స్పాట్ వాయిస్ ,భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. WGL ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో భూపాలపల్లితో పాటు హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆయన నివాసంలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో జయరాజ్‌కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు పలు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. సూర్యాపేట, తాండూరు సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

