పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం గర్వకారణం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
స్పాట్ వాయిస్, హన్మకొండ: అన్ని కులాలు, వర్గాలకు ప్రజాప్రభుత్వంలో గుర్తింపు లభిస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఈ నెల 22న రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించనున్న నేపథ్యంలో హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో జయంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ ముదిరాజ్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దారం యువరాజ్ ముదిరాజ్తో కలిసి రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన పండుగ సాయన్నను గుర్తుచేసుకోవడం, ఆయన సేవలను భావితరాలకు తెలియజేయడం మనందరి కర్తవ్యమని అన్నారు. అన్ని కులాలు, వర్గాలకు సముచిత గుర్తింపు, గౌరవం కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం బడుగు బలహీన వర్గాల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కృషి చేసిన మహనీయుల చరిత్రను గుర్తించి, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
పండుగ సాయన్న చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలి: దారం యువరాజ్ ముదిరాజ్
దారం యువరాజ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న చేసిన పోరాటాలు, ప్రజాసేవ, ధైర్యసాహసాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పండుగ సాయన్న జయంతి వేడుకల నిర్వహణకు కృషి చేసిన మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.