కేటీఆర్ కొందరివాడేనా..?
బీఆర్ఎస్ పార్టీకి కొంతమంది జర్నలిస్టులే అవసరమా..?
గ్రేటర్ వరంగల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వర్గీకరణ..!
పెద్ద, మధ్య, చిన్న పేపర్లుగా తారతామ్యాల సృష్టి
తాబేదార్లు చెప్పినట్లే నడుచుకుంటున్న పీఆర్వోలు, లీడర్లు
పబ్లిక్ లీడర్ చిట్‌చాట్‌ను సైతం ప్రైవేటు ప్రోగ్రాంలా నిర్వహణ
నిజాలు రాసేటోళ్ల కన్నా.. తాబేదార్లే ముఖ్యమా..?
స్ట్రీం ముసుగులో జోకొడుతున్నదెవరు..?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటనపై కొంతమందికే సమాచారం
చిట్‌చాట్‌కు సైతం వారికే ఆహ్వానం..ఇలా అయితే ఎలా సారూ..?
అర్థం చేసుకోకుంటే ఆగమవడం గ్యారంటీ అంటూ మీడియా వర్గాల్లో చర్చ
స్పాట్ వాయిస్, బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరంగల్ పర్యటనలో మీడియాపై పార్టీ నిర్వాహకులు అనుసరించిన విధానంపై గ్రేటర్ వరంగల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటనపై..చిట్‌చాట్ నిర్వహణపై కొంతమందికే సమాచారం ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ ఉమ్మడి జిల్లా నాయకత్వం అనుసరించిన తీరుపై స్థానిక జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేవలం కొద్దిమందికే పార్టీ కార్యక్రమాలను పరిమితం చేస్తూ, నాయకులు అనుసరిస్తున్న ఏకపక్ష ధోరణిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలు కేటీఆర్ కేవలం కొందరివాడేనా, లేక బీఆర్ఎస్ పార్టీకి కేవలం కొంతమంది ఎంపిక చేసిన జర్నలిస్టులు మాత్రమే అవసరమా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వర్గీకరణ పేరుతో తారతమ్యాలు
గ్రేటర్ వరంగల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కావాలనే కొందరు వ్యక్తులు వర్గీకరణకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద, మధ్య, చిన్న పేపర్లు అంటూ పత్రికల మధ్య తారతమ్యాలు సృష్టిస్తూ వివక్ష చూపుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల గొంతుకగా నిలిచి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నిజమైన జర్నలిస్టులను కావాలనే పక్కన పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కేవలం కొందరి స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ తరహా పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారని, ఇది పార్టీకి ఏమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన పార్టీ నేతలు, ఇలా ఒక వర్గానికి వత్తాసు పలకడం దారుణమని మండిపడుతున్నారు.
తాబేదార్ల కనుసన్నల్లోనే పీఆర్వోలు, లీడర్లు
నాయకుల చుట్టూ చేరిన కొందరు తాబేదార్లు ఆడించినట్లే పీఆర్వోలు, పార్టీ లీడర్లు గుడ్డిగా నడుచుకుంటున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ప్రతినిధులుగా, బాధ్యత గల పబ్లిక్ లీడర్లుగా ఉండాల్సిన వారు నిర్వహించే చిట్చాట్లను సైతం కొద్దిమందికి మాత్రమే పరిమితం చేసి ఏదో ప్రైవేటు ప్రోగ్రాంలా నిర్వహిస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి వాస్తవాలు రాసే నిజమైన జర్నలిస్టులను విస్మరించి, కేవలం తమకు అనుకూలంగా వ్యవహరిస్తారనుకునే వాళ్లకే లీడర్లు పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి సంస్కృతి వల్ల పార్టీకి మైలేజ్ రాకపోగా, క్షేత్రస్థాయిలో తీవ్రమైన నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
…స్ట్రీమ్ ముసుగులో లబ్ధి పొందుతున్నదెవరు..?
… స్ట్రీమ్ ముసుగులో కొందరు జర్నలిస్టులు, వ్యక్తులు పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టిస్తూ తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. స్వార్థపరులను నెత్తికెత్తుకుని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు. అందరినీ సమానంగా ఆదరించాల్సిన నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులను ఇలా వర్గాలుగా విడదీసి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సమాచారాన్ని కొద్దిమందికే పరిమితం చేయడం, చిట్‌చాట్‌ల పేరుతో గోప్యంగా వ్యవహరించడం లాంటి చర్యలు పార్టీ పరువును బజారుకీడ్చుతున్నాయని హితవు పలుకుతున్నారు. ఇప్పటికైనా పార్టీ నేతలు తమ పద్ధతులు మార్చుకోకపోతే, మీడియా వ్యతిరేకులుగా సంబంధిత లీడర్లకు చెడ్డపేరును సొంత చేసుకోక తప్పదని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికీ వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోకుంటే పూర్తిగా ఆగమవడం ఖాయమంటూ మీడియా వర్గాల్లో తీవ్రమైన హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

