ప్రమాదంలో రామప్ప..!
చరిత్రను చెరిపే తవ్వకాలొద్దు..
వారసత్వ సంపదను కాపాడుకుందాం..
ఓపెన్ కాస్ట్ గని ప్రతిపాదనను ఆపాలి..
ఐదు కిలోమీటర్ల దూరంలో 300 మీటర్ల లోతున తవ్వకాలు
భూగర్భ చీలికలతో సరస్సు నీరు లీకయ్యే ప్రమాదం
కట్ట తెగితే దిగువ ప్రాంతాలకు పెను ముప్పు
పునాదిలో ఇసుక కొట్టుకుపోతే ఆలయ స్థిరత్వానికి దెబ్బ
యునెస్కో గుర్తింపుపైనా ప్రభావం పడే అవకాశం
గని ప్రతిపాదనను నిలిపివేయాలని ప్రొఫెసర్ పాండు రంగారావు డిమాండ్
కాకతీయుల వారసత్వాన్ని కాపాడాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి
డిజిటల్ మీడియాతో కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ప్రొఫెసర్ ఎం. పాండు రంగారావు
స్పాట్ వాయిస్, ప్రధాన ప్రతినిధి: రామప్ప సరస్సు, కాకతీయుల అద్భుత శిల్పకళకు ప్రతీకగా నిలిచిన రామప్ప ఆలయ భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి. సరస్సుకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదించిన గనిలో బొగ్గు తవ్వకాల కోసం బ్లాస్టింగ్, భారీ డ్రిల్లింగ్ చేపడితే సరస్సు కట్ట నిర్మాణానికి, ఆలయానికి, చుట్టుపక్కల గ్రామాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వారసత్వ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రామప్ప సరస్సు వ్యవసాయానికి, స్థానిక గ్రామాల జీవనానికి కీలకం. సరస్సు కట్టకు ఏదైనా నష్టం వాటిల్లితే దాని ప్రభావం నీటి నిల్వపైనే కాకుండా దిగువ ప్రాంతాలపైనా పడే ప్రమాదం ఉందని పరిరక్షణవాదులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని, దాని చుట్టూ ఉన్న సహజ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, గని ప్రతిపాదనను పూర్తిగా ఉపసంహరించుకోవాలని వారసత్వ పరిరక్షణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్టీ, ఇన్టాక్ (INTACH) వరంగల్ చాప్టర్ కన్వీనర్, వరంగల్ నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం. పాండు రంగారావు.. ఓపెన్‌కాస్ట్ గని ఏర్పాటు చేస్తే వారసత్వ కట్టడం ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూగర్భంలోని చీలికలు, రాతి పొరల మధ్య ఖాళీలు బ్లాస్టింగులతో క్రియాశీలమైతే కట్ట భద్రతపై ప్రభావం పడవచ్చని, పేలుళ్ల ప్రకంపనలతో ఆలయ పునాది స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పరిరక్షణపైనా ప్రభావం పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గని ప్రతిపాదనపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా శాస్త్రీయ నివేదికలను సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. రామప్పకు పొంచి ఉన్న ప్రమాదాలను వివరించారు. ఆయన చెప్పిన వివరాలు మీకోసం..
భూగర్భ చీలికలే ప్రధాన ముప్పు
సింగరేణి ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ గనితో రామప్ప ఆలయం, సరస్సుకు ముప్పు తప్పదని పాండురంగారావు తెలిపారు. సుమారు 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టాలని ప్రతిపాదించిన గని ప్రాంతం రామప్ప సరస్సు, ఆలయానికి దిగువ ప్రవాహ దిశలో సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని, అక్కడ చేపట్టే తవ్వకాలు, బ్లాస్టింగులతో భూమి లోపల ఇప్పటికే ఉన్న చీలికలు మళ్లీ క్రియాశీలమయ్యే ప్రమాదం ఉందన్నారు. వాటి ద్వారా సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని, నీటి ప్రవాహంలో మార్పులు, కట్ట కింద భూగర్భ పరిస్థితులపై ప్రభావం కారణంగా రామప్ప సరస్సు కట్ట భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశాన్ని విస్మరించకూడదన్నారు. ఇప్పటికే అంతర్భాగంలో పగుళ్లు ఉన్నాయని సాటిలైట్ ద్వారా గుర్తించినట్లు తెలిపారు. కట్ట తెగితే దిగువ ప్రాంతాల్లోని ఆస్తులు, పంటలు, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతోపాటు రామప్ప ఆలయ పరిసరాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఓపెన్‌కాస్ట్ పేలుళ్ల ప్రకంపనలు ఆలయ నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని, ఈ పరిణామాలు రామప్ప ఆలయ భద్రతతోపాటు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పరిరక్షణపైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. కాకతీయుల అపూర్వ సాంస్కృతిక, కళా సంపదను ప్రమాదంలోకి నెట్టే ఈ గని విషయంలో ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు.
ప్రమాదం 100శాతం..
ఈ గని వల్ల పెద్దగా ప్రమాదం లేదని సింగరేణి యాజమాన్యం చెబుతోంది. కర్ణాటకలోని సూరత్కల్ నిట్ సంస్థ అధ్యయనం చేసి, ఓపెన్‌కాస్ట్ గనితో రామప్ప ఆలయానికి పెద్దగా ప్రమాదం లేదని నివేదిక ఇచ్చినట్లు యాజమాన్యం పేర్కొంటోంది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్వోసీ) తీసుకున్నామని చెబుతోంది. భూగర్భాన్ని, భూమి పొరలను సర్వే చేసే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) నుంచి కూడా అనుమతి పొందినట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోంది. అయితే, రామప్ప ఆలయం, సరస్సు భద్రతను అంచనా వేసేటప్పుడు గని ప్రాంతానికి ఉన్న దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవద్దు. భూమి లోపల ఉన్న రాతి పొరలు, వాటి అమరిక, భ్రంశాలు, చీలికలు, భూగర్భ జలాల ప్రవాహ మార్గాలే కీలకం. వెంకటాపూర్ వద్ద ప్రతిపాదించిన గని ప్రాంతానికి, రామప్ప సరస్సుకు మధ్య భూగర్భ సంబంధం ఉందా లేదా అన్నది శాస్త్రీయంగా పరిశీలించాలి. ఈ ప్రాంతంలోని భౌగోళిక నిర్మాణాలను పరిశీలిస్తే రాతి పొరల్లో ప్రధాన, ఉప భ్రంశాలు, పగుళ్లు, జాయింట్లు విస్తరించి ఉన్నట్లు మా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు రూపొందించిన పటంలో చూపించాం. భూమిపై కనిపించని ఈ చీలికలు భూగర్భంలో నీటి ప్రవాహానికి మార్గాలుగా పనిచేసే అవకాశం ఉంది. ఓపెన్‌కాస్ట్ తవ్వకాలు, బ్లాస్టింగుల వల్ల భూమి లోపలి సహజ నిర్మాణంపై ఒత్తిడి ఏర్పడవచ్చు. దాంతో ఇప్పటికే ఉన్న చీలికలు క్రియాశీలమవుతాయా, భూగర్భ జలాల కదలికలో మార్పులు వస్తాయా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది. గని ప్రాంతానికి, సరస్సుకు మధ్య ఉన్న భౌగోళిక అనుసంధానాన్ని విస్మరించడం వల్ల ప్రమాద తీవ్రతను తక్కువగా అంచనా వేసే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే ఈ గని ప్రభావాన్ని భూమిపై కనిపించే దూరంతో కాకుండా, భూగర్భ నిర్మాణం ఆధారంగా అర్థం చేసుకోవాలి. సింగరేణి యాజమాన్యం చెబుతున్న అధ్యయన నివేదికలు, అనుమతుల వివరాలను కూడా పూర్తిగా పరిశీలించి, వాటిలో భూగర్భ చీలికలు, సరస్సు నీటి ప్రవాహం, కట్ట స్థిరత్వం వంటి అంశాలను ఏ మేరకు పరిగణనలోకి తీసుకున్నారో స్పష్టం చేయాలి.
సరస్సు నీరు లీకై కట్ట తెగే ప్రమాదం
ఈ ప్రాంతం ప్రాణహిత–గోదావరి గ్రాబెన్ బేసిన్లో భాగంగా ఉంది. ఇక్కడ పాఖాల్, సుల్లావాయి, దిగువ గోండ్వానా, ఎగువ గోండ్వానా శిలా నిర్మాణాలతోపాటు ఇసుకరాయి, షేల్, కంకర పొరలు, బొగ్గు నిల్వలకు సంబంధించిన భౌగోళిక నిర్మాణాలు ఉన్నాయి. రాతి పొరల్లోని చీలికలు, భ్రంశాలు, జాయింట్లు భూగర్భ జలాల ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. గని తవ్వకాలు 300 మీటర్ల లోతు వరకు సాగినప్పుడు అక్కడి భూగర్భ జలాల స్థాయి, నీటి పీడనంలో మార్పులు ఏర్పడే అవకాశాన్ని పరిశీలించాలి. ఇప్పటికే ఉన్న చీలికలు క్రియాశీలమైతే రామప్ప సరస్సు నీరు భూగర్భంలోకి లీకయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. రామప్ప సరస్సు సుమారు 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ఈ సరస్సు ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండు కొండలను కలుపుతూ నిర్మించిన మట్టి కట్ట రామప్ప సరస్సుకు ప్రత్యేకత. ఈ కట్ట నిర్మాణంలో భూగర్భం నుంచి నీరు ప్రవహించకుండా అడ్డుకునే కట్ఆఫ్ ట్రెంచ్ (భూగర్భ నీటి ప్రవాహాన్ని నిరోధించే కందకం) లేదని మా ట్రస్టు నివేదికలో పేర్కొన్నాం. గనిలో 300 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపడితే భూగర్భ జలాల మట్టం, నీటి పీడనం, ప్రవాహ దిశల్లో మార్పులు సంభవించే అవకాశం ఉంది. దీనివల్ల భూగర్భంలోని చీలికల ద్వారా నీరు బయటకు వెళ్లి, సరస్సు కట్టపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాం. కట్ఆఫ్ ట్రెంచ్ అనేది కట్ట కింద నీరు భూగర్భంలోకి ప్రవహించడాన్ని నియంత్రించేందుకు ఉపయోగించే నిరోధక నిర్మాణం. ఈ నిర్మాణం లేకపోవడం, భూగర్భ చీలికల ద్వారా నీటి ప్రవాహం పెరిగే పరిస్థితులు ఏర్పడటం వంటి అంశాలు కట్ట భద్రతపై ప్రభావం చూపుతాయా అన్నది లోతుగా పరిశీలించాలి. రామప్ప సరస్సు నీటిమట్టం, శిలా పొరల మధ్య ఉన్న జాయింట్ల ద్వారా భూగర్భ జలాలు ప్రవహించే విధానాన్ని ప్రభావితం చేయవచ్చని జీఎస్ఐ నివేదికకు సంబంధించిన సాంకేతిక వివరాలను తాము ప్రస్తావించాం. 1959 నివేదికలోని 72వ పేజీ ఆధారంగా ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తుచేశాం. రామప్ప సరస్సు నీటిమట్టం, భూగర్భ జలాల కదలిక, రాతి పొరల మధ్య సంబంధం, ప్రతిపాదిత గని లోతు వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. భూగర్భంలో నీటి పీడనంలో మార్పులు వస్తే అవి సరస్సు కట్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ముందుగానే అంచనా వేయాలి.
జియోలాజికల్ సర్వే నివేదికలోనూ కీలక అంశాలు
రామప్ప సరస్సు, ప్రతిపాదిత గని మధ్య భౌగోళిక సంబంధం, భూగర్భ జలాల ప్రవాహం, చీలికల ప్రభావం వంటి అంశాలను తాము కాకతీయ హెరిటేజ్ ట్రస్టు తరఫున ఇప్పటికే ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాం. 2023 జూన్ 30 తేదీతో ఉన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలోని అంశాలను మా అభ్యంతరాల్లో ప్రస్తావించాం. ఆ నివేదికలోని 21, 22 పేజీలకు సంబంధించిన వివరాలు రామప్ప సరస్సు నీటిమట్టం, భూగర్భ జలాల కదలిక, ప్రతిపాదిత గని తవ్వకాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైనవని పేర్కొన్నాం. భూగర్భ చీలికలు, రాతి పొరల నిర్మాణం, నీటి ప్రవాహ మార్గాలను విడివిడిగా కాకుండా పరస్పర సంబంధంతో పరిశీలించాలి. ఈ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో గని తవ్వకాలు చేపట్టడం వల్ల సరస్సు నీటి భద్రతపై ప్రభావం పడుతుందా అన్నది అధ్యయనం చేయాలి. మా ట్రస్టు ఈ అంశాలను ఆధారాలతో వివరించింది. అయినప్పటికీ గని ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేటప్పుడు సరస్సు కట్ట భద్రత, భూగర్భ జలాల ప్రవాహం, ఆలయ నిర్మాణ స్థిరత్వం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. శాస్త్రీయ నివేదికల్లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా గని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడం సరికాదు. ఈ నివేదికలోని వివరాలను సంబంధిత శాఖలు సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని, రామప్ప ఆలయం, సరస్సు భద్రతకు సంబంధించిన అంశాలపై బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాలి. జీఎస్ఐ నివేదికలోని పూర్తి వివరాలను అధికారికంగా పరిశీలించి, గని ప్రతిపాదనకు సంబంధించి ఏ అంశాలు పరిశీలించబడ్డాయి, ఏ అంశాలపై అదనపు అధ్యయనం అవసరమో స్పష్టంగా వెల్లడించాలి. రామప్ప సరస్సు, ఆలయ ప్రాంతంలోని భౌగోళిక చీలికలు, రాతి పొరల వాలు, భూగర్భ జలాల ప్రవాహ మార్గాలను చూపించే పటాలను కూడా సంబంధిత సంస్థలు సమీక్షించాలి. గని ప్రాంతం, సరస్సు, ఆలయం మధ్య భూగర్భ నిర్మాణాల సంబంధాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి, తవ్వకాలు చేపడితే నీటి ప్రవాహంలో ఎలాంటి మార్పులు రావచ్చో అంచనా వేయాలి. ఈ అంశాలపై స్పష్టత వచ్చే వరకు గని ప్రతిపాదనపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నాను.
పేలుళ్ల ప్రకంపనలతో ఆలయ నిర్మాణానికి నష్టం
రామప్ప ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సాండ్‌బాక్స్ టెక్నాలజీ కాకతీయుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. పునాది భాగంలో ఇసుకను నింపి, దాని మీద ఆలయ నిర్మాణ భారాన్ని మోయించే విధానాన్ని ఉపయోగించారు. ఇందులో పరిమితమైన ఇసుకను నిర్దిష్ట స్థితిలో ఉంచడం కీలకం. ఇసుక తన పరిమితుల్లో సురక్షితంగా ఉన్నంతకాలం ఆలయ నిర్మాణ భారాన్ని ఈ పునాది సమర్థంగా మోయగలదు. ఈ ప్రత్యేక నిర్మాణ పద్ధతి కారణంగానే ఈ స్మారక చిహ్నం 800 సంవత్సరాలకు పైగా నిలిచి ఉందని భావిస్తారు. భూగర్భ జలాల ప్రవాహం కారణంగా పునాదుల్లోని ఇసుక, మట్టి రేణువులు కొట్టుకుపోయి, అంతర్గత ఖాళీలు ఏర్పడే ప్రక్రియను ‘పైపింగ్ ఫినామినన్’గా పేర్కొంటారు. దీనివల్ల రామప్ప దేవాలయ పునాదుల స్థిరత్వానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని జీఎస్ఐ నివేదికకు సంబంధించిన అంశాలను మా ట్రస్టు ప్రస్తావించింది. రామప్ప సరస్సు, దేవాలయ ప్రాంతం గుండా పరస్పరం అనుసంధానమై విస్తరించిన భౌగోళిక చీలికల వెంట నీరు ప్రవహిస్తే, ఆలయ పునాదిగా ఉన్న పరిమిత ఇసుక పెట్టె నిర్మాణం బలహీనపడే ప్రమాదం ఉందన్నది మా ఆందోళన. రామప్ప దేవాలయంపై పేలుళ్ల ప్రత్యక్ష ప్రభావం ప్రస్తుతం తక్కువగానే కనిపిస్తున్నప్పటికీ, దీర్ఘకాలంలో పునరావృతమయ్యే ప్రకంపనలు ఆలయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదికలకు సంబంధించిన వివరాలు సూచిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రకంపనల వల్ల నిర్మాణంలో ‘ఫాటిగ్’ అనే బలహీనత లేదా అలసట ఏర్పడే ప్రమాదాన్ని పరిశీలించాలి. ఇప్పటికీ రామప్ప దేవాలయంలో నిర్మాణపరమైన సమస్యలు ఉన్నట్లు మా ట్రస్టు నివేదికలో ప్రస్తావించాం. రంగమండపంలోని భారీ నేల దూలాలకు పగుళ్లు, నిర్మాణంలో అసమాన కూర్చివేత వంటి అంశాలను గుర్తించాం. భూకంపాలు, భూగర్భ జలాల హెచ్చుతగ్గులు, భౌగోళిక చీలికలు వంటి అంశాలు నిర్మాణంపై ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్ గనిలో నిర్వహించే బ్లాస్టింగుల ప్రకంపనలు ఆలయ నిర్మాణంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పేలుళ్ల సమయంలో ఏర్పడే ప్రకంపనలు నేల ద్వారా వ్యాపించి పునాది, దూలాలు, రాతి నిర్మాణాలపై ఒత్తిడిని కలిగించవచ్చు. ఒక్కసారి వచ్చే ప్రకంపనల ప్రభావం కంటే, పదేపదే జరిగే పేలుళ్ల వల్ల ఏర్పడే ప్రకంపనల ప్రభావం కాలక్రమంలో తీవ్రతరం అయ్యే అవకాశాన్ని విస్మరించకూడదు. ఇప్పటికే నిర్మాణపరమైన మార్పులు కనిపిస్తున్న పురాతన ఆలయానికి ఇలాంటి అదనపు ప్రభావం ప్రమాదకరం. అందుకే రామప్ప ఆలయాన్ని కాపాడాలంటే ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగులను అనుమతించకూడదన్నది నా అభిప్రాయం. ఈ ప్రమాదాన్ని కేవలం తక్షణ ప్రకంపనల స్థాయితో కొలవలేం. ఆలయ నిర్మాణం, పునాది స్థిరత్వం, చారిత్రక వారసత్వ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.
ప్రమాదంలో గుర్తింపు, వారసత్వం
రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు సాధించడం వెనుక కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, భారత పురావస్తు సర్వేక్షణ శాఖ, తెలంగాణ వారసత్వ శాఖ, జిల్లా యంత్రాంగం దశాబ్దానికి పైగా చేసిన కృషి ఉంది. 2021 జూలై 25న ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. కాకతీయుల నిర్మాణ కళ, శిల్ప సంపద, ఇంజినీరింగ్ ప్రతిభకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన గుర్తింపు ఇది. ఇప్పుడు ఈ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఓపెన్‌కాస్ట్ తవ్వకాలు, బ్లాస్టింగుల వల్ల భూగర్భ చీలికలు క్రియాశీలమై, సరస్సు నీరు లీకై, కట్ట భద్రత దెబ్బతినే పరిస్థితి ఏర్పడితే ఆలయ పరిసరాలు తీవ్రంగా దెబ్బతినవచ్చు. పేలుళ్ల ప్రకంపనలతో ఆలయ నిర్మాణానికి నష్టం కలిగితే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దాని పరిరక్షణపై కూడా తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతాయి. రామప్పకు లభించిన యునెస్కో గుర్తింపును కాపాడాలంటే ఆలయాన్ని మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్న సహజ, భౌగోళిక పరిస్థితులు, సరస్సు భద్రతను కూడా పరిరక్షించాలి. బొగ్గు ఉత్పత్తి అవసరాల కోసం శతాబ్దాల చరిత్ర కలిగిన వారసత్వ సంపదను ప్రమాదంలోకి నెట్టడం సమంజసం కాదు. రామప్ప ఆలయం, సరస్సు కేవలం ఒక ప్రాంతానికి చెందిన ఆస్తులు కావు. అవి కాకతీయుల కళా వైభవానికి, తెలంగాణ చారిత్రక వారసత్వానికి, దేశ సాంస్కృతిక సంపదకు ప్రతీకలు. వాటి చుట్టూ ఉన్న భౌగోళిక పరిస్థితులు, నీటి వనరులు, పర్యావరణాన్ని కాపాడటం కూడా వారసత్వ పరిరక్షణలో భాగమే. ఓపెన్‌కాస్ట్ మైనింగ్ వల్ల జీవవైవిధ్యానికి తీవ్రమైన నష్టం కలిగే అవకాశం ఉంది. రామప్ప దేవాలయం, సరస్సు పరిసరాల్లో పర్యావరణ క్షీణతకు తోడు, భారీ మొత్తంలో ధూళి ఉత్పత్తి కావడం వల్ల వాయు కాలుష్యం, పర్యావరణ అసమతుల్యత ఏర్పడే ప్రమాదాన్ని కూడా పరిశీలించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు
సింగరేణి వెంకటాపూర్ వద్ద ఓపెన్‌కాస్ట్ గని ప్రారంభించేందుకు పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం కోరినప్పటి నుంచే తాము అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని పాండురంగారావు చెప్పారు. 2023 మార్చి 1న ములుగు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశం, 2023 మార్చి 28న కలెక్టర్ నుంచి వచ్చిన లేఖ, అదే ఏడాది ఏప్రిల్ 1న పంపిన లేఖ, 2024 డిసెంబరు 19న జరిగిన సమావేశం వంటి అంశాలను 2025 జనవరి 27న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డికి పంపిన లేఖలో వివరించామన్నారు. మంత్రి సీతక్కకు సైతం సమస్యను వివరించామని వెల్లడించారు. 2026 అక్టోబరు 3న సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్ కూడా లేఖ రాసి, గని ప్రతిపాదన ప్రభావాలను వివరించేందుకు వ్యక్తిగతంగా కలిసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. గని అనుమతుల ప్రస్తుత స్థితి, పాలంపేట ప్రత్యేక అభివృద్ధి సంస్థ నిరభ్యంతర ధ్రువపత్రం, పర్యావరణ అనుమతుల ప్రక్రియ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తీసుకున్న చర్యల వివరాలను సింగరేణి యాజమాన్యం స్పష్టంగా వెల్లడించాలన్నారు. నిట్ సూరత్కల్ అధ్యయన నివేదిక, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్వోసీ, జీఎస్ఐ అనుమతులకు సంబంధించిన పత్రాలు, వాటి పరిధి, పరిశీలించిన అంశాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. రామప్ప ఆలయం, సరస్సు భద్రతకు ముప్పు కలిగించే ఈ ప్రతిపాదనపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని, కాకతీయుల సాంస్కృతిక, కళా సంపదను కాపాడటమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉండాలన్నారు. భూగర్భ జలాల ప్రవాహం, రాతి పొరల నిర్మాణం, సరస్సు కట్ట స్థిరత్వం, ఆలయ సాండ్‌బాక్స్ పునాది, పేలుళ్ల ప్రకంపనల ప్రభావం, స్థానిక పర్యావరణం వంటి అంశాలపై స్వతంత్ర నిపుణులతో సమగ్ర అధ్యయనం జరిపించాలని ఆయన కోరారు.
సేవ్ రామప్ప.. సేవ్ వారసత్వ సంపద
రామప్ప ఆలయం, సరస్సు, వాటి చుట్టూ ఉన్న సహజ పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పాండురంగారావు అన్నారు. వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించాలంటే సింగరేణి ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ గని విషయంలో శాస్త్రీయ ఆధారాలు, పారదర్శకత, ముందుచూపుతో నిర్ణయం తీసుకోవాలన్నారు. గని ప్రతిపాదనను ఉపసంహరించుకుని రామప్ప పరిరక్షణకు అనుకూలమైన చర్యలు చేపట్టాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

