గద్దర్ గీతాలు ప్రజా చైతన్యానికి వెలుగుదారులు: కరుణాకర్ రావు
కాటారం, స్పాట్ వాయిస్: మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి, ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, డీసీసీ అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను గణాంకాలు, చారిత్రక ఆధారాలతో ప్రజలకు వివరించి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు, దూరదృష్టి, అంకితభావం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన పునాది వేశాయని అన్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ తన పాటలు, కవిత్వం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి, తెలంగాణ ఉద్యమానికి తన గళాన్ని అంకితం చేశారని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడిగా గద్దర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు. మహనీయుల సేవలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజాసేవ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జయశంకర్, గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
