ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్పరీక్షా కేంద్రంలో విద్యార్థిని అస్వస్థత..

పరీక్షా కేంద్రంలో విద్యార్థిని అస్వస్థత..

📰 Generate e-Paper Clip

పరీక్షా కేంద్రంలో విద్యార్థిని అస్వస్థత

సొంత వాహనంలో ఆసుపత్రికి పంపిన కలెక్టర్

​స్పాట్ వాయిస్, గణపురం: పదో తరగతి పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని అస్వస్థతకు గురికాగా, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తక్షణమే స్పందించి తన ఉదారతను చాటుకున్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థిని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర నీరసంతో ఉండటాన్ని కలెక్టర్ గమనించారు. ​పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన వ్యక్తిగత సిబ్బందిని తోడుగా ఇచ్చి తన అధికారిక వాహనంలోనే బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అనంతరం పరీక్షా కేంద్రం తనిఖీ ముగించుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్, వైద్యులతో మాట్లాడి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికకు ధైర్యం చెప్పి, ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి తన వాహనంలోనే పరీక్షా కేంద్రానికి పంపించి ఆమె పరీక్ష రాసేలా చొరవ చూపారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించిన కలెక్టర్ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular