలివరీ సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

వలస కూలీలకు ఉచిత సిలిండర్లు

వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎల్లుండి నుంచి ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది.

అలాగే నగర గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లను విస్తరించేందుకు రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. దేశంలో ఇంధన కొరత లేదని, భయంతో కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

కీలక నిర్ణయం

దేశీయ ఉత్పత్తి పెంపు, అదనపు కిరోసిన్ సరఫరా వంటి చర్యలతో ఇంధన భద్రతను బలోపేతం చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వాణిజ్య రంగానికి ఊరటనిస్తూ, గృహ వినియోగదారులకు భరోసా కల్పించే ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో కీలకంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular