రెండు దుకాణాలు దగ్ధం.. రూ.80 లక్షల ఆస్తి నష్టo..
స్పాట్ వాయిస్, నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని అంగడి సెంటర్ ప్రధాన కూడలిలో నెహ్రూ విగ్రహం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో రెండు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.80 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు ఘటనాస్థలాన్ని సందర్శించి బాధిత వ్యాపారులను పరామర్శించారు. 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్, 9వ వార్డు కౌన్సిలర్ కీర్తి దుశ్వంత్ రెడ్డి, 14వ వార్డు కౌన్సిలర్ బుస శిరీష రాజు మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, విద్యుత్ వ్యవస్థపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.