అరకొర సమాచారం భయం పుట్టిస్తే.. వైద్యుల చికిత్స ఆశ నింపింది..
స్పాట్ వాయిస్, నర్సంపేట : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అస్వస్థతకు గురైన వెంటనే సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. అధికారిక సమాచారం రాకముందే కొందరు ఆయన మరణించినట్లు పోస్టులు పెట్టగా, మరికొన్ని మీడియా సంస్థలు కూడా ధృవీకరణ లేకుండానే అదే సమాచారాన్ని ప్రసారం చేశాయి. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
అయితే వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదట రోహిణి ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించిన వైద్యులు గుండె స్పందనను పునరుద్ధరించి, పరిస్థితిని స్థిరీకరించారు. అనంతరం గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగిస్తున్నారు.
వైద్యులు విడుదల చేసిన ఆరోగ్య బులెటిన్ ప్రకారం గుండె, కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండగా, రక్తపోటు నియంత్రణలో ఉంది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, రక్తపు గడ్డకు చికిత్స కొనసాగుతోంది. మెదడు పనితీరుపై ఇంకా పరిశీలన కొనసాగుతున్నప్పటికీ, కంటి, చేతి కదలికలు ఆశాజనకంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఈ ఘటన మరోసారి “ముందు సమాచారం… తర్వాత ప్రసారం” అనే జర్నలిజం ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి సమాచారాన్ని నిజమని నమ్మడం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం స్పష్టం చేసింది. ఒకరి ఆరోగ్యంపై నిర్ధారణ లేని వార్తలు ప్రచారం చేయడం కుటుంబ సభ్యులకు మానసిక వేదన కలిగించడమే కాకుండా, సమాజంలో గందరగోళానికి దారితీస్తుంది.ఈ సంఘటన మీడియా సంస్థలకు కూడా బాధ్యతను గుర్తు చేస్తోంది. వేగం కంటే విశ్వసనీయత ముఖ్యమనే విషయాన్ని విస్మరించవద్దు.

