స్పాట్ వాయిస్, గణపురం: శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మండల కేంద్రంలోని చారిత్రక కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లులో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని గణపేశ్వరునికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో వాయినాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలు, ఎరుపు, పసుపు రంగుల గాజులు, రూపాయి నాణేల మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి సాయిని రమేష్-శ్రీదేవి దంపతులు నాణేల మాలలను స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా కోటగుళ్ల పరిరక్షణ కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
