– హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యం కావాలి
ఐక్యమత్యంతోనే ధర్మ రక్షణ సాధ్యం
-అతిథులుగా విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు
స్పాట్ వాయిస్, గణపురం:హిందూ ధర్మ పరిరక్షణ సమాజంలో ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా మండలంలోని చెల్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి ‘హిందూ ధర్మ సమ్మేళనం’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక హిందూ బంధువుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మేళనానికి భారీ సంఖ్యలో భక్తులు, యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి అభయ హిందూ వ్యవస్థాపకులు శ్రీమాన్ శ్రీరాధా మనోహర్ దాసు గారు, బాలమానస దేవి పీఠం వ్యవస్థాపకులు శ్రీ లక్ష్మీ నారాయణ గురు భవాని గారు హాజరై ప్రసంగించారు. నేటి సమాజంలో యువత పెడదోవ పట్టకుండా, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హిందూ దేశంగా గర్వంగా చెప్పుకునేందుకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని వారు పిలుపునిచ్చారు. ఆర్.ఎస్.ఎస్. ఉమ్మడి వరంగల్ జిల్లా జోన్ సెక్రటరీ డాక్టర్ గద్దె రమేష్ మాట్లాడుతూ.. దేశానికి మూలస్తంభం హిందూ ధర్మమని, హిందువులందరూ ఐక్యంగా ఉండాలన్న సంకల్పంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ధర్మాన్ని కాపాడుకోవడంలో గురువులు, సాధువుల పాత్ర కీలకమని, వారిని ఎన్నడూ మరువకూడదని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామగ్రామాన ఇలాంటి ధర్మ సమ్మేళనాలు నిర్వహించి, హిందూ సమాజాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, హిందూ బంధువులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


