ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణబీజేపీ ఎమ్మెల్సీ రేసులో కొత్త ట్విస్ట్‌..!

బీజేపీ ఎమ్మెల్సీ రేసులో కొత్త ట్విస్ట్‌..!

📰 Generate e-Paper Clip

బీజేపీ ఎమ్మెల్సీ రేసులో కొత్త ట్విస్ట్‌..!
తెరపైకి బీసీ నేత సుందర్‌రాజ్‌ యాదవ్‌ పేరు
ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతల సంప్రదింపులు..?
అభ్యర్థిత్వంపై అధిష్టానం వద్ద చర్చ జరుగుతున్నట్లు ప్రచారం

స్పాట్‌ వాయిస్‌, వరంగల్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయం ఆసక్తికర మలుపు తిరుగుతోందా..? ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి కన్ఫామ్ కాగా.., బీఆర్ఎస్ నుంచి సైతం గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఏనుగుల రాకేశ్ రెడ్డిని బరిలో నిలుపుతున్నారనేది బహిరంగ రహస్యం. రెండు పార్టీలు రెడ్డి సామాజికవర్గానికే ఇవ్వగా.. బీజేపీ బీసీ నేత పేరు తెరపైకి తేవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఆ నేత మరెవరో కాదు.. బీసీ హక్కుల ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్‌ యాదవ్‌. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో సుందర్‌రాజ్‌ పేరు పరిశీలనకు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీజేపీ నాయకత్వం ఆయన అభ్యర్థిత్వంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో ఈసారి పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది..? బీసీ నేతకు టికెట్‌ దక్కుతుందా? అన్న ఉత్కంఠ మొదలైంది.
బీసీ ఉద్యమ నేపథ్యం..
సుందర్‌రాజ్‌ యాదవ్‌ కొన్నేళ్లుగా బీసీ హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు. బీసీ వర్గాల సమస్యలు, సామాజిక న్యాయం, హక్కులపై రాష్ట్రవ్యాప్తంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. ఆర్గనైజేషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు బీసీ సంఘాల నాయకుడిగా గుర్తింపు ఉంది. మరోవైపు విద్యాసంస్థలను నిర్వహిస్తుండటంతో విద్యారంగానికి చెందిన వర్గాలతోనూ పరిచయాలు ఉన్నాయి. గతంలో టీచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఈ నేపథ్యమే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పేరును పరిశీలనకు తెచ్చిందా? అన్న చర్చ సాగుతోంది.
బలంగా బీసీ వాదం..
రాష్ట్రంలో బీసీ నినాదం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ అంశం రాజకీయంగా కీలకంగా మారుతుందన్న చర్చ సాగుతోంది. బీసీ హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం ప్రధాన అజెండాగా ముందుకొస్తున్న తరుణంలో బీసీ నేత సుందర్‌రాజ్‌ యాదవ్‌కు అవకాశం కల్పిస్తే కలిసి వస్తుందనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ వర్గాల్లో ఆయనకు ఉన్న పరిచయాలు, హక్కుల కోసం సాగిస్తున్న ఉద్యమాలు, విద్యారంగంతో ఉన్న అనుబంధం పట్టభద్రుల ఎన్నికల్లో ఉపయోగపడవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీసీ ప్రాతినిధ్యంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆ వర్గానికి చెందిన నాయకుడిని బరిలోకి దించడం ద్వారా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చిన సంకేతాలు పంపవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్‌ జిల్లా బీజేపీ నేతలు సుందర్‌రాజ్‌ పేరును పరిశీలించాలని పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

వరంగల్‌ నేతల ప్రయత్నాలు ఫలించేనా?
ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బీజేపీ నాయకత్వం సుందర్‌రాజ్‌ యాదవ్‌ అభ్యర్థిత్వంపై సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన పేరును పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం రాజకీయ ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సంప్రదింపులు ఏ స్థాయిలో ఉన్నాయి? అభ్యర్థి ఎంపికలో సుందర్‌రాజ్‌ పేరు ఎంతవరకు పరిశీలనలో ఉంది? అన్న అంశాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక పార్టీ ఇతర రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి సుందర్‌రాజ్‌ యాదవ్‌ పేరు ముందుకు రావడంతో పార్టీ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular