ePaper
Monday, September 7, 2026
ePaper
Homeతెలంగాణబరాబర్‌ బరిలో ఉంటా..! 

బరాబర్‌ బరిలో ఉంటా..! 

📰 Generate e-Paper Clip

మేయర్‌ రేసులో నేను లేదంటే నా కూతురు.. 

అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తా

డీలిమిటేషన్‌ తర్వాత సీటు ఖరారు.. 

ఐదు నియోజకవర్గాల్లో నాకంటూ బలం ఉంది.. 

పార్టీ మారను.. మడమ తిప్పను 

పవర్‌ అండ్ మనీ పాలిటిక్స్‌ పెరిగాయి..

 

విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా

నిర్బంధాలే నన్ను రాజకీయంగా తీర్చిదిద్దాయి

డిజిటల్ మీడియా చిట్ చాట్ లో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జంగా రాఘవరెడ్డి

 

స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: విద్యార్థి దశ నుంచే ప్రజల కోసం పోరాడుతూ.. నిర్బంధాలు, కేసులు, కష్టాలను ఎదుర్కొంటూ రాజకీయంగా ఎదిగానని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ తాజా మాజీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల మధ్యే ఉంటూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నానని చెప్పారు. ‘జంగా’ అంటే ఒక్క వ్యక్తి కాదని.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక కార్యకర్తల బలం, ఓటు బ్యాంకు ఉందని పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపులో తన పాత్ర కీలకంగా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన రాజకీయ ప్రస్థానం, ప్రజా ఉద్యమాల అనుభవాలు, కాంగ్రెస్‌తో అనుబంధం, రైతుల కోసం చేసిన కార్యక్రమాలు, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ రేసు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల లక్ష్యమంటూ వెల్లడించారు.

అణిచివేస్తేనే రాజకీయాల్లోకి వచ్చా..

మొదటి నుంచీ మాది కాంగ్రెస్‌ పార్టీ కుటుంబమే. మా నాన్న సర్పంచ్‌గా పనిచేశారు. అయితే నేను మాత్రం పాఠశాల దశ నుంచే విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల కోసం పనిచేయడం ప్రారంభించా. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న క్రమంలో అప్పటి ప్రభుత్వాల నుంచి అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నా. పోలీసుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఆ నిర్బంధాలు, ప్రజా ఉద్యమాలే నన్ను నాయకుడిగా తీర్చిదిద్దాయి. విద్యార్థి దశలో నా రాజకీయ గురువు సుధాకర్‌గాంధీ. ఆయన వల్లే నేను ప్రజా ఉద్యమాల్లోకి వచ్చా. ప్రజల సమస్యలపై ప్రశ్నించడం నేర్చుకున్నా. ప్రశ్నించకుండా ఉంటే సమస్యలు పరిష్కారం కావు. ప్రజల కోసం ప్రశ్నించినప్పుడే ప్రజలు మన వెంట నడుస్తారు. అదే నమ్మకంతో ఇన్నేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నా. నిర్బంధాలు, కేసులు, కష్టాలు వచ్చినప్పుడల్లా వెనక్కి వెళ్లకుండా మరింత బలంగా పనిచేశా. ప్రజల మధ్య ఉండటం, ప్రజల సమస్యలపై పోరాడటం నా రాజకీయ జీవితానికి మొదటి నుంచీ పునాది.

వాళ్ల గెలుపులో నాపాత్ర ఉంది..

కాంట్రాక్టర్‌గా, వ్యాపారవేత్తగా పనిచేస్తూనే రాజకీయాల్లోకి వచ్చా. సీరియస్‌ పొలిటిషియన్‌గా మారిన తర్వాత కాజీపేట దర్గా పీఏసీఎస్‌ చైర్మన్‌గా రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశా. ఆ సమయంలో జిల్లా రైతులకు మేలు చేసేలా అనేక కార్యక్రమాలు చేపట్టా. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేశా. డీసీసీబీని మరింత బలోపేతం చేయడానికి కూడా పనిచేశా. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సీడ్స్‌ అండ్‌ ఆయిల్‌ఫెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టా. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచేందుకు అహర్నిశలు పనిచేశా. రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం వచ్చేలా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించా. తెలంగాణవ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ సాగు పెరిగింది. రైతులకు అది ఎంతో లాభదాయకమైన పంటగా మారుతోంది. రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే నా లక్ష్యం. ఏ పదవిలో ఉన్నా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నదే నా ఆలోచన. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేటలో నాకు ప్రత్యేకంగా పనిచేసే సైన్యం ఉంది. నాకంటూ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపులో నా పాత్ర కూడా ఉంటుంది. జంగా అంటే ఒక వ్యక్తి కాదు.. అనేక నియోజకవర్గాల్లో ప్రజలతో నాకు ఉన్న అనుబంధం, కార్యకర్తల బలం కలిసిన రాజకీయ శక్తి.

 

మేయర్‌ రేసులో నేను లేదంటే నా బిడ్డ

అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పార్టీ కోసం పని చేస్తున్న సీనియర్‌ నాయకుడిగా కాంగ్రెస్‌ పార్టీ నన్ను గుర్తిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. పార్టీపై నాకు చాలా విశ్వాసం ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారన్న నమ్మకం ఉంది. రానున్న గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ రేసులో ఉన్నా. నా కూతురు డాక్టర్‌ నిఖితారెడ్డి కూడా బరిలో ఉంటుంది. గ్రేటర్‌ వరంగల్‌ ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నా. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నా. మహిళలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సీరియస్‌గా పనిచేస్తున్నా. ప్రజల్లో ఉండటం నాకు కొత్త కాదు. పదవి ఉన్నప్పుడే ప్రజల దగ్గరకు వెళ్లే రాజకీయ నాయకుడిని కాదు. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటా.

 

అసెంబ్లీ ఎన్నికలే నా టార్గెట్‌

దేశవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తెలంగాణలో కూడా నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల స్వరూపం కూడా మారవచ్చు. డీలిమిటేషన్‌ అంశాన్ని నేను ఆసక్తిగా గమనిస్తున్నా. నియోజకవర్గాల పునర్విభజన ఎలా జరుగుతుందనే దానిపైనే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆధారపడి ఉంటుంది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా బరిలో ఉంటా. ఎక్కడి నుంచి అనేది డీలిమిటేషన్‌ తర్వాత నిర్ణయించుకుంటా. కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు కూడా నా పట్ల సానుకూలంగా ఉన్నారన్న నమ్మకం ఉంది. అనేక ఎన్నికల్లో పార్టీ పెద్దలు, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి పనిచేశా. ఎక్కడా ధిక్కరించలేదు. ఈ క్రమంలో సీనియర్‌ నాయకుడిగా రాజకీయంగా, ఆర్థికంగా చాలా నష్టపోయా. అయినా పార్టీని వీడలేదు. పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నాకు మంచి అవకాశం ఇస్తుందన్న నమ్మకం ఉంది.

 

పవర్ పాలిటిక్స్..మనీ పాలిటిక్స్

రాజకీయాలతో పాటు పాత్రికేయ రంగం కూడా కొంత కలుషితమైందన్న బాధ నాకు ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు పవర్‌ పాలిటిక్స్‌, మనీ పాలిటిక్స్‌ పెరిగిపోయాయి. దీంతో ప్రజా ప్రయోజనాలు వెనక్కి వెళ్లి వ్యక్తిగత ప్రయోజనాలే ముందుకు వస్తున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన రాజకీయ వ్యవస్థలో వ్యక్తిగత ప్రయోజనాలు పెరగడం మంచిది కాదు. ఇదే సమయంలో పాత్రికేయ రంగంలోనూ కొన్ని మార్పులు వస్తున్నాయి. ఏదేమైనా పత్రికలు ప్రతిపక్ష పాత్ర పోషించాలి. జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉండాలి. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. ప్రజల కోసమే రాయాలి. ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించాలి. ప్రజలకు సంబంధించిన అంశాలను నిర్భయంగా రాయాలి. అలా అయితేనే ప్రభుత్వాలు, ఇతర వ్యవస్థలు కూడా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ బాధ్యతలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకం.

 

నీతి పొగొట్టుకోలే..

నేను రాజకీయాల్లో అనేక ఇబ్బందులు ఎదర్కొన్నా.. అయినా నీతి పోగొట్టుకోలేదని జంగా రాఘవరెడ్డి తెలిపారు. నమ్మకంగా ఉండడమే నాకు ఇష్టం. మోసాలు, తప్పులు చేసిన వారే రాజకీయంగా ఎదుగుతున్నారు. కానీ నేను అలాంటి రాజకీయాలు కోరుకోను. క్యాడర్ ను కాపాడుకుంటా. నేను పారిపోను.. పార్టీ మారనని చెప్పారు. ప్రస్తుతం నక్సల్ ప్రభావం లేకపోవడంతో ప్రజాప్రతినిధుల్లో జవాబుదారి తనం లేకుండాపోయింది. అయితే పోరాటం అనేది సమాజంలో ఎప్పుడూ ఉంటుందని, అది ఏరూపంలోనైనా రావచ్చన్నారు. ప్రస్తుతం నక్సల్స్ తర్వాత క్యాస్ట్ ఉద్యమం వచ్చిందని, రేపు మరోటి వస్తుందని చెప్పారు. రాజకీయాలు ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో యువత చాలా క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular