పెళ్లి పేరుతో బళ్లారికి రప్పించి హత్య..
మృతదేహాన్ని ముక్కలుగా నరికిన నిందితుడు అరెస్ట్
స్పాట్ వాయిస్, హసన్‌పర్తి: హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసు దారుణ హత్యగా తేలింది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన వొద్దిరాజుల బసవరాజు(27)ను నిందితుడిగా గుర్తించి శుక్రవారం అరెస్ట్ చేశారు. హసన్పర్తికి చెందిన తౌటం స్వప్న(40) మే 15న అదృశ్యమైంది. ఆమె తండ్రి అమంచ రాజేందర్ ఫిర్యాదుతో మే 31న ఎస్సై బి.సుజిత్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా కేసు హత్యగా బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్వప్న, బసవరాజుకు మధ్య ఉన్న పరిచయం పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసే వరకు వెళ్లింది. పెళ్లి చేసుకోకపోతే తమ ఫొటోలు, వీడియోలు బయటపెడతానని ఆమె చెప్పడంతో పరువు పోతుందనే భయంతో బసవరాజు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
బళ్లారికి రప్పించి …
ఆమెను బళ్లారికి రప్పించి గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పీకపిసికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు రాత్రి మటన్ కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికి అడవిలో పడేసినట్లు వెల్లడించారు. రక్తపు మరకలున్న దుస్తులను పెట్రోల్‌తో తగులబెట్టి, స్వప్న ఫోన్‌ను చెరువులో పడేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అంబాల–కమలాపూర్ రోడ్డులో హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ ఎ.మహేందర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన బసవరాజును వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అతడి వద్ద నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని BNS 103, 238 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్సైలు సుజిత్, రవి, దేవేందర్, ఏఏఓ సల్మాన్‌పాషా, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

