పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణం
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ముదిరాజ్ సమాజం హర్షం
బ్యూరో, స్పాట్ వాయిస్: తెలంగాణ ప్రజా వీరుడు పండుగ సాయన్న 174వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించడం ముదిరాజ్ సమాజానికి గర్వకారణమని తెలంగాణ ముదిరాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు.
పండుగ సాయన్న చేసిన పోరాటాలు, ప్రజాసేవ, ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని దారం యువరాజ్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. జయంతి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పండుగ సాయన్న జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేసిన మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

22న రవీంద్రభారతిలో
ఈ నెల 22న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న పండుగ సాయన్న 174వ జయంతి కార్యక్రమానికి ముదిరాజ్ సమాజం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని దారం యువరాజ్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న జయంతి వేడుకల్లో ముదిరాజ్ సోదరులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పండుగ సాయన్న ఆశయాలను, పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆయన చేసిన సేవలను సమాజం చిరకాలం స్మరించుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దారం యువరాజ్ ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు.
