
-
27 ఏళ్ల నిరీక్షణకు తెర..
-
59 ఏళ్ల వయసులో ప్రభుత్వ టీచర్ ఉద్యోగం!
స్పాట్ వాయిస్, హైదరాబాద్: పట్టుదల ఉంటే వయసు అడ్డంకి కాదని ఉత్తరప్రదేశ్‌కు చెందిన విజయ్ కుమార్ శర్మ నిరూపించారు. 27 ఏళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించిన ఆయనకు ఎట్టకేలకు 59 ఏళ్ల వయసులో కల నెరవేరింది.
బాగ్పత్ జిల్లా బడ్రవాడ్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శర్మ 1999లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలు రాయడం ప్రారంభించారు. ఈ క్రమంలో పలుమార్లు రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, ఇంటర్వ్యూ దశలో తుది ఎంపికకు దూరమయ్యారు. ఆయన TGT పరీక్షను ఆరుసార్లు, PGT పరీక్షను నాలుగుసార్లు పాస్ చేసినట్లు తెలిపారు. దాదాపు ఎనిమిది సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం మాత్రం దక్కలేదు.
అయినా ఆయన ప్రయత్నాలను ఆపలేదు. ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూనే గత 26 ఏళ్లుగా ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పిల్లలకు పాఠాలు చెబుతూనే తన లక్ష్యం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.
ఈసారి జరిగిన నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ లేకపోవడం విజయ్ కుమార్‌కు కీలకంగా మారింది. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఆయన ఎంపికయ్యారు. సెప్టెంబర్ 22న లక్నోలో జరిగిన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
విజయ్ కుమార్ శర్మకు షామ్లీ జిల్లాలోని ఎయిడెడ్ సెకండరీ పాఠశాలలో TGT సంస్కృత ఉపాధ్యాయుడిగా పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం ఆయన వయసు సుమారు 59 సంవత్సరాల 8 నెలలు. ఉత్తరప్రదేశ్‌లో ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు కావడంతో, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఆయనకు దాదాపు రెండేళ్లకు పైగా సేవ చేసే అవకాశం ఉంటుంది.
విజయ్ కుమార్ కుటుంబంలోనూ ప్రభుత్వ సేవతో అనుబంధం ఉంది. ఆయన తండ్రి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన ఇద్దరు కుమారులు ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తుండగా, ఒక కుమార్తె కూడా ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికై ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
27 ఏళ్ల పాటు ఎన్నో పరీక్షలు, ఎన్నో వైఫల్యాలు ఎదురైనా లక్ష్యాన్ని వదలకుండా కొనసాగించిన విజయ్ కుమార్ శర్మ కథ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

