
నేడు మేం పరుగెత్తాం.. రేపటి నుంచి సర్కారు వంతు..
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి
ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ 2కే రన్
స్పాట్ వాయిస్, హనుమకొండ: ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం హనుమకొండలోని ఏకశిల పార్క్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. టీఎన్జీవోస్ నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, యువత, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారుఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. “నేడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మేం పరుగెత్తాం.. రేపటి నుంచి ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తాం” అని అన్నారు. ఓరుగల్లు కేంద్రంగా ప్రారంభమైన ఏ ఉద్యమం ఓడిపోలేదని, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, నిరుద్యోగుల ఉద్యమం కూడా విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలు వెంటనే విడుదల చేయాలని, నూతన పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ గ్రాట్యుటీ, పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఆశా, అంగన్వాడీ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, హోంగార్డులు, లైసెన్స్ సర్వేయర్లు, 104, 108 సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

ఉద్యోగుల సంక్షేమంపై నిర్లక్ష్యం తగదు
మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల హక్కులైన పీఆర్సీ, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు నిధులు ఎందుకు కేటాయించడం లేదని రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగుల జీతాల నుంచి ఈహెచ్ఎస్ పేరుతో కోతలు విధిస్తున్నప్పుడు వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్ హయాంలో ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చామని, పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ కల్పించారని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలతో 2కే రన్‌ను రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా విస్తరిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర, జిల్లా నేతలు, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు రామస్వామి, సదానందం తదితరులు పాల్గొన్నారు.

