వైఎస్సార్ హయాంలో ఆశ్రయం..
నేడు అదే కాంగ్రెస్ సర్కార్ లో కాలనీని ఖాళీ చేయించే యత్నం
20 ఏళ్ల బతుకులను బుల్డోజర్ భయంతో చిదిమేస్తున్న వైనం
తెర వెనుక మాజీ కార్పొరేటర్.. అధికార పార్టీ నేతల అండతో చక్రం..?
అధికారులకు కనిపించని పేదల కన్నీళ్లు..
100కు ఫోన్ చేసినా స్పందన కరువు..
మేం ఓటు వేశాం కాదా.. ఆదుకోరా అంటూ ప్రశ్న..నాడు వైఎస్సార్ హయాంలో పేదలకు ఆశ్రయంగా ఏర్పడిన వైఎస్సార్ నగర్.. నేడు అదే కాంగ్రెస్ పాలనలో వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. రెండు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని జీవిస్తున్న నిరుపేద కుటుంబాల ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు స్థలమంటూ యజమానులు లేని సమయంలో గుడిసెలను కూల్చివేస్తుండటంతో పేదలు బిక్కుబిక్కుమంటున్నారు. అడ్డుకుంటే బెదిరింపులు.. 100కు ఫోన్ చేసినా స్పందన లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసు కమిషనర్ వరకు వెళ్లినా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొందరిని మరోచోటికి తరలించి స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఓ మాజీ కార్పొరేటర్ ఉండి చక్రం తిప్పుతున్నారని, అధికార పార్టీ నేతల అండ ఉందని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థలం ప్రభుత్వానిదా.. ప్రైవేటుదా అన్నది తేల్చకుండా తమ గుడిసెలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినా పరిష్కారం లేకపోవడంతో తమకు న్యాయం చేసి నివాసాలను కాపాడాలని వేడుకుంటున్నారు.
-స్పాట్ వాయిస్, కాజీపేట
==========
ఆనాడు పేదలకు నిలువ నీడ కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటైన కాలనీ.. నేడు అదే పేదలకు నిలువ నీడ లేకుండా చేసే ప్రయత్నాలకు వేదికగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గుడిసెలతో మొదలైన వైఎస్సార్ నగర్ ప్రస్థానం.. రెండు దశాబ్దాల తర్వాత వివాదాల్లో చిక్కుకుంది. అప్పట్లో ఆశ్రయంగా నిలిచిన ఆ స్థలాన్ని ఇప్పుడు ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యజమానులు అందుబాటులో లేని సమయంలో గుడిసెలను కూల్చివేస్తున్నారని, అడ్డుకుంటే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. 100కు ఫోన్ చేసినా స్పందన లేదని, పోలీసులను ఆశ్రయించినా రక్షణ లభించడం లేదని వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొందరిని మరో ప్రాంతానికి తరలించి స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఓ మాజీ కార్పొరేటర్ కీలకంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతోనే చక్రం తిప్పుతున్నారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాడు పేదలకు ఆశ్రయం కల్పించిన నాయకులే నేడు తమ గుడిసెల తొలగింపుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
వైఎస్సార్ హయాంలో మొదలైన కాలనీ ప్రస్థానం
కాజీపేట పట్టణానికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో సుమారు 25 ఏళ్ల క్రితం నిరుపేదలు గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నారు. ఖాళీ స్థలంగా ఉండడంతో పేదలు అక్కడ గుడిసెలు వేసుకోగా.. ఆ ప్రాంతానికి వైఎస్సార్ నగర్‌గా పేరు పెట్టారు. అప్పటి నుంచి నేటి వరకు వంద కుటుంబాలకు పైగా అక్కడే జీవనం సాగిస్తున్నాయి. కాలనీవాసులకు ఓటు హక్కు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిస్తూ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసిందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఆ స్థలానికి డిమాండ్ పెరగడంతో పేదలను ఖాళీ చేయించి స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న తమకు ఇప్పుడు వెళ్లిపోవాలని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
గుడిసెలు కూల్చే వారెవరు?
వైఎస్సార్ నగర్లో గుడిసెల యజమానులు అందుబాటులో లేని సమయంలో కొందరు వ్యక్తులు కూలీలను తీసుకొచ్చి ఇళ్లను కూల్చివేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఎవరి అనుమతితో గుడిసెలు తొలగిస్తున్నారని ప్రశ్నిస్తే.. స్థల యజమాని చెప్పడంతోనే కూల్చివేస్తున్నామని కూలీలు సమాధానం ఇస్తున్నట్లు చెబుతున్నారు. అడ్డుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, పోలీసులను పిలుచుకోండంటూ బదులిస్తున్నారని వాపోతున్నారు. తమ గుడిసెలను కూల్చే అధికారం మీకెవరిచ్చారని నిలదీసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 100కు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. స్థలం ప్రైవేటుదైతే యజమాని స్వయంగా వచ్చి నోటీసులు ఇచ్చి మాట్లాడాలి కానీ, గుడిసెల యజమానులు లేని సమయంలో కూల్చివేతలకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
అధికారుల పట్టింపు ఏదీ?
తమ నివాసాలపై కూల్చివేతలు జరుగుతున్నాయని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినా కనీస స్పందన లేదని గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థల యజమాని ఖాళీ చేయించేందుకు ఆదేశాలు తెచ్చుకున్నారని పోలీసులు చెప్పినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఆ ఆదేశాలేమిటి? వాటి ఆధారంగా ఎవరికి, ఏ మేరకు కూల్చివేతలు చేపట్టే అధికారం ఉంది? అనే అంశాలపై తమకు స్పష్టత ఇవ్వడం లేదని అంటున్నారు. స్థలం ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా? అన్నది తేల్చకుండా పేదల గుడిసెలు తొలగించే ప్రయత్నాలు ఎలా చేస్తారని నిలదీస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలోనూ తమకు అక్కడే ఇళ్లు నిర్మించుకునే అవకాశం కల్పించాలని వినతిపత్రం అందించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల గోడు వినాల్సిన అధికారులు మౌనంగా ఉండటంతో తమకు న్యాయం చేసేవారే కరువయ్యారని వాపోతున్నారు.

తెర వెనుక మాజీ కార్పొరేటర్..?
వైఎస్సార్ నగర్ గుడిసెల తొలగింపు వ్యవహారం వెనుక ఓ మాజీ కార్పొరేటర్ కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆయన తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారని, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతోనే పేదలను ఖాళీ చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం తమ గుడిసెల్లో అడుగడుగునా తిరిగిన నాయకులు.. నేడు వాటినే కబళించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొందరిని మరో ప్రాంతానికి తరలించి, ఆ తర్వాత ఇక్కడి స్థలాన్ని ఖాళీ చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అక్కడికి వెళ్లిన వారికి నెల రోజుల తర్వాత పట్టాలు ఇస్తామని చెబుతున్నారని, ఈ వ్యవహారంలో తమను మోసం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేదలను ఖాళీ చేయించబోమని గతంలో హామీ ఇచ్చిన నాయకులు సైతం ఇప్పుడు నోరు మెదపడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.