ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeఎడిటోరియల్ఓట్లు బీసీలవి.. పీఠాలు వాళ్లకా...?

ఓట్లు బీసీలవి.. పీఠాలు వాళ్లకా…?

📰 Generate e-Paper Clip

బీసీలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం
జనరల్‌ అంటే అందరి కోసం..
వరంగల్‌ జనరల్‌ మేయర్‌ స్థానం బీసీలకే దక్కాలి
అక్టోబర్‌లో పరకాలలో బీసీల బహిరంగ సభ..
వడ్డేపల్లి నుంచి ప్రజా జీవితంలోకి..
తండ్రి మాటే జీవితానికి బాట
మాస్టర్‌జీకి కంప్యూటర్‌ సెంటర్‌తో బీజం
జయశంకర్‌ స్ఫూర్తితో విద్యా రంగంలోకి..
2001 నుంచే తెలంగాణ ఉద్యమ బాట
ప్లాన్‌ ఉంటే కుడాకు నిధుల వరద
వరంగల్‌కు విజన్‌ ఉన్న నాయకత్వం కావాలి
ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌

స్పాట్ వాయిస్, ప్రధానప్రతినిధి: ‘‘బీసీలకు స్కీంలు కాదు.. సీట్లు కావాలి. న్యాయం కావాలి. బీసీలు రాజకీయంగా ఉన్నతస్థాయికి రావాలి. జనరల్‌ సీట్లు అన్నికులాల వారికి పోటీ చేసే అవకాశం ఉన్నా.. అవి కేవలం ఒక వర్గానికే అన్న భావన ఎందుకు ఏర్పడింది? ఈ పరిస్థితి మారాలి. నోట్లు వాళ్లవి.. ఓట్లు మావి.. ఇక ఓబీసీల ఓట్లు కొనుడు బంద్‌. మా సీట్లు మాకు కావాలి’’ అని ఓబీసీ ప్రెసిడెంట్, మాజీ కుడా చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పనతో పాటు వరంగల్‌ అభివృద్ధి, కుడా భవిష్యత్‌ ప్రణాళికలు, తన రాజకీయ ప్రయాణం, తెలంగాణ ఉద్యమ అనుభవాలను ఆయన డిజిటల్‌ మీడియా ప్రతినిధుల చిట్‌చాట్‌లో పంచుకున్నారు.

నేనొక్కడినే రాజకీయం వైపు..
1970 జనవరి 1న వడ్డేపల్లిలో సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌ జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీరాజం-వరలక్ష్మీ దంపతులు. పది మంది సంతానంలో తాను చివరివాడినని చెప్పారు. తండ్రి ఎక్సైజ్‌ శాఖలో పనిచేసేవారని, చదువంటే ఆయనకు ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబంలోని అందరితో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయించారని, ఆడపిల్లలను స్కూల్‌కు పంపించకూడదనే పరిస్థితులు ఉన్న కాలంలోనే తన రెండో అక్కను సివిల్స్‌ రాయించారని గుర్తుచేశారు. వడ్డేపల్లిలో పేద విద్యార్థులకు తన తండ్రి ఆర్థిక సాయం చేసేవారని చెప్పారు. స్వాతంత్య్రానికి పూర్వం తన తండ్రి లాహోర్‌లో ఉండేవారని, ఆయన చదువంతా అక్కడే పూర్తయిందని తెలిపారు. తమ కుటుంబం నుంచి చిన్నాన్న మాచర్ల సత్యనారాయణ రాజకీయాల్లో ఎదిగారని, 1983లో టీడీపీ హన్మకొండ అభ్యర్థిగా హయగ్రీవాచారిపై పోటీ చేసి విజయం సాధించి మంత్రి అయ్యారని చెప్పారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో తాను జెండాలు పట్టుకొని తిరిగేవాడినని, అప్పుడే రాజకీయాలపై ఆసక్తి మొదలైందన్నారు. అన్నలు, అక్కల్లో తానే రాజకీయాల వైపు వచ్చానన్నారు.

‘వాడు నా తమ్ముడు.. గెలవడం నా ధర్మం’
తన తండ్రి, హయగ్రీవాచారిలు మంచి మిత్రులని సుందర్‌రాజ్‌ యాదవ్‌ చెప్పారు. తన చిన్నాన్న పోటీ నుంచి తప్పుకునేలా చెప్పాలని హయగ్రీవాచారి తన తండ్రి వద్దకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేశారు. ‘‘మీరు నాకు మంచి మిత్రులు. కానీ వాడు నా తమ్ముడు. మీరు ఓడిపోవద్దని కోరుకుంటాను. కానీ తమ్ముడిగా వాడు గెలవాలని నా ధర్మంగా నేను పోరాటం చేస్తాను’’ అని తన తండ్రి చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని తెలిపారు. ఎంత కష్టం వచ్చినా నిజాయితీగా ఉండటం మంచిదని తన తండ్రి ఎన్నోసార్లు చెప్పేవారని, అదే తనను ఇప్పటికీ ముందుకు నడిపిస్తోందన్నారు.

రూ.10 వేల ఫీజు కట్టలేక..
పదో తరగతి వరకు ఎల్‌బీహెచ్‌ఎస్‌, శరత్‌ స్కూల్లో చదివానని, ఎంసెట్‌ కోచింగ్‌ తీసుకున్నానని తెలిపారు. అయితే రూ.10 వేల ఫీజు కట్టలేక హైదరాబాద్‌లో డిగ్రీలో చేరానన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశానని, కేయూలో ఎంబీఏ, పీహెచ్‌డీ చేశానని చెప్పారు. డిగ్రీ పూర్తయిన తర్వాత పార్ట్‌టైం ఉద్యోగం చేశానని, బీసీఐటీ కంప్యూటర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మేనేజర్‌గా పనిచేశానని తెలిపారు. 1991లో తన మొదటి జీతం రూ.1,200 అని చెప్పారు. అప్పట్లో కంప్యూటర్‌ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉండేదని, ఆ సంస్థలో 1,200 మంది విద్యార్థులు ఉండేవారని గుర్తుచేశారు. యాజమాన్యంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఎంసీఐటీ ఇన్‌స్టిట్యూట్‌కు బీజం పడిందన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు కోసం తన తండ్రి భీమారంలోని ఇల్లు అమ్మి రూ.1.50 లక్షలు ఇచ్చారని చెప్పారు.

‘మాస్టర్‌జీ’కి అక్కడే బీజం
1992లో ట్రైనింగ్‌ సెంటర్‌తో మాస్టర్‌జీ ఇన్‌స్టిట్యూట్స్‌కు బీజం పడిందని సుందర్‌రాజ్‌ యాదవ్‌ చెప్పారు. కంప్యూటర్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న సమయంలో డిగ్రీ కాలేజీ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు. తన తండ్రికి మిత్రుడైన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌తో మాట్లాడిన తర్వాత ఆయన ‘గో హెడ్‌’ అని ప్రోత్సహించారని తెలిపారు. అంతేకాక పీజీ కాలేజీ ప్రారంభించాలని సూచించారన్నారు. ‘‘నాకు అప్పటికీ పీజీ లేదు’’ అని చెప్పగా.. ‘‘నువ్వు క్లాసులు చెప్పొద్దు. మేనేజ్‌మెంట్‌ వైపు ఉండు’’ అని జయశంకర్‌ సార్‌ సూచించారని తెలిపారు. ఆయన సూచనతో 1996–97లో పీజీ కాలేజీ ప్రారంభించానన్నారు. 2006లో ఎంబీఏ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కేయూలో ఎంబీఏలో చేరి కోర్సు పూర్తి చేసిన తర్వాత కాలేజీ ఏర్పాటు చేశానని చెప్పారు.

2001 నుంచే తెలంగాణ ఉద్యమంలో..
2001 నుంచే తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని సుందర్‌రాజ్‌ యాదవ్‌ తెలిపారు. తొలినాళ్లలో వెనుక ఉండి సహకరించేవాడినని, 2009 నుంచి తెలంగాణ ఉద్యమకారుల సమావేశాలకు మాస్టర్‌జీ వేదికగా మారిందన్నారు. పోలీసులు బెదిరింపులకు పాల్పడినా వెనక్కి తగ్గలేదన్నారు. ‘‘మీ కాలేజీ వేదికగానే ఆలోచనలు సాగుతున్నాయి. కేసులు పెడతాం’’ అని బెదిరించినా భయపడలేదని చెప్పారు. అప్పట్లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు సమావేశాలకు వస్తుండడంతో వారితో పరిచయం ఏర్పడిందన్నారు. ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నానని, కాలేజీలతో సంఘం ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించానని చెప్పారు. అదాలత్‌ సెంటర్‌లో జరిగే నిరసనల్లో విద్యార్థులు అంటే సుందర్‌రాజ్‌ యాదవ్‌ అనే స్థాయికి వచ్చిందన్నారు. 2014లో 1,100 డిగ్రీ కాలేజీలను ఏకం చేశానని తెలిపారు.

అవకాశాలు చేజారాయి
2015లో బీఆర్‌ఎస్‌ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్‌ అడిగానని, అప్పట్లో కేసీఆర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అవకాశం ఇవ్వడంతో ఆయన గెలుపు కోసం పనిచేశానని చెప్పారు. 2021లో మళ్లీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ముందుగానే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కలిసి అడిగానని, ఆయన పోటీ చేయనని చెప్పడంతో తాను ప్రచారంలోకి దిగానన్నారు. ‘‘నేను ప్రచారంలో మునిగిపోయిన సమయంలో మళ్లీ పల్లా లైన్లో ఉంటాడని, అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిందని తెలిసింది. కేటీఆర్‌ కుడా చైర్మన్‌ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గాను. తర్వాత మేయర్‌ పదవి ఇస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వచ్చేలోపు సీటు మళ్లీ మారింది. 2023లో టీచర్స్‌ ఎమ్మెల్సీ ఇవ్వమని అడిగినా సైలెంట్‌గా ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.

కుడాలో డెవలప్ మెంట్ ఛాన్స్..
కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఎంతో అవకాశం ఉందని సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచనతో తన హయాంలో పనిచేశానన్నారు. అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌కు తన ఆలోచనలను పేపర్‌ రూపంలో ఇచ్చానని తెలిపారు. నగరానికి బయట అపార్ట్‌మెంట్లు నిర్మించి రూ.30 లక్షల లోపే విక్రయిస్తే మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు అందడంతో పాటు నగరం విస్తరించేందుకు అవకాశం ఉంటుందని సూచించానన్నారు. ప్రైవేట్‌ లెక్చరర్లతో వినతిపత్రాలు ఇప్పించానని, కుడా పరిధిలో ప్రైవేట్‌ ల్యాండ్స్‌ను డెవలప్‌ చేసే ప్రణాళిక కూడా రూపొందించానని చెప్పారు. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వివరాలను ప్రిన్సిపల్‌ సెక్రటరీకి వివరించానన్నారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి కుడా పరిధిలోని ప్రభుత్వ స్థలాలను సైతం కుడాకు అప్పగించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.

ప్లాన్‌ ఉంటే నిధుల వరద..
కుడా నుంచి సరైన ప్రణాళిక రూపొందిస్తే ఒక్క పశ్చిమ నియోజకవర్గానికే రూ.500 కోట్ల ఆదాయం సమకూర్చే అవకాశం ఉందని సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. కుడా ద్వారా జనరేట్‌ అయ్యే నిధుల్లో 75 శాతం స్థానికంగానే ఖర్చు చేయాలనే నిబంధన ఉందని తెలిపారు. తన హయాం వరకు కుడా పరిధిలో 5 లక్షల ఎకరాల భూమి మార్టిగేజ్‌ అయి ఉందని, దానికి 15 శాతం మార్టిగేజ్‌ చార్జీ కుడాకు చెల్లించాల్సి ఉన్నా వసూలు చేయడం లేదని ఆరోపించారు. వాటిని వసూలు చేస్తే కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, తాను అనేక మందికి నోటీసులు ఇచ్చానని చెప్పారు. అనంతరం ఆ అంశం నిర్లక్ష్యానికి గురైందన్నారు.

ఐటీ రంగంతో ఉపాధి కల్పనే లక్ష్యం
వరంగల్‌లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీ సెక్టార్‌ను తీసుకురావాలనే ఆలోచనతో పనిచేశానని తెలిపారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ అనే స్థాయికి తీసుకెళ్లాలని భావించానన్నారు. అమెరికా పర్యటనలో 13 కంపెనీలతో మాట్లాడి వరంగల్‌లో సంస్థలు ప్రారంభించేందుకు ఒప్పించానని చెప్పారు. అయితే మడికొండలో ఐటీ సెక్టార్‌కు కేటాయించిన స్థలం అనుకూలంగా లేదని, చుట్టూ ఇండస్ట్రియల్‌ ఏరియా ఉండటంతో ఆశించిన స్థాయిలో గ్రోత్‌ రావడం లేదన్నారు. నగర కేంద్రంలోని ప్రభుత్వ స్థలాల్లో టవర్లు నిర్మించి ఐటీ కంపెనీలకు కేటాయిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేదని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం వరంగల్‌ యువత హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.

విజన్‌ ఉన్న నాయకత్వం కావాలి
వరంగల్‌ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అవకాశాలున్న ప్రాంతమని సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. ‘‘విజన్‌ ఉన్న నాయకుడు కావాలి. ఆలోచనతో పాటు దాన్ని ఆచరణలో పెట్టే నాయకుడు కావాలి’’ అని అన్నారు. దేవునూరు గుట్టల్లోని 5 వేల ఎకరాల్లో టూరిజం డెవలప్‌మెంట్‌ కోసం ప్రణాళిక రూపొందించామని, డిస్నీల్యాండ్‌ తరహా ప్రాజెక్టును తీసుకురావాలనుకున్నామని తెలిపారు. ఇందుకోసం 500 ఎకరాలు కుడా కూడా ఇస్తామని లేఖ ఇచ్చిందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ లాజిస్టిక్‌ హబ్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉందన్నారు.

ఓబీసీ అజెండా.. సీట్లే ప్రధాన డిమాండ్‌
‘‘మనవాళ్లకు మనం ఏమైనా చేయాలి’’ అనే ఆలోచనతో ఓబీసీ ( ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్) స్వచ్ఛంద సంస్థను ప్రారంభించామని సుందర్‌రాజ్‌ యాదవ్‌ తెలిపారు. బీసీలకు ఆత్మాభిమానం ఎక్కువని, అయినా రాజకీయంగా ఇంకా వెనుకబడి ఉన్నారని అన్నారు. బీసీ భావజాల వ్యాప్తికి ఓబీసీ ప్రెసిడెంట్ గా నేను, వైస్ జనరల్ సెక్రటరీగా గడ్డం భాస్కర్ కృషి చేస్తున్నామన్నారు. ‘‘బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ నినాదం ప్రతి ఇంటి నుంచి మొదలుకావాలి. 1983లో ఎన్టీఆర్‌ హయాంలో బీసీలకు కొంత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం’’ అని చెప్పారు. బీసీలకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అక్టోబర్‌ 9న మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సహకారంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. బీసీలకు ఉద్యోగాలు కల్పించే ప్రతి అవకాశాన్ని వెతికి పట్టుకుంటున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నాం.

‘జనరల్‌ అంటే వారికే ఎందుకు?’
‘‘రాజకీయంగా ఓ వింత నడుస్తోంది. రిజర్వేషన్‌ స్థానాలు తప్ప.. జనరల్‌ అంటే కేవలం రెడ్లకే అనే ఆలోచన అందరిలో నాటుకుపోయింది. జనరల్‌ అంటే అన్నికులాల నుంచి పోటీ చేయవచ్చు. కానీ కేవలం రెడ్లకే పరిమితం చేసినట్లుగా మారింది. ఇక ఊరుకునేది లేదు. మా సీట్లు మాకు కావాలి’’ అని సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. ‘‘నోట్లు వాళ్లవి.. ఓట్లు మావి.. ఇంకా కొనుడు బంద్‌. మా సీట్లలో మేమే పోటీ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. 42 శాతం బీసీలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. పార్టీలో సగం స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కబ్జాల నుంచి వెంటనే బయటకు రావాలని కోరారు.

ఓసీలు శత్రువులు కాదు..
ఓసీలు తమకు శత్రువులు కాదని సుందర్‌రాజ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. అయితే ఓబీసీల స్థానాలను కబ్జా చేయవద్దని కోరారు. బీసీలు రూ.1.50 లక్షల ఆదాయం లోపు ఉంటే పేదలు.. మరి ఓసీలు రూ.8 లక్షల ఆదాయం లోపు ఉంటే పేదలా? ఇంత వేరియేషన్‌ ఎందుకు?’’ అని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌పై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ‘‘10 శాతం రిజర్వేషన్‌తో బీసీల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. ఈడబ్ల్యూఎస్‌పై పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలి. 10 శాతం ఉన్నవారు 10 శాతం ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు’’ అని అన్నారు.

‘బీసీలకు సోయి రావాలి’
ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు తెలియాలని, బీసీలకు సోయి రావాలని సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ బీసీ వాదం కోసం ఉద్యమించాలని, అప్పుడే మార్పు వస్తుందని పేర్కొన్నారు. ‘‘బీసీ వాదం బలపడితే డబ్బులు లేకుండానే అభ్యర్థులు గెలుస్తారు. బీసీలకు స్కీంలు కాదు.. సీట్లు కావాలి.. న్యాయం కావాలి. మేం రూలింగ్‌లో ఉంటే మాకేది కావాలో అది చేసుకుంటాం’’ అని అన్నారు. ఓబీసీలను ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీసీలు ఉన్నతస్థాయికి రాకుండా చూస్తున్నారని అన్నారు. చాలా మంది బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉద్యమం చేస్తున్నారని, అవకాశం వచ్చినప్పుడు అందరూ ఏకమవుతారని చెప్పారు.

అక్టోబర్‌లో పరకాలలో బీసీ సభ
అక్టోబర్‌లో పరకాలలో బీసీల బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సుందర్‌రాజ్‌ యాదవ్‌ తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 8 స్థానాల్లో సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అన్ని పార్టీల్లోని బీసీలను కలుపుకుపోతామని, బీసీలు ఏ పార్టీలోనూ సంతృప్తిగా లేరని అన్నారు. ‘‘ఇప్పుడు దేశం మొత్తం బీసీల వైపు చూస్తోంది. ఉద్యమం అయితే మొదలైంది. బీసీలంతా ఏకమైతే ఆగమవుతామనే ఆలోచనతోనే ఇప్పుడిప్పుడు పార్టీలు బీసీలకు గుర్తింపు ఇస్తున్నాయి. అయితే అడపాదడపా ఇచ్చే గుర్తింపు కాదు.. మేమెంతో మాకంతా అన్నట్లుగా ఉండాలి’’ అని అన్నారు.

‘మాకు 50 శాతం రిజర్వేషన్‌ కావాలి’
బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ కావాలని సుందర్‌రాజ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘మీకో రూల్‌.. మాకో రూలా? బీసీలు లేకుండా పార్టీలు నడుస్తాయా? బీసీల ఓట్లు కావాలి కానీ వారికి సీట్లు ఇవ్వరా? ఇదెక్కడి న్యాయం? పార్టీలన్నీ ప్రో బీసీనా.. యాంటీ బీసీనా ముందే చెప్పాలి. ఎన్నికల వరకు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట ఉండొద్దు’’ అని అన్నారు.

వరంగల్‌ మేయర్‌ పీఠంపై బీసీల గురి
వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీసీల సత్తా చాటేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందిస్తున్నామని సుందర్‌రాజ్‌ యాదవ్‌ తెలిపారు. ‘‘ప్రస్తుతం మేయర్‌ జనరల్‌ స్థానమైంది అనగానే మేయర్‌ ఆ రెడ్డి.. ఈ రెడ్డి అనే చర్చ జరుగుతోంది. మరి బీసీలు లేరా? మన బీసీ నుంచి ఫలానా వ్యక్తి.. ఫలానా లీడర్‌ ఉన్నాడని ఎవరూ ఎందుకు చెప్పడం లేదు? జనరల్‌ అంటే వారికే అన్నట్లుగా ఎందుకు మారిపోయింది?’’ అని ప్రశ్నించారు. ‘‘ఈ పరిస్థితి మారాలి. ఈసారి జనరల్‌ మేయర్‌ స్థానం బీసీలకే దక్కాలి. ఓటర్లు ఆలోచన చేయాలి. ఓట్లు మన దగ్గర ఉంటే పక్కవాడికి కుర్చీ కట్టబెట్టడం ఏంటి? ప్రస్తుతం బీసీల పరిస్థితి దున్నపోతుకు గడ్డి వేసి.. ఆవుకు పాలు పితుకుతున్నట్లుగా ఉంది. ఈ పరిస్థితి మారాలి. ఎవరికి వారు ఓ బీసీగా ఆలోచన చేయాలి’’ అని సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular