అమ్మవారి దర్శనానికి అడ్డంకులా..
మంత్రి వస్తే భక్తులను నిలిపివేస్తారా..?
ఆలయంలో తాగునీరు కూడా పెట్టరా..?
చిన్నారులు, వృద్ధుల అవస్థలు
పార్కింగ్ లేక అవస్థలు..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆగ్రహం
స్పాట్ వాయిస్, వరంగల్: భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను ఆపి.. మంత్రి రాకకు దారి సుగమం చేస్తారా? భద్రకాళి సన్నిధిలో సామాన్య భక్తులకు ఒక న్యాయం.. అధికారంలో ఉన్నవారికి మరో న్యాయమా..? శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పర్యటన పేరుతో గంటల తరబడి భక్తులను నిలిపివేయడంపై మండిపడ్డారు. తాగునీరు, పార్కింగ్ వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా భక్తుల విశ్వాసంతో చెలగాటమాడుతున్నారని ఆలయ అధికారుల తీరును విమర్శించారు. అమ్మవారిపై అపార విశ్వాసంతో కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం దేవస్థానం, అధికార యంత్రాంగం బాధ్యత. అయితే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నా తాగునీరు, పార్కింగ్, క్రమబద్ధమైన దర్శన ఏర్పాట్లు సరిగా లేవని రవికుమార్ విమర్శించారు. మంత్రి రాక పేరుతో సామాన్య భక్తులను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను సైతం అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు, పోలీసు యంత్రాంగం భక్తుల ఇబ్బందులను పట్టించుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించడం బాధాకరమన్నారు.
తాగునీరు కూడా పెట్టరా..?
ముఖ్యంగా సరస్వతీ అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా దర్శనానికి వచ్చిన చిన్నారులను గంటల తరబడి నిలబెట్టడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. చంటిపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రద్దీని ముందుగానే అంచనా వేసి ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని ఆరోపించారు. భక్తులకు కలిగే అసౌకర్యం కేవలం నిర్వహణ లోపం మాత్రమే కాదు.. వారి ఆధ్యాత్మిక అనుభూతికి ఆటంకం కలిగించే అంశమన్నారు. అమ్మవారి సన్నిధిలో హోదాలు, పలుకుబడికి తావులేకుండా అందరికీ సమానంగా దర్శనం కల్పించాలన్నదే భక్తుల ఆకాంక్ష. తాగునీరు, మెరుగైన పార్కింగ్, క్రమబద్ధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతోపాటు మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని రవికుమార్ డిమాండ్ చేశారు. దర్శన సమయాలను స్పష్టంగా ప్రకటించి, రాజకీయ లేదా అధికార హోదాతో సంబంధం లేకుండా భక్తుల విశ్వాసానికి గౌరవం ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా దేవస్థాన అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.