* నీట్ విద్యార్థి ఆత్మహత్య
* తల్లిదండ్రుల హృదయాలను కలిచి వేస్తున్న ఘటన
* విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిపై మరో సారి చర్చ
స్పాట్ వాయిస్, డెస్క్ : తమ బిడ్డ డాక్టర్ కావాలని కన్న తల్లిదండ్రుల కల.. ఆ యువకుడి మనసుపై తీవ్ర ఒత్తిడిగా మారింది. నీట్ పరీక్షకు సిద్ధమవుతూ భవిష్యత్తుపై ఆందోళనకు గురైన 19 ఏళ్ల యువకుడు చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులను ఓదార్చుతూ, ‘‘మరో జన్మలోనైనా డాక్టర్ ను అవుతా..’ అని సూసైడ్ నోట్ రాయడం ఈ విషాద ఘటన పలువురిని ఆలోచించేలా చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఖండాలాకు చెందిన 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే నీట్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వైద్య విద్యలో సీటు సాధించి డాక్టర్ కావాలన్న లక్ష్యంతో చదువుతున్న అతడు.. చదువు, పరీక్ష, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సూరజ్.. మేడపై ఉన్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కుమారుడు ఉరికి వేలాడుతూ కనిపించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తల్లిదండ్రులకు చివరి మాటలు..
చనిపోయే ముందు సూరజ్ రాసిన సూసైడ్ నోట్ తల్లిదండ్రుల హృదయాలను కలచివేసింది. “సారీ అమ్మా, నాన్నా.. వచ్చే జన్మలో నేను తప్పకుండా మీ కోసం డాక్టర్ అవుతా. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సంతోషంగా ఉండండి” అని అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక పరీక్షలో విజయం సాధించలేకపోవడం జీవితానికి ముగింపు కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులపై తల్లిదండ్రులు, సమాజం నుంచి వచ్చే అంచనాలు తీవ్ర ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని సూచిస్తున్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని గుర్తించి, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల నీట్ పరీక్షకు సంబంధించిన వివాదాలు, పరీక్ష రద్దు, రీటెస్ట్ వంటి పరిణామాలు కూడా విద్యార్థుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో యువ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం కలచివేస్తోంది.


